సంపాదకీయం

‘మృదు మంజుల’ ప్రస్థానం

అనేక మంది భాషా శాస్త్రవేత్తలు, అమోఘమైన భాషా సంపద తమ కరతలామలకమైనా, చేయి తిరిగిన రచయితలు కాలేరు. పాఠకులను రంజింప చేయలేరు. కానీ, అద్భుతమైన వాగ్ధాటితో సభికులను మంత్రముగ్ధుల్ని చేయగలరు. మరి కొంత మంది చేతిలో పట్టాలేమీ లేకున్నా, పటుత్వమైన తమ రచనాశైలితో పాఠకులను ఉర్రూతలూగించ గలరు. అటువంటి అద్భుతమైన కవయిత్రి, రచయిత్రి మంజు యనమదల గారు. ముఖ్మల్ గుడ్డ ఎంతో మృదువుగా ఉంటుందన్న విషయం మీకు తెలుసు. బంగారు కొట్టు షరాబు ముఖ్మల్ గుడ్డ మీద మేలిమి ముత్యాలను కొనుగోలుదారు ముందు పరుస్తున్నప్పుడు సన్నటి మృదుమధురమైన సవ్వడి విన వస్తుంది. అలా వీనులవిందుగా, వినసొంపుగా మాట్లాడే మంజు యనమదల గారి మాటలు మాత్రం, వజ్ర శఖలాలై కువిమర్శకుల, శత్రువుల గుండెలు చీల్చుతాయన్న విషయం వారి అభిమానులకు, స్నేహితులకు తెలిసిందే!

ఆమె చదివింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఉద్యోగం చేసిందేమో అమెరికాలో, హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం. మరి అసలు ఒక్క అక్షరం ముక్క కూడా రాయలేననుకున్న వారు ఇప్పుడు తొమ్మిది పుస్తకాలు రాసి, అలా పక్క పడేసి, పదో పుస్తకాన్ని రాసే ప్రయత్నంలో ఉన్నారు.

మంజు గారు ఫేస్బుక్ మహారాఙ్ఞి. వేలాది మంది అభిమానులు ఆమె పోస్టుల కోసం ఎదురు చూస్తుంటారు. నిశ్చితమైన రాజకీయ అభిప్రాయాలు కలవారు ఆవిడ.

అటువంటి నేపథ్యమున్న మంజు గారు అలవోకగా తొమ్మిది పుస్తకాలు, వేలాది ఫేస్బుక్కు పోస్టులు, బ్లాగుల్లో రచనలు చేయడానికి కారణం ఎడతెగని పఠనాసక్తే. చిన్నప్పటి నుంచీ చదివిన అనేక పుస్తకాల లోని సారానికి తన భావాలను, అనుభవాలను, అభిప్రాయాలను జోడించినందువల్లే
ఆమె రచనలు చేయగలిగారు.

నా ఉద్దేశ్యంలో మంజు గారి సాహిత్య ప్రస్థానం దైవ నిర్ణయం. ఎందుకంటే, పది పన్నెండేళ్ళ క్రితం దురదృష్టవశాత్తు ఆవిడ తీవ్ర అనారోగ్యానికి గురయి ఓ ఇరవై నిముషాల పాటు బ్రెయిన్ డెడ్ అయి, మూడు గంటల పాటు స్పృహ కోల్పోయిన తర్వాత కోలుకున్న ఆమె, మొక్కవోని ధైర్య సాహసాలతో తన రచనా ప్రస్థానం కొనసాగించారు. మృత్యు కోరల్లోంచి బయటకు వచ్చిన ఆమె వల్ల తెలుగు సాహిత్య రంగానికి ఒనగూరే ప్రయోజనాన్ని గమనించే, దేవుడు ఆమెకు పునర్జన్మ ప్రసాదించాడని నేను గాఢంగా నమ్ముతాను.

అందుకని, వారే ఈ వారం సినీవాలి వారపత్రిక ముఖ చిత్ర అతిధి.

కేవలం చదవటం వల్లే రచనలు చేసే శక్తి వస్తుందా అంటే మంజు గారి విషయంలో అదే జరిగింది. కాబట్టి రచనలు చేసే ఒడుపు ఆమెకు చిక్కిందని చెప్పవచ్చును. కాల్పనిక సాహిత్యం, అందులోను పాపులర్ సాహిత్యం విరివిగా చదివారు. అప్పటినుంచే మనసుకి ఏ సంఘటనైనా కష్టం కలిగిస్తే దానిని కథగా మలచడం అలవాటైంది. ఆరవ తరగతిలో వుండగానే మొదటి కథ రాసారు. కానీ ఏ పత్రికకి పంపలేదు. ఆ తర్వాత మిత్రులకి రాసిన ఉత్తరాల రచనే ఎక్కువ. ఉత్తరాల్లోనే చిన్న చిన్న కవితలు రాయటం అలవాటైంది. ఆ కవితల్లో శ్రీశ్రీ గారి ప్రభావం వుంది. మొదటగా అచ్చయిన రచన ‘మౌనం’ కవిత. ఆహ్వానం మాస పత్రికలో వచ్చింది. ఆ తర్వాత కవిత్వ, వచన రచన కొనసాగుతూనే వుంది.

రచన బలవంతంగా చెయ్యటం కన్నా, సహజంగా రాయటమే ఆమెకు ఇష్టం. అంతేకాక, అనిపించిన భావాన్ని అప్పటికప్పుడే రాసేయటం అలవాటు. దానికి కవిత్వం, వచనం మంచి ఉపకరణాలయ్యాయి.

కథ, నవల అంత బాగా కుదరవేమోనన్న అనుమానం ఉంది. ఏదైనా బలవంతంగా రాయటం ఇష్టం లేదు. ఆమె ప్రేరణకి అనుగుణంగా స్వీయకథని, స్వ ‘గతం గా’ ‘కాలం వెంబడి కలం ‘ అన్న పేరుతో రాశారు. దానిలో ఓ జీవితం…’ ఎర్రబస్ టు ఎయిర్ బస్ ‘ అన్న దీర్ఘ కవితను కూడా కలిపి ఓ పుస్తకం వేశారు.

-అక్షరాల సాక్షిగా…నేను ఓడిపోలేదు (కవిత్వం)

  • సడిచేయని(అ)ముద్రితాక్షరాలు (మంజు మనసు ముచ్చట్లు)
  • చెదరని శి(ధి)లాక్షరాలు (కవిత్వం)
  • గుప్పెడు గుండె సవ్వడులు (జంట కవిత్వం మంజువాణి)
  • అంతర్లోచనాలు (మంజు మనసు ముచ్చట్లు)
  • ఏ ‘ కాంతా ‘ క్షరాలు (ఏక్తారలు)
  • అక్షర స (వి) న్యాసం (కవిత్వం)
  • కాలం వెంబడి కలం… అక్షరాలతో అనుబంధం (స్వగతం)
  • అక్షర విహంగాలు (రెక్కలు), వీరి ముద్రిత రచనలు

వీరు అందుకున్న పురస్కారాలు చాలా వున్నాయి.

  • ఫ్రైడ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ‘ కావ్యశ్రీ ‘ పురస్కారం
  • సుధీక్షణ ఫౌండేషన్ వారి ఉత్తమ కవియిత్రి పురస్కారం
    -‘అంతర్లోచనాలు’ పుస్తకానికి ‘గిడుగు’ వారి పురస్కారం, -కవితాలయం నుండి విశిష్ట పురస్కారం
  • 2021 కి ఐడియల్ ఉమెన్ పురస్కారం
  • ఆంధ్రా ఆర్ట్స్ అకాడమి ఉగాది పురస్కారం
  • 2022 లో స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి ‘ నారీ స్పందన ‘ పురస్కారం,
    -పోగుల విజయశ్రీ గారి
    ‘పోగుల వెంకటరత్తమ్మ ఙ్ఞాపకార్థం విశిష్ట సాహితీ పురస్కారం’
    వాటిలో కొన్ని

మల్లెతీగ పత్రికలో జీవన ‘ మంజూ’ ష కాలం, గోదావరి పత్రికలో ఎన్నో సమీక్షలు రాశారు. మంజు గారు నా ‘మీల్స్ టికెట్’ కథా సంపుటిని, ‘పాదముద్రలు’ కవితా సంపుటిని, ‘సినీవాలి’ నవలను సమీక్ష చేసారు కూడా!

నూతన సాంకేతిక మార్పు వల్ల అదనపు లాభాలున్నాయి అన్నది ఆమె అభిప్రాయం. ఆమె బ్లాగు కబుర్లు – కాకరకాయలు లో 2000 కు పైగా పోస్టులు వున్నాయి.

దాదాపు 1977 నుంచి విరివిగా చదువుతున్నారు. అప్పటితో పోలిస్తే రాసే వారి సంఖ్య పెరిగింది. చదివే వారి సంఖ్య తగ్గింది. అలాగే అసలైన ప్రతిభకు సరైన గుర్తింపు లేదు అంటారు మంజు. జరిగిన సంఘటనల్ని రచనలుగా మలచటానికి తక్కువ సమయం పడుతుంది. రాయాలనిపించకుండా ఏదీ రాయలేననీ అంటారు.

మన చుట్టూ జరుగుతున్నవే రచనా వస్తువైనప్పుడు, పాత్రల మధ్య, కుటుంబాల మధ్య సంబంధాలలోని ఉద్వేగం, సున్నితత్వం రచనల్లో బాగా ప్రతిబింబిస్తుందన్న నమ్మకం ఆవిడది. ఆమె రాసిన ‘దూరాన కొండలు’ కవిత పలువురి ప్రశంసలను అందుకుంది.

…..

దూరాన కొండలు…!!

అందంగా అగుపిస్తూ
ఆహ్లాదాన్ని పంచుతూ
ఆకాశాన్ని తాకినట్లనిపిస్తూ
ఆశలకు ఊపిరి పోస్తూ
నిరాశలను పారద్రోలుతూ
విరాగులకు విశ్రాంతి నిలయాలౌతూ
పట్టుదలకు పెట్టని గోడగా
దూరానున్న కొండలయినా
దగ్గరనే ఉన్న అనుభూతినిస్తూ
ఎత్తుపల్లాల జీవితాలను గుర్తుజేస్తూ
ఎదుట పడలేని నగ్న సత్యాలను ఎదలకందజేస్తూ
కనిపించే దూరపు కొండలెప్పుడూ నునుపే మరి….!!

……

మంజు గారు తన జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను గుదిగ్రుచ్చి ‘కాలం వెంబడి కలం’ అని తన జీవిత చరిత్రను రాసారు. దానిలోని ‘నా మాట’ లో చివరి మాటగా,

‘చీకటి సంతకాన్ని వెలుతురు అక్షరాలుగా మార్చాలన్న నా ప్రయత్నం ఎంత వరకు సఫలం అయ్యిందో చెప్పమని’ పాఠకులనే అడిగారు.

ఈ ‘కాలం వెంబడి కలం’ పుస్తకం ముందు మాట రాస్తూ, శ్రీరామకవచం సాగర్ గారు ఈ ఆత్మకథను ‘ఒక పోరాట గాథా చరిత్ర’ అని అభివర్ణించారు.

‘మంజు రచనలన్నీ గొప్ప ఆంతరంగిక పశ్చాత్తాప ప్రకటనలతో నడుస్తాయి. దాని మూలంగా దిగులు, వేదన, సానుభూతి. పోరాట తత్త్వం పాఠకుడికి లోన లోన ముప్పెర కలుగుతుంది.’ అని మంజుగారి రచనలోని ఔన్నత్యాన్ని, ఒక్క వాక్యంలో ఆవిష్కరించారు.

‘ఆత్మకథలు గొప్పవారే రాయాలనే నిషేధాన్ని మంజు తుడిచిపారేసింది.’ అని ప్రకటించారు.

ఒక రచయిత్రి ప్రతిభకు ఇది కదా గీటురాయి మీద గీసిన స్వర్ణరేఖ.

మంజుగారు కొన్ని జానర్లు అంటే సస్పెన్సు, శ్రంగారం, క్రైం జోలికి వెళ్ళక పోవటానికి కారణం వ్యక్తిగత అభిరుచి మాత్రమే!

జీవితం లోని విషాద సంఘటనల్ని మరిచిపోలేదు మంజు గారు. ‘చాలా జ్ఞాపకం వున్నాయి. అయినా ఇరవై నిముషాలు బ్రెయిన్ డెడ్ అయి, జీవితం లో మూడు గంటలు కోల్పోయిన కాలం తిరిగి రాదు కదండీ!’ అంటారు బాధగా

కొత్త తరంలో ఎందరో రచయితలు వస్తున్నారు. ఎదుటి వారిని హేళన చెయ్యకుండా, ఎవరి మనోభావాలు నొప్పించకుండా రాయగలిగితే మంచిది. ముఖ్యంగా కుల, మతాలను అవహేళన చెయ్యకూడదన్నది ఆవిడ అభిప్రాయం.

తను రాస్తాననే అనుకోలేదు. అలాంటిది ఇన్ని పుస్తకాలు అచ్చులో రావడం, ఎందరి అభిమానాన్నో పొందడం, జీవితం లో ఊహించని అదృష్టం. చదువు నేర్పిన గురువులే ఈనాడు తన రచనలని మెచ్చుకుంటుంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది. ఆ సంతోషం మరపురానిది అంటారు మంజు. తన సాహిత్య ప్రస్థానంలో తన మొట్ట మొదటి కవితా సంపుటి గురించి చదివి ‘Your poetry is promising’ అని అర్థరాత్రి 2 గంటల 45 నిముషాలకు ఒక మెసేజ్ రావడం ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ పంపింది ఎవరో కూడా తెలియదు. మరునాటి ఉదయం, తనకు మెసేజ్ చేసిందెవరో తెలుసుకుందామని కుతూహలంతో ఫోన్ చేస్తే, ఆ ప్రశంస, ప్రఖ్యాత విమర్శకులు, నవలా రచయిత శ్రీరామకవచం సాగర్ గారి దగ్గర నుండి అని అర్థమై, ఆమె విస్తుపోయారు. అప్పటి నుండి సాగర్ గారు ఆమెను నిరంతరం ప్రోత్సహిస్తూ, నవల రాయమని ఒత్తిడి చేయడమన్నది తన సాహిత్య ప్రస్థానంలో మరుపురాని ఘట్టమని ఆవిడ భావిస్తారు. తరువాత పాటల రచయిత, అగ్రజుడు భువనచంద్ర గారి ప్రశంస, కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారి ప్రోత్సాహంతో తన రచన ప్రస్థానం సాగిందని అభిప్రాయపడ్డారు.

అమెరికా వెళ్ళటానికి మొదటి సారి విమానమెక్కినప్పుడు భలే సంతోషం, అందరినీ వదిలి ఒంటరిగా వెళుతున్నందుకు బాధా కలిగాయి. అది మంజు గారి వ్యక్తిగత జీవితంలో గట్టిగా ముద్ర పడిన సంఘటన. ప్రాక్పశ్చిమాల సముద్రాల అందాలను ఆస్వాదించడం మరుపురాని అనుభూతి అని మురిపెంగా చెప్పారు.

మంజు గారి నాన్నగారు వైయస్సార్ స్వామి గారు మంచి కవిత్వాన్ని ఆస్వాదిస్తారు. అనేక విద్యార్హతలు, ఉద్యోగ అనుభవాలు ఉన్నా రైతుగా స్వతంత్రంగా పల్లెటూరి ప్రశాంత వాతావరణంలో జీవితం గడుపుతున్నారు. మంజుగారి అమ్మానాన్నలిద్దరూ, ఆమెకు కొండంత అండ. స్వామి గారు నా ‘పాదముద్రలు’ కవితా సంపుటిని చదివి, తను మెచ్చి, వాళ్ళ ఊరిలోని మితృలందరికి చదివి వినిపించారు. వాళ్ళందరికీ నన్ను పరిచయం చేసి, ఫోనులో నాతో మాట్లాడించారు. వాళ్ళ ఊరికి తప్పక రావాలని ఒట్టు వేయించుకున్నారు. అటువంటి తండ్రి కూతురు మంజు గారు.

వారు ఇతోధికంగా మరెన్నో మంచి రచనలు చేస్తూ, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, వారి ప్రతిభకు తగిన గుర్తింపు రావాలని, మనసారా కోరుకుంటూ…. .

డాక్టర్ ప్రభాకర్ జైనీ,
ప్రధాన సంపాదకులు,

‘సినీవాలి’
ఆన్ లైన్ తెలుగు ఉచిత వారపత్రిక.

5 thoughts on “సంపాదకీయం”

  1. సామాన్యురాలికి ఇంతటి గొప్ప స్థానాన్ని అందించిన మీ సహృదయతకు మనఃపూర్వక వందనం ప్రభాకర్ జైనీ గారు. ఊహ తెలిసినప్పటి నుండి చదివిన పుస్తకాలపై ముఖచిత్రాలను చూసి చల్లే బావున్నాయని సంతోషపడిన నా మనసు ఈరోజు మీ చేతుల మీదుగా ఇలా అక్షరాల్లో చూసుకోవడం మాటల్లో చెప్పలేని సంతోషంగా వుంది. 🙏

  2. వాణి కొరటమద్ది

    ప్రియమైన స్నేహితురాలు మంజు గురించి సీనీవాలీ లో రావడం చాలా సంతోషంగా వుంది . చక్కటి పరిచయాన్ని అందించిన ప్రభాకర్ జైనీ గారికి ధన్యవాదాలు . ఆత్మీయ మిత్రురాలు మంజు కి అభినందనలు

  3. డి.సుబ్రహ్మణ్యం

    డా. ప్రభాకర్ జైని గారు బాగా పరిచయం చేశారు మంజుల గారిని.

  4. స్పందించనా అందరికి మనఃపూర్వక ధన్యవాదాలండి

  5. మంజు సాహిత్య ప్రస్థానం… అస్తిత్వాన్ని స్థిర పరుస్తుంది. ఆకాంక్షను ప్రేరేపిస్తుంది. చాలా చాలా స్ఫూర్తివంతంగా ఉంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top