సంపాదకీయం

రేలపూల పరిమళాలను పంచిన రచయిత్రి

సమ్మెట ఉమాదేవి గారు – బడి పిల్లల – ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలోని ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల వింతలు, విశేషాలు, ఆ పిల్లల అమాయకత్వం, వాళ్ళు టీచర్ల పట్ల చూపే అవ్యాజానురాగాన్ని, గొప్పగా ఆవిష్కరిస్తున్న రచయిత్రి. అందుకు వారు ఆ ప్రాంతాల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేయడం వల్ల పొందిన స్వీయ అమృతధారనే వారు మనకూ రచనల్లో పంచారు. స్కూలు పిల్లలు ప్రేమతో ఇచ్చే ఒక చిన్న పువ్వునైనా, పూలగుత్తినైనా అపురూప దృశ్యంగా కెమెరాలో బంధిస్తారు. ఆ ఫోటోలను ఫేస్బుక్కులో కూడా పోస్ట్ చేసి, ఆనందపడి పోతారు. సాహిత్యంలో, ప్రభుత్వ బడిపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుండి రాసిన రచనలతో, ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. వారు, ఈ మాసం మన సినీవాలి ముఖపత్ర అతిథి.

సమ్మెట ఉమాదేవి గారిలోని మరొక సుగుణం, అమెను, ఏ మారుమూల ప్రాంతానికి బదిలీ చేసినా, అక్కడే నివాసముంటూ, ఆ గ్రామీణ, గిరిజన సమాజాన్ని ఆస్వాదించడమే కాకుండా, ఆ పరిస్థితులను, తమ రచనల్లో ప్రతిఫలింప చేసారు. అందుకే వాటికి ఆ సాధికారత లభించి, అనేక పురస్కారాలకు అర్హురాలిని చేసింది.

జీవితంలో అనేక ఒడిదుడుకులకు ఎదుర్కొని తన జీవితాన్ని సాఫల్యం చేసుకున్న – ధీరవనిత సమ్మెట ఉమాదేవిగారు. వారి గురించి వారి మాటల్లోనే…

‘నా చిన్ననాట ఇంట్లో మంచి సాహిత్య వాతావరణం ఉండేది. అమ్మా నాన్నా, మా మేనమామలు బోలెడన్ని వార పత్రికలు, నవలలు తెచ్చేవాళ్ళు. రచనలు చదువుకుంటూ ఆనందించడమే తప్ప రచయితల మీద దృష్టి ఉండేది కాదు. కానీ పెద్దవాళ్లు చలం పుస్తకాలు చదవద్దు అని ఆంక్షలు పెడ్తుండడంతో స్కూల్ బ్యాగులో పెట్టుకుని అవే చదవడానికి ప్రయత్నించేవాళ్ళం. కొకు, రంగనాయకమ్మ, ఎర్రంశెట్టి సాయి, ఆదివిష్ణు, యద్దనపూడి, కోడూరి – ఇలా ఎందరెందరో పేర్లు ఇంట్లో వినపడుతుండేవి ఉండేవి.

మా నాన్న సమ్మెట పోతరాజు గారూ కార్మిక శాఖలో క్లార్క్ స్థాయి నుంచి అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ లేబర్ గా ఉద్యోగ విరమణ చెందే వరకు ప్రతీ 3 సంవత్సరాలకు బదిలీ మీద తిరుగుతూ వరంగల్, నిజామాబాద్, పోచంపాడ్, ముప్కాల్, కరీంనగర్, కొత్తగూడెం, సత్తుపల్లి, ఖమ్మం, మంచిర్యాల, ఆదిలాబాద్, మధిర వంటి ప్రాంతాలలో నివాసం ఉండాల్సి వచ్చింది. ఎక్కడకు వెళ్ళినా ఆ ఊరి ప్రజల ప్రేమను మన్ననలు పొందిన మధురమైన అనుభవాలు ఉన్నాయి.

నాన్న ఉద్యోగపు మొదటి దశలో అంతంత మాత్రం ఆర్థిక పరిస్థితి అరకొర వైద్య సౌకర్యాల వల్ల ఒక చెల్లెలిని, తమ్ముణ్ణి, కోల్పోవలసి వచ్చింది అది మా కుటుంబాన్ని కుదిపేసిన అతి పెద్ద గాయం. చాలా కాలం ఎక్కడకు వెళ్ళినా అమ్మ పెద్ద గొంతుతో ఏడ్చిన శోకం నన్ను వెంటాడేది. కొంత కాలానికి అమ్మే నిలదొక్కుకుని మా అందరినీ నిలబెట్టింది.

ఎప్పుడూ పుస్తకాలు కాగితాలే ప్రపంచంగా ఉంటూ కవితలూ, పాటలూ ఏవేవో రాస్తూ పేపర్లు నింపేస్తుండేదాన్ని. అబ్బో ఒకటా రెండా అప్పట్లో బోలెడన్ని అభిరుచులు ఉండేవి నాకు.. బొమ్మలూ వెయ్యాలని, కార్టూనిస్టునవ్వాలని ఉండేది. రేడియోలో విన్న పాటల్లా పాడేసేదాన్ని. జానపద గీతాలు సేకరించాలని ఉండేది. నాటికలు వార్తలూ వింటూ రేడియోలో ఉద్యోగం చెయ్యాలని కలలు కనేదాన్ని. దానికి తగ్గట్టు నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ లో చదువుతున్నప్పుడు, రోజూ సాయంత్రం అయ్యేసరికి వినాయకుని పందిళ్ళలో ఆ పది రోజులూ మైక్ లో, “ఎస్ ఉమాదేవి ఎక్కడ ఉన్నా రావాలి. వచ్చి పాటలు పాడాలి.” అని పిలుపు వినవచ్చేది. ఒక అయిదారు సార్లు పిలిపించుకుని వెళ్ళి, వచ్చిన పాటల్లా పాడేసేదాన్ని. బోలెడన్ని కథలు చెప్పేదాన్ని. అప్పటి బాల కళాకారిణి అయిన నాకు, ఒకసారెప్పుడో ఒక జ్యోతిష్యుడు ‘ఈమెకు చదువు రాదు. ఎప్పుడూ ఆటపాటలే’ అని చెప్పాడు. నేను అదే బలంగా నమ్మి నాకు చదువు వంటబట్టదు అన్నదానికి ఫిక్స్ అయ్యాను. తరువాతి కాలంలో మేము కరీంనగర్ లో ఉన్నప్పుడు అనారోగ్య కారణాల వల్ల రెండు సంవత్సరాలు బడికి వెళ్ళలేకపోయాను. ఆ కౌమార దశలో దొరికిన పుస్తకమల్లా విరివిగా చదివాను.

చిన్నపాటి అనారోగ్యానికి తోడు చదువును సీరియస్ గా తీసుకోనందుకు పదవ తరగతిలో లెక్కల్లో ఫెయిల్ అయ్యాను. తరువాత నాన్న ఉద్యోగరీత్యా ఖమ్మం వచ్చాము. అక్కడ ఆంధ్ర గాల్స్ కాలేజీలో ఇంటర్ మీడియెట్ తొలి బ్యాచ్ మాది. నాలో విద్యా కాంక్షకు పునాదులు పడింది అక్కడే. మా లెక్చరర్స్ మమ్ముల్ని ఎంతో బాగా తీర్చిదిద్దారు. డిగ్రీ మంచిర్యాలలో చదివాను. చివరి పరీక్ష అయిన మర్నాడే పెళ్ళి. ఓ రెండేళ్లకు కవల పిల్లలు (ఆడపిల్లలు) పుట్టడంతో వాళ్ళ పెంపకంలో అయిదారేళ్ళు గిర్రున తిరిగిపోయాయి. పిల్లలను బడిలో వేశాక మా నాన్న నన్ను మహబూబ్ నగర్ లో బీఈడీ చేయించారు. ఆ తరువాత పుట్టిన పాప ప్రీ మెచ్యుర్డ్ బేబీ అవ్వడం వల్ల కలిగిన అనారోగ్యంతో మళ్ళీ ఒక నాలుగేళ్ళు ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చింది. అనేక తుఫానుల మధ్యన రాసిన DSC లో అంతంత మాత్రపు ర్యాంక్ వచ్చింది. మైదాన ప్రాంతంలో కాకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగం వచ్చింది. అరవయి నాలుగేళ్ల వయసులో నాన్న నాతో పాటు కొంతకాలం ఆ అడవిదారిన నాతో పాటు నడిచారు.
రోజూ మూడు నాలుగు వెహికల్స్ లో ప్రయాణించాక.. ఆరేడు మైళ్ళు నడిచి ఆ ఊరు చేరుకుని.. ఆ ఊరి బడిలోనే నివాసం ఉంటూ చేసిన నా ఉద్యోగ పర్వం గురించి ఒక నవల రాయొచ్చు..

నా జీవితంలో నాకు గొప్ప వరం మా అమ్మా నాన్నలు, మా కుటుంబం. అనేక సంక్షోభాల నడుమ ముగ్గురు ఆడపిల్లలను తీసుకుని పుట్టిల్లు చేరిన మమ్ముల్ని కడుపులో పెట్టుకుని ఆదరించారు. గుండెలోని ఉప్పెనలను రెప్పలు దాటనివ్వకుండా నేను నిలబడి, నా బిడ్డలను నిలబెట్టాను. నా పిల్లలు పడ్డ ఇక్కట్లు ఎవ్వరూ పడకూడదని గిరిజన బడి పిల్లలను ఒడి జేర్చుకుని చెయ్యగలిగినన్ని పనులు చేశాను.

నేను విరివిగా రాసే రచయిత్రిని కాను. ఈ ముప్పై ఏళ్ళ సాహిత్య ప్రస్థానంలో కేవలం130 కథలే రాశాను. 2010 నుండి కాస్త చురుకుగా రచనలు చేశాను.

రచయితలు రాసే కథల్లో కంటే నిజ జీవితాల్లో విషాదాలు ఎంతో క్రూరంగా ఉంటున్నాయన్నది వాస్తవం. చిన్న చిన్న కష్టాలకే కుంగిపోయే వారిని చూస్తుంటే వీళ్ళు ఈ సమాజాన్ని, ప్రపంచాన్ని గమనిస్తున్నారా అనిపిస్తుంటుంది. అసలు సమస్యలూ, సంఘర్షణలూ లేని జీవితాలు చాలా అరుదు. వాటిని ఒక పరిస్థితిగా మాత్రమే భావించి ఎదుర్కోవాలన్న నా వ్యక్తితత్వమే నా కథల్లోని పాత్రల్లో ప్రతిఫలిస్తుంతుందేమో.

నా కథల నిండా ఎక్కువగా స్త్రీల పాత్రలే ఉండడం, ఆ పాత్రలు ఆత్మహత్యల జోలికి వెళ్లకుండా, ఆశావహ దృక్పథంతో జీవితాన్ని నిర్మించుకునే ధోరణిలో ఉండడం విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం. నా కథలు ప్రచురించబడితే మా అమ్మానాన్న ఎంతో సంబరపడేవాళ్ళు.

17 మంది అమ్మల కథలతో నేను వెలువరించిన
‘అమ్మ కథలు’ సంపుటి వేసిన నాటికి అమ్మ (లక్ష్మీ తులసీ బాయ్) కాన్సర్ తో ఈలోకం నుండి నిష్క్రమించడం పెద్ద వెలితి. క్లిష్ట పరిస్థితిలో నన్ను ఎంతగానో ఆదరించిన నా మరో తలిదండ్రులు డా సామల రమేష్ బాబు, దుర్గావతి గార్లకు ‘అమ్మ కథలు’ అంకితమిచ్చాను.

గిరిజన జీవితాలను దగ్గరనుండీ చూసిన అనుభవంతో ‘రేలపూలు తండా వాసుల కథలు’ కథా సంపుటిని నాతో పాటు అడవుల్లో నడిచిన మా నాన్నకు అంకితమిచ్చాను. ‘రేలపూలు’ బంజార వాసుల కథలతో తెలుగులో వచ్చిన తొలి పుస్తకం. బాగా చదువుకున్న తండావాసులకు కొందరికి వారి సంస్కృతి సంప్రదాయాల పట్ల, సమస్యల పట్ల అవగాహన లేకపోవడం గమనించాను. నాటి తరం వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని సేకరించాను. ఇది ఇప్పటి గిరిజన సాహిత్య పరిశోధన విద్యార్థులకు రిఫరల్ బుక్ లా ఉపయోగపడడం సంతోషంగా ఉన్నది.

అటవీ దారుల గుండా ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను, పల్లె అందాలను ఆస్వాదిస్తూ నేను చేసిన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని ఎంతో ప్రేమించాను. ఇక అరకొర సౌకర్యాల మధ్య వెతల జీవితాలు గడుపుతున్న మా బడి పిల్లలు నాకు ఎన్నో అనుభూతులనిచ్చారు, ఎంతో ఆనందాన్ని పంచారు. ఆ సంగతులన్నీ ‘మా పిల్లల ముచ్చట్లు ఒక టీచర్ అనుభవాలు’ పేరిట, మా పిల్లల వందలాది చిత్రాల కూర్పుతో వెలువరించాను. ఈ రకమైన పుస్తకం రావడం కూడా తెలుగులో తొలిసారే.

టెట్రా ఫోకోమెలియ సిండ్రోమ్ తో రెండు కాళ్ళూ, రెండు చేతులూ లేకుండా పుట్టిన నికోలస్ జేమ్స్ వుయిచిచ్ విజయ గాథను ‘నిక్ అంటే ప్రేరణ’ పేరిట రంగుల్లో వెలువరించాను. ఇది కూడా తెలుగులో వచ్చిన తొలి పుస్తకం.

ఉద్యోగ విరమణ తరువాత ‘సమ్మెట ఉమాదేవి కథానికలు’, అనే కథా సంపుటిని వెలువరించాను.

1998 లో ఉద్యోగంలో చేరిన నేను చేసింది కేవలం 21 ఏళ్ళ సర్వీస్ మాత్రమే. 2019 లో ఉద్యోగ విరమణ పొందాక, PURE అనే స్వచ్ఛంద సంస్థలో వాలంటీర్ గా కొన్ని నెలలు పనిచేసినప్పుడు మళ్ళీ బడులకు వెళ్తూ పిల్లలతో గలపగలగడం అదృష్టంగా భావించాను. కానీ ప్రపంచాన్ని కుదిపేసిన కరోనాతో బడులు మూతబడి, నేను చెయ్యాలనుకున్న పనులకు కూడా తీవ్ర ఆటంకం కలిగి కొంత ఆరోగ్యం కూడా దెబ్బ తిన్నది. ఇప్పుడిప్పుడే మళ్ళీ రచనలు కొనసాగిస్తున్నాను.

ఈ సందర్భంగా రచయిత్రిగా, నా జీవితంలోని ఓ మధురస్మృతిని మీతో పంచుకుంటాను.
ఒకసారి నేను బడికి వెళ్ళడానికి అప్పటికే మూడు వాహనాలు మారి ‘ముచ్చర్ల’కు చేరుకుని, భాసిత్ నగర్ కి వెళ్ళే దారిలో ఆటో కోసం ఎదురు చూస్తూ నిల్చున్నాను. అక్కడ నుండి అయిదు కిలోమీటర్ల దూరం, ఆటో దొరకడం చాలా కష్టం. అప్పుడు నా ఫోన్ రింగ్ అయ్యింది.. “అమ్మా ‘రేలపూలు’ చదవడం ఇప్పుడే పూర్తయ్యింది. మమ్ముల్ని ఏదో లోకం లోకి తీసుకెళ్ళావు. మాకు తెలియని, మేము తెలుసుకోవాల్సిన జీవితాల డాక్యుమెంటరీ మాకు చూపించావు.” అని ఒక్కో కథ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. నా ముందు నుంచి రెండు ఆటోలు వెళ్ళిపోయాయి. “నా కథలు పెద్దవి అంటారండి.” అన్నాను “ఎవరికోసమూ ఆలోచించకు నువ్వు మాత్రమే చెప్పగలిగే కథలను రాయకుండా ఆపకు” అంటూ నాలో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపిన. ఆ ఫోన్ కాల్ ఆర్టిస్ట్ చంద్ర గారిది.

పురస్కారాలు రాకపోతే అస్సలు బాధపడను. వస్తే సంతోషమే.

‘అమ్మ కథలు’ పుస్తకానికి కావలి తెలుగు వారధి సంస్థ వారు ఇచ్చిన పురస్కారం, రచయితగా, మహోన్నతమైన వ్యక్తిగా నేను అభిమానించే భువన చంద్రగారి చేతుల మీద అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. తెలంగాణ సాహితీ పురస్కారం; అపురూప విద్యా పురస్కారం; మాడభూషి రంగాచార్య; గోవిందరాజు సీతాదేవి; నందివాడ శ్యామల స్మారక పురస్కారాలు నుంచి.. ఇటీవల అందుకున్న కవితా విద్యా సంస్కృతిక సంస్థ పురస్కారం; మంగాదేవి పురస్కారం – వరకు ఎంతో సంతృప్తినిచ్చాయి.

ప్రస్తుత సాహిత్యం ఆరోగ్యకర స్థితిలో ఉందని భావిస్తాను. గతంలో ప్రేమకథలు, మధ్యతరగతి జీవితాలు, డిటెక్టివ్ సాహిత్యం, కుటుంబ గాథల సీరియల్స్ వచ్చేవి. అప్పుడు వాటిని ఆనందించాము. ఇప్పుడు సామాజిక బాధ్యతతో కూడిన రచనలు వస్తున్నాయి. ఎనభైవ దశకం తరువాత స్త్రీవాద ప్రభావం, తొంభయ్యవ దశకం నుంచీ అస్తిత్వ వాద రచనలు వైజ్ఞానిక రచనలు..వస్తున్నాయి. ముద్రణ పత్రికలు తగ్గుతున్న లోటును ఆన్ లైన్ మ్యాగజైన్స్ భర్తీ చేస్తున్నాయి

నా జ్ఞాపకాల తుట్టెను కదిపి నన్ను నేను ఒకసారి సమీక్షించుకునేలా చేసినందుకు ధన్యావాదాలు.’

ఆమె ఆకాశవాణిలో ఉద్యోగం చేయలేకపోయినా తరువాతి కాలంలో ఆదిలాబాద్ ఆకాశవాణిలో ఆరునెలలు క్యాజువల్ అనౌన్సర్ గాను, TV 5 lo 6 నెలలు వాయస్ ఓవర్ ఆర్టిస్ట్ గాను పని చేశారు. ఉపాధ్యాయినిగా పనిచేస్తూనే ఖమ్మం పాపులర్ ఛానెల్ లో నాలుగేళ్ళు న్యూస్ రీడర్ గా పనిచేసి బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డ్ అందుకున్నారు. అది వారి బహుముఖీన వ్యక్తిత్వంలో మరో కోణం.

జీవితం, అందరికీ పూలబాట కాదు. ముళ్ళబాటల్లో ప్రయాణించిన వారికే, పూలబాటల లాలిత్యం తెలుస్తుంది. మనం ముళ్ళబాటల్లో నడిచామని ప్రపంచానికి మన దుఃఖాన్ని పంచకూడదు.

ప్రజల జీవితాల్లో ‘రేలపూలు’ పూయించి నవనవోన్మేష సుమ సుగంధాలను ప్రసరిస్తూ, దుఃఖభరిత ఈ ప్రపంచంలో ఒక ఆశావహ దృక్పథాన్ని నింపుతున్న, ఉమాదేవిగారు తమ సాహితీ ప్రయాణంలో మరిన్ని ఉత్కృష్టమైన శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ…..

డాక్టర్ ప్రభాకర్ జైనీ,
ప్రధాన సంపాదకులు,

‘సినీవాలి’
ఆన్ లైన్ తెలుగు ఉచిత వారపత్రిక.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top