లత్త… కథ…శీలం భద్రయ్య

దీపావళి పండుగ దగ్గరి కొచ్చింది. చలి పొద్దునాట్టు ఎండకెగిరిపోయింది. కోడలు ఇంటెనకాల పన్జేసుకుంటుంది. లింగమ్మ తొట్లే ఉన్న మనుమడినెత్తుకుని ఎండపొడకు కూసుంది. సలికి పిలగాడు నాయనమ్మను గట్టిగ పట్టుకుండు. పిలగాడ్ని వల్లే కూసోబెట్టుకుంది. అరచేతినావుదమొంపి, మాడున పోసి రాసింది. చీర మోకాళ్ళకాడికి పైకి మడిచి మనుమడిని కాళ్ళమీద బోర్లపండబెట్టింది. ఆముదం రాసి కాల్జేయి సాగదీసింది. ఈపిన మెత్తగ దరువేసుకుంట పాటందుకుంది. నిద్రకొచ్చిన పిలగాడు వూఁ….వూఁ…అనుకుంట నాయనమ్మ పాటకు రాగం కలుపుతుండు.

“జోవచ్చుతానంద జో..జో..ముకుందా! రారా పరమానంద! రారా గోవిందా! నీ పుణ్యమాయే కొడకా! నీవోక్క నిమిషంబు పవలించవేరా! అల్లదిగో బూచొచ్చెరా! గోపాల పవలించవేరా!  బుచేల వచ్చునమ్మ నలినాక్షి!  బుద్దిమంతుడనమ్మానీ పుణ్యమాయే కొడకా! నీవోక్క నిమిషంబు పవలించవేరా!”

***“

అమ్మా !ఆకలి…. అమ్మా….ఆకలి……” ఇంటి ముంగల ఎవలో ముసలాయనొచ్చి అరుస్తుండు. కాదు, బాధగా ఏడుస్తుండు. ఇంటిముంగలెవ్వలొచ్చి చెయ్యిచాపినా తనకంటే ముందే కోడలురుక్కుంటబోయి గింత బువ్వో, కూరో ఏస్తది. కోడలుకినబడనట్టుంది. ఇంటెన్కాలుంది. లింగమ్మ కష్టం తెలిసిన మనిషి. ముసలాయన ఆకలి గోస లింగమ్మ మదికి తగుల్తుంది. లేచింది. నిద్రకొచ్చిన పిలగాడు కెవ్వుమన్నడు. కొడుకేడ్పు విని కోడలురుక్కుంటుచ్చింది. లింగమ్మ పిలగాడ్ని కోడలుకిచ్చి వంటిట్లకి నడిచింది. కోడలు  పిలగాడ్నెత్తుకొని జాలారు కాడికి తానానికి నడిసింది. ముసలాయన సంగతి జూసి పొయ్యి మీద ఏడి నీళ్ళను తెస్తనని కోడలుకు చెప్పి, వంటింట్లకు నడిచింది. గిన్నెలున్న బువ్వతీసుకొని ముసలాయనకేద్దామని బయటి దర్వాజ వైపుకు నడిసింది.అతన్ని చూడంగానే గతం కండ్లల్ల కదిలింది.

***  

పదేనేళ్ళ లింగమ్మ సమర్తాడింది. మేనమామలు చూడోచ్చిండ్రు. సంబురమంతా అయ్య కండ్లల్లనే వుంది. పొద్దుగుకాల అయ్య దావతు పెట్టిండు. లింగమ్మ యింట్లుండగనే మేనమామ సంబంధం తెచ్చిండు. అయ్యతో,  

“బావ ! గానుగుబండ కాడ మంచి సుట్టిరికం వుంది. ఇద్దరన్నదమ్ములు, మూడెకరాల పొలం, గింత చెలకుంది. నువ్వు ఊఁ అంటే సాలు, నేను మాట్లాడత”నన్నడు. 

అయ్య సంబురపడ్డడు. మంచిరోజు జూసుకొని రమ్మని జెప్పిండు.

***

మంచిరోజున ఎడ్లబండొచ్చి ఇంటి ముందాగింది.పిల్లను చూడొస్తానికి నల్గురు మనుసులొస్తమని చెప్పి అయిదుగురొచ్చిండ్రు. మగపెత్తనమున్నట్టుంది. నల్గురు మొగోల్లు, తల్లి వచ్చింది. పిలగాడు మల్లయ్య ఒడ్డుపొడుగుతో బాగుండు. లింగమ్మ మల్లయ్యలు ఒకరికొకరు మెచ్చిండ్రు. చూడోచ్చినోల్లు జంటను జూసి సంబురపడ్తుండ్రు.మల్లయ్య తల్లి లింగమ్మనెగాదిగ జూసింది, అంగడిల గొడ్డును జూసినట్టు జూసి, అనుమానమొచ్చి లింగమ్మ తానకొచ్చింది. పక్కన కూసుంది.కనుబొమ్మలిరిసింది.మొగనికేదో సైగజేసింది. ఆయన పట్టిచ్చుకోలే. ముచ్చట సంబురంల వున్నడు. మల్లయ్య తల్లికి లింగమ్మ నచ్చలేదు. అదే ముచ్చట గట్టిగనే అన్నది. ఆడున్నోల్లల్లో ఆమొక్కతే  నచ్చలేదు. అందరూ ఒక్కపాలి చిత్రబోయిండ్రు.

”ఏవిటికి నచ్చలేదని” పెద్దమనుషులు అడిగిండ్రు. 

”లింగమ్మకు నొష్ట ఎగనాకుడుంది. ఎగనాకుడుంటే లత్త కొడతది, కొడుకు నడమంత్రాన పోతడని” అంది. 
వచ్చిన పెద్దమనుషులు కుడితిల బడ్డ ఎలుకయిండ్రు. నచ్చచెప్పిండ్రు. మేనమావ బుడ్లల్ల ఇప్పసార అందించిండు. మొగోల్లందరు కల్సి గొంతుననిచిండ్రు. మల్లయ్య తల్లిని ఒప్పిచ్చిండ్రు.చూపులైనయి. మాటముచ్చట మిగిలింది. వెయ్యిరూపాలకు కుదరాల్సిన లగ్గం, ఎగనాకుడు సాకుతో రెండువేలకు పెరిగింది. పెట్టుబోతల కింద పిలగానికి భటువు, గడియారం. అయ్య సంబురంగా ఒప్పుకుండు. పిల్లకు కమ్మలు బుట్టాలు, కాళ్ళ పట్టగొలుసులు, నల్లబూసల గొలుసు పెడ్తమని పిలగానోల్లు ఒప్పుకుండ్రు.

బువ్వాల్ల దాటిందని అందరూ బువ్వకు లేసిండ్రు. నాయిన తెచ్చిపెట్టిన జాడిప్పసార సుక్కలేకుండా కతం జేసిండ్రు. అవ్వొండిన బువ్వకుండ అడుగుజూసిండ్రు. గంపకిందున్న మంచి వజనున్న కోడిపుంజు బొక్కలు కూడా మిగల్లేదు. సుట్టిరికం బాగజేసిండ్రని ఉన్నంతసేపయ్యను పొగిడిండ్రు. వరపూజకు నాల్రోజుల్ల వస్తమని తిరుగుబాట పట్టిండ్రు.

*** 

వరపూజకు రెండు ఎడ్ల బండ్లల్లొచ్చిండ్రు.అందరికీ సాపలేసిండ్రు. సరిపోకపోతే ఇంట్ల సెద్దర్లు, గొంగడి తెచ్చి యేసిండ్రు. పెద్దమనుషులకు పీటలేసిండ్రు. ముక్కాల పీట తెచ్చి దానిమీద పసుపు, కుంకుమ బెట్టిన్రు. పిల్లపిలగానికి రెండు పీటలేసిండ్రు. మల్లయ్య, లింగమ్మను ఆటిపై కూసోబెట్టిండ్రు. ఈడుజోడు కుదిరింది. అయ్యఅమ్మ కలిసి పిల్ల పిలగానికి తువాల కప్పిండ్రు.అయ్య పెండ్లికని తొందరమీద పటుపటని కిందిచెలక ఎకరవమ్మితే పదకొండొందలొచ్చినయి. అండ్ల వెయ్యిరూపాయలు వరదచ్చినంగ పిలగాని దండ్రి చేతుల వెట్టిండు.

మిగిల్నయి లగ్గంల బెడ్తనని మాటిచ్చిండు. చుట్టుపక్కల ఆడోల్ల మాటలకు లింగమ్మకు సిగ్గయి బుగ్గలెరుపెక్కినయి. అయ్య మొకాన మురిపెం కనబడ్డది. పిలగాని సిగ్గు బయటపడలే! దాచుకుండు. పిలగాని తల్లి మదిల ఎగనాకుడే ఉన్నట్టుంది. కండ్లల్ల ఆ భయం కన్పడ్డది. తండ్రి మొకంల మాత్రం డబ్బొచ్చిన సంబురం కనబడ్తుంది.నెలరోజుల్లోపే లగ్గంజేయాలని కాయమయిపోయింది. పిల్లపిలగాండ్ల చూపులు కలిసినయి. ఇంటెనకాల కోడికూర, వరి బువ్వాసన ముక్కులకు తగుల్తుంది.

అప్పటికే ఇప్పసార ఒక దమ్ము అందరికీ వంచిండ్రు. లింగమ్మ దోస్తులంత,  ‘నువ్వు శానా అదృష్టమంతురాలివే’ అంటే పొంగిపోయింది. లగ్గంకోటు రాసుకుండ్రు. బువ్వలయినంక వచ్చే బెస్తారంనాడు పిలగానింట్లే లగ్గమని కాయం జేసిండ్రు. పిల్లను తోలుకపోవడాన్కి బుధారం వస్తమని చెప్పిండ్రు.

***

పెండ్లిపనులకు అయ్య అయిరానపడుతుండు. లింగమ్మ ఇంట్లెనే వుంది. ఇంటిపక్కల బిచ్చమన్న వచ్చిండు. 
”తాత ! లింగమ్మ సిన్నమ్మ లగ్గానికి, కులబంతికి పదిజాడిల సార జెప్పాలె, నాలుగు యేటపోతులుతెగాలె” అన్నడు. 
నవ్వి “అట్టాగేలేరా!..” అన్నడు అయ్య. అన్నట్టే ఆ యేడు పండిన పుట్టెడొడ్లు బండమీద ఎండబోసిండ్రు .తెల్లారితే బుధారం. పిల్లగానోల్లు పిల్లను తీసుకబోతరు. ఇంటినిండా పందిల్లేసిండ్రు. బక్కమ్మత్తకెరకలేక పెద్దమాదిగ మల్లన్నను దొర్నంతాడు పేనమని పిలిపించింది. మల్లన్న మంగళారం మంచిదికాదు వద్దని చెప్పిండు. అత్త ఇన్పించుకోలె. పేనతవా ,పేనవాని అన్నమీదకి ఎగబడ్డది. బలవంతంగా మంగళారం గోలిగ దోర్నతాడు అల్లించింది. ఇస్తరాకులు కుట్టడానికని, చెలక్కాడ మోదుగాకులు తెంపుకొద్దమని లింగమ్మ అమ్మతో బాటు చెలక్కాడికి పోయింది. చెలకమ్మితే వచ్చిన మిగిలిన వందరూపాలను పట్టుకొని పెండ్లి సామాను కొనుక్కొస్తనని అయ్య అంగడికి పోయిండు.

***

మోదుగాకులు, మామిడాకులు తెంపుకొని లింగమ్మ అమ్మతో ఇంటిదారి పట్టింది. దొరోరి పొలాల మీదకెళ్ళి చింతచెర్వు కట్ట మీంచొస్తుండ్రు. వగర్సుకుంటోచ్చే బిచ్చమన్నెదురైండు.

“అమ్మమ్మ! తాత సచ్చిపోయిండు.అంగడి కాంచి పీనిగేసుకోచ్చిండ్రు!” అన్నడు. 

అంతే ఇద్దరి చేతుల్లున్న పచ్చనాకులు కిందపడ్డయి. ఇల్లు జేరి, ఇంటిముంగల పీనిగను జుసిందాక అమ్మకు నమ్మకం కలగలే. అమ్మకు దైర్నం మిగల్లేదు.పెండ్లికి రావాల్సిన చుట్టాలు సావుజూసిండ్రు. తెల్లారితే పిల్లను తీసుకబోవాల్సినోల్లు, సావుకొచ్చిండ్రు. కాటిదాంక వుండ్రు. అటునుంచటే పోయిండ్రు. మేనమావ దగ్గరుండి జరగాల్సిన కార్యం జరిపిచ్చిండు. సంబంధం ఎత్తిపోయింది. కుటుంబం తలకిందులయింది.

***

దినాలకొచ్చిన మల్లయ్య తండ్రి వెయ్యిరూపాయలిచ్చి పోయిండ్రు. అమ్మ ఎండిగాజులేసుకొని ఓ మూలన కూసోని యేడుస్తుంది. అమ్మేడ్పాపుదమని దగ్గరకు బోతే బిడ్డను పట్టుకొని ఎక్కిక్కి ఏడుస్తుంది. అంత యేడ్పు దేనికో పిల్లలకర్ధం కాలేదు. బిక్కమొకమేశిండ్రు. తనెనుక పుట్టిన తమ్మున్లకు,చెల్లెండ్లకా గేవ(యావ) లేదు. కొద్దిగ తెల్సిన లింగమ్మ కండ్ల నీళ్ళను దాచుకుంది. అమ్మ ఒరుపున పడేదాంక యాల్లకింత వండేసింది.

***

మూడొద్దుల పిట్టకేస్తుంటే లింగమ్మ రెండోటి అయింది. నేనొస్తనని లింగమ్మ ఎడ్సింది.

”రావొద్దు బిడ్డా!” అని అమ్మలక్కలండ్రు. కార్యం అయిన్దనిపిచ్చిండ్రు.

“పిల్లకెగనాకుడుందని  సంబంధం వద్దనుకుండ్రక్కా!” దినాలకు మావ అసలు ముచ్చట చెప్పిండ్రు.అమ్మ మొకాన నెత్తురు జుక్క లేదు. ఇయ్యపురాలు మాట నిజమయ్యిందని అమ్మ నమ్మిందా లింగమ్మకు తెల్వలే. 

“రేపొద్దున ఈ ముచ్చట బయటకు తెలిస్తే, వచ్చేటోడు గడప తొక్కడు. నల్గురికి తెల్వకముందే దాని నెత్తిన నాలుగిత్తులేయాలని” తొందరపడ్డదమ్మ.

***

మావ ముంగటబడ్డడు. నెలెల్లక తోలిగ పదిదినాలల్ల వల్లభాపురం కాంచి సంబంధం చూడోచ్చిండ్రు. ముగ్గురొస్తమని ఇద్దరే వచ్చిండ్రు. ఈసారి ఆడోల్లు రాలేదు. పిలగాడి తల్లి పడనీయదని తీసుకురాలే. ఒప్పుకుంటే ఈ వూల్లెనే పెండ్లి జేసుకొని ఇంటికి తీసుకుబోతన్నడు. మంచిగ సాదుకుంటని చెప్పిండు. పిలగాడు మరీ ముదరని ఇంటిపక్కల ముసలోల్లు మూతిరిసిండ్రు.

“ఇద్దరు పెండ్లాలు పోయిండ్రు, వయసు ముదరక లేతగుంటడా?” అన్నరు. ఈ సారి లింగమ్మనెగాదిగ జూడలే. ముందే చెప్పినట్టుండు మావ. 

పిలగాడు మాత్రం లింగమ్మ ఎగనాకుడు చూసిండు. ఎగనాయకుడుకు దిగనాయకుడు సంబంధమన్నారంత. జంటను జూసిన జనం, ఈసారి మొకమిరిసిండ్రు. 

“చిన్నపోరిని మూడో సంబంధమెందుకిస్తండ్రని, ఆడపెత్తనమని” అమ్మను నల్గురు నానామాటలండ్రు. అమ్మ మాటలల్ల బలం పోయింది. లింగమ్మకు భరోసా పోయింది. తనెనుకింకా నల్గురాడోల్లు, ఇద్దరు తమ్ముండ్లు.అమ్మ లింగమ్మను అల్కగ ఒప్పించింది. అమ్మ తిప్పలచూసి లింగమ్మకు తలవంచక తప్పలేదు. 

”కట్నం ఐదొందలు. పిలగానికి గడియారం. ఈడనే లగ్గం జేసుకొని పిల్లను తీసుకుబోతమని” చెప్పిండ్రు.

***

ఎల్లమ్మ గుడి కాడ తూ..తూ..మంత్రంగ లగ్గమయిందనిపించిండ్రు. మొగడు జచ్చిన బాధలున్న కుటుంబం. కులబంతి వద్దని కులపెద్దలు పెద్దిరికం జూపిండ్రు. ఎడ్లబండెక్కుతుంటే అమ్మకల్లల్ల బలిచ్చె గొర్రెను జూసినట్టు జూసింది. అంతకు మించేంజేస్తది. ఇచ్చిన కాడ రెక్కలు బారేసుకొని బతుకతని లింగమ్మనుకుంది. అయినోల్లందరికి దండంబెట్టి అత్తగారింటికి తోవదీసింది. దోస్తులు, చెల్లెండ్ల, తమ్ముండ్ల కండ్లల్ల నీళ్ళు చిప్పిల్నయి.

***

లింగమ్మ మొగనితో వూరు జేరింది. మొగని దోస్తులు ఏర్పాట్లు జేసి, వూరిబయట తమ కోసమెదురు జూస్తుండ్రు. 

“ముందు రెండు పెండ్లిల్లకి మేనా పెట్టి,ఈ పెండ్లికి మేనా ఎందుకు పెట్టలేదు?” అని ఆయనను దోస్తు అడిగిండు. 

“అమ్మ మనకు మేనా ఐ రాలేదు, వద్దు బిడ్డాన్నదని” దోస్తులకు జెప్తుండాయన.లింగమ్మ ఇంటికాడ దించిన తల యెత్తలేదు. సిగ్గుతో కాదు, తెగని ఆలోచనలతోటి. బజార్లపంటి నడిపిచ్చుకుంట ఊరేగి,హన్మాండ్లకాడకు తీసుకబోయిండ్రు. బాటెంట గీ చిన్నపోరిని యాడ తోలుకొచ్చిండని జనాలు ముక్కునేలేసుకుండ్రు. బాటెంట సూపు ఆనని ముసలోల్లు అరచేయి నుదుటన బెట్టి చూసిండ్రు. పోరికి నెత్తిన అరజేయంత ఎగనాకుడుందని అంటున్నరు. దాన్ని బాసింగాలు కూడా దాచలేకపోయినయి. ఇంటికి జేరిండ్రు. దేవునింట్ల దీపం ఎలిగించమన్నరు. నల్గురి పెద్దల కాళ్ళు మొక్కిన్చిండ్రు. మొగని మురిపేన్ని దగ్గరోల్లు ఎతేశికం జేస్తుండు. లింగమ్మను సాపేసి కూసబెట్టిండ్రు. లింగమ్మను చుట్టుపక్కలాడోల్లు జూడోచ్చిండ్రు. వరసయినోల్లు పరాసికపు మాటలన్నరు. పిల్ల మూగనోము పట్టిందన్నరు. లింగమ్మకు భయం దైర్నం రెండూ లేవు. అత్త తన పని చేసుకపోతుంది.మాట్లాడలేదు.

***

చుట్టుపక్కలమ్మలక్కలొచ్చిండ్రు. అత్త నర్సమ్మ అజ్జకార్దన్నరు. ఏగలేవన్నరు. అత్త గయ్యాల్దన్నరు. పెనిమిటే ఇంటికి పెద్దకొడుకు. మావ లేడు,అత్త ధాటికి యేనాడో పోయిండు. అత్త మొగనికి మూడో మనువొచ్చింది. అత్త అజ్జకారితనానికి, తన కంటే ముందొచ్చిన యిద్దరు కోడండ్లు నిలవలేదని చుట్టుపక్కలోల్లు చెప్పిండ్రు. అత్త దాటికి వచ్చినోల్లు వచ్చినట్టు పోయిండ్రు. అత్తకు వయసేం పోలేదు. ఈడేరిన ఇద్దరాడపిల్లలు, తరువాత ఇద్దరు మగపిల్లలుండ్రు. వాళ్ళను సాకడానికి స్వార్ధంతో కొడుకు సంసారంల నిప్పులు బోసింది. వచ్చినోల్లను వచ్చినట్టు పంపింది. ఆయన నోట్లే నాలుక లేనోడు. లింగమ్మకర్ధమైంది. తనకిష్టం లేకుండా చేసుకుని తెచ్చిన పిల్ల మీద అత్త మెటికలిరుస్తుంది.

***

ఏగిలిబారనేలేదు.అత్త సెగ తాకింది. బయటరుస్తుంది. 

“నెలెల్లక తోలిగ అయ్యను మింగింది. ముదనాష్టపుదీ కొంపల కాలుబెట్టింది. ఈడ ఎవలికి మూడిందో. నెత్తిమీద అరచేయి మందమెగనాకుడున్న దాన్ని తెచ్చిండు. సంసారం లత్త కొడుతదని జెప్తే ఇన్పించుకోలేదు. ఎవల్ననేం లాభం, నా బంగారం మంచిదైతే కదా, ఈనికి యాడ, పిల్ల దొరకలేదని ఇసుంటి దాన్ని తోలుకొచ్చిండు. బారెడు పొద్దెక్కింది. ఆ ..ఇగ మొగని పక్కల పంతే సంసారం జేసినట్టే”నని నోరుపారేసుకుంటుంది.

ఆయనింకా లేవలే. లింగమ్మ మది చివుక్కుమంది. నిప్పుల మీద కూసున్నట్టుంది. యెంటనే అయ్య గుర్తొచ్చిండు. కండ్లల్ల నీళ్ళు తిరిగినయి. సెల్లెండ్లు, తమ్ముండ్లు పసి కూనలు. కండ్లల్ల మెదిలిండ్రు. కందిరీగల్లా ముసిరిన ఆజ్జన. చటుక్కున మంచం మీంచి కిందకు దుమికింది.

***

అత్త అయిందానికీ, కానిదానికి రాచి రంపాన పెట్టేది. యాదగిరి నరసన్న దయవల్ల ఏడాది తిరక్కముందే లింగమ్మ నీళ్ళు బోసుకుంది. అత్త గుణం మారింది.లింగమ్మ అత్తగుణమెరిగి నడ్సుకుంది. 

“పిల్లకల్సిపోయింది. సంసారం మనదని చేసుకుంటుంది. కడుపు మాడ్సుకొని తన పిల్లలకు కూడా పెడ్తుంది. అంత మీదేసుకొని చేస్తుంది” అని చుట్టుమట్ల అడోల్లకు చెబుతుంటే విన్నది. చెప్పుడు మాటలు చెప్పే ఆడోళ్ళను దగ్గరకు రానియలె. అత్త కోడండ్ల మద్య గాలి కూడా దూరలేదు. ఇన్నాలున్నట్టు నర్సమ్మ లేదు.మారింది, నోరు దగ్గర పెట్టుకుంటుంది. తల్లి బిడ్డల్లా కల్సిపోయిండ్రు. నర్సమ్మకు భయం పోయింది. లింగమ్మకు దైర్నం దొరికింది. 

***

లింగమ్మ అడుగుపెట్టిన కాంచి, బిడ్డోచ్చిన వేళ, గొడ్డోచ్చిన వేళన్నట్టు సంసారం బాగుపడ్డది. పుట్టిన కొడుకుతో బాటు అది ఎదిగింది. పుట్టినింట, మెట్టినింట తోడబుట్టిన వాండ్ల పెల్లిల్లయినయి. లింగమ్మ పిల్లలెదిగిండ్రు. కొడుకాసరయిండు. తరువాత పుట్టిన బిడ్డలకు తిరిగాశపడకుండా మంచి సంబందాలు దొరికినయి. అల్లుళ్ళు మంచోల్లు. అత్తగారి సొమ్ముకు ఆశ పడేటోల్లు కారు. బిడ్డల సంసారం సంబురంగా సాగుతుంది. కొడుకు పెండ్లయి ఇగరంతెల్సిన కోడలు దొరికినందుకు ఏ రంది లేకుండా వుంది.

***

అన్నం పెడతనని పెద్దదర్వాజ కాడికి పోయిన లింగమ్మకు కండ్లు పెద్దగయినయి. తనకొచ్చిన మొదటి  సంబంధం పెండ్లి పిలగాడు మల్లయ్య. ఎగనాకుడు వుందని వద్దనుకున్న సంబంధం. మల్లయ్య గడ్డం మాసిపోయి, జుట్టు పెరిగిపోయి,బట్టసోయి లేకుండ వుండు. పెదాలెంబడి సొల్లుకారుతుంది. మన మతిల లేడు. ఆలోచన్లనే వున్న లింగమ్మ జేతిల బువ్వగిన్నె లాక్కొని గబగబా తింటుండు. లింగమ్మకు జాలేసింది. ఇంతట్లనే కోడలొచ్చింది. లింగమ్మ ముచ్చటంత చెప్పింది.

మాటల్ల మొగడు, కొడుకొచ్చిండ్రు. మతి చెడొచ్చిన మల్లయ్య ఊరికి మనిషిని పంపిచ్చిండ్రు,నా అన్నవాళ్లు ఎవరూ లేరు,పెండ్లాం ఎవనికో ఇంకో మనువు పోయింది. మతిల లేక కాలిపట్టి ఊరూర తిరుగుతుండని తెల్సింది.మనసున్న లింగమ్మ దంపతులు చేరదీసిండ్రు. కడుపుల బెట్టుకొని జూసుకుండ్రు. దీపావళి పండుగ దినాన ఇంటిల్లిపాది టపాకాయలు కాలుస్తుండ్రు. వాటి యెలుగులు భరించలేక భయపడి, లోపల చీకట్ల దాసుకుండు మల్లయ్య. పిల్లలు కాల్చిన భూచక్రాలు, కాలం లాగే గిర్రున తిరిగినయి.మరుసటి ఏడాది దీపావళి దినాన మల్లయ్య పటాసులు సొంతంగ కాల్సిండు. మల్లయ్యకు ఆ యెలుగులల్ల లింగమ్మ మొకంల ఎగనాకుడు తేటగా కన్పడుతుంది.అది ఆమె నొష్ట రాత మార్చిందో లేదో కాని తన నొష్ట గీత మార్సింది. అందరికీ నమస్కారం పెట్టి ఆ యెలుతురులో ముందుకు నడిసిండు.  

+++
లత్త: దరిద్రం జాలారు: అంట్లు తోమే, బట్టలు ఉతికే ప్రదేశం
పొద్దునాట్టు: ఉదయం పూట
రెండోటి: రెండవ నెల బహిష్టు కావడం

31 thoughts on “లత్త… కథ…శీలం భద్రయ్య”

  1. శీలం భద్రయ్య

    ఆర్యా!
    సంపాదకులకు నమస్కారం
    తెలంగాణ భాషా కథలకు పట్టం కట్టడం పట్ల మీ మాతృభాషానురక్తి అవ్యాజమైన మట్టి మమకారం తెలుస్తుంది. “లత్త” కథ ప్రచురించినందుకు కృతజ్ఞతలు. ఈ సందర్బంగా ఒక పత్రికను నడిపడం అంత సులువైనది కాదు. మీ యొక్క సంకల్పం, నిజాయితీ మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
    పత్రికలో చిత్రకారులు ” మాధవ్ ” గారు గీసే చిత్రాలను ప్రత్యేకంగా ప్రస్థావించాల్సిందే. చాలా బాగున్నాయి. మీ నిస్వార్ధ భాషా సేవకు తెలుగుజాతి సాహో అంటుంది. లత్త కథకు గీసిన చిత్రం చాలా బాగుంది. ధన్యవాదాలు

      1. శీలం భద్రయ్య

        మీ అభిప్రాయానికి, అభినందనలకు కృతజ్ఞతలు.

  2. సాగర్ల సత్తయ్య

    తెలంగాణ జీవద్భాషలో చక్కని కథను రాసిన శీలం భద్రయ్య గారికి అభినందనలు. ప్రచురించిన సినీవాలి సంపాదకులు డాక్టర్ ప్రభాకర్ జైని గారికి హృదయపూర్వక ధన్యవాదములు

    1. శీలం భద్రయ్య

      మీ అభిప్రాయానికి, అభినందనలకు కృతజ్ఞతలు.

    1. శీలం భద్రయ్య

      మీ అభిప్రాయానికి, అభినందనలకు కృతజ్ఞతలు.

    1. శీలం భద్రయ్య

      మీ అభిప్రాయానికి, అభినందనలకు కృతజ్ఞతలు.

  3. డాక్టర్ మండల స్వామి

    చక్కని కథ లత్త అందించిన శీలం భద్రయ్య గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. 💐💐💐🤝🤝 సినీవాలి లో ప్రచురించిన సంపాదకులు డాక్టర్ ప్రభాకర్ జైని గారికి హృదయ పూర్వక ధన్యవాదములు 💐💐💐🙏డాక్టర్ మండల స్వామి

  4. జి శ్రీనివాస్

    మూఢనమ్మకాలు నమ్మడం వలన మల్లయ్య జీవితాన్ని కోల్పోవడం, చివరికి లింగమ్మ పెద్ద మనసుతో ఆదరించడంను ఆసక్తిగా నాటకీయంగా చెప్పారు.
    కథనం సినిమాటిక్ గా, ఆసక్తిగా, కొత్తగా బాగుంది. భాష సహజంగా నేటివిటీతో హత్తుకునేట్టు ఉంది. సినీవాలి నిర్వాహకులకు ధన్యవాదములు.
    👌👌💐

  5. కథ చాలా బాగుంది… ముఖ్యంగా తెలుగు కథ తెలంగాణ భాషలో బహుబాగా ఉంది.

  6. కథ ఛాలా బాగుంధి ,ఇంటి కథ అనిపింఛిధి concept ఛాలా బాగుంధి….. థాంక్స్ ఇలాంటి కథ మ ముందుకు తీసుకువఛినంధుకు… I’m proud of u being ur daughter in law always mamaiah

    1. శీలం భద్రయ్య

      మీ అభిప్రాయానికి, అభినందనలకు కృతజ్ఞతలు.మీ అభిప్రాయానికి, అభినందనలకు కృతజ్ఞతలు.

  7. డాక్టర్ సిద్దెంకి

    మంచి కథ అందజేసిన శీలం భద్రన్న లకు
    సంపాదక వర్గానికి కృతజ్ఞతలు అభినందనలు

  8. Poosala satyanarayana

    తెలంగాణ భాష యాస చక్కగా చిత్రీకరించారు. సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టినారు కథనం వెంబడించి చదివించింది ఆసక్తికరంగా ఉంది అభినందనలు

    1. శీలం భద్రయ్య

      మీ అభిప్రాయానికి, అభినందనలకు కృతజ్ఞతలు.

  9. ఈగల స్వరూప్ రెడ్డి

    తెలంగాణ యాస భాష ను చిత్రీకరించారు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే నారు కథ వెంబడించి చదివించింది ఆసక్తికరంగా ఉన్నది అభినందనలు

  10. BHASKARA CHARY

    భద్రయ్య సార్ నమస్తే..లత్త కథ చాలా బాగుంది. తెలంగాణ బాషా,సంస్కృతుల మేళవింపు గా కథ చివరి వరకు అద్భుతంగా సాగింది.

    1. శీలం భద్రయ్య

      మీ అభిప్రాయానికి, అభినందనలకు కృతజ్ఞతలు.

  11. భీక్య మూడావత్

    కథా కథనం చాలా బాగుంది,పాత కాలం నాటి ఒక మూఢనమ్మకాన్ని తీసుకుని , తెలంగాణ యాసలో ,మధ్యమధ్యలో సామెతలు వల్లిస్తూ అద్బుతం గా కథను నడిపించిన మిత్రులు, సహచరులు శీలం భద్రయ్య గారికి అభినందనలు,,ప్రచూరణ కర్తలకు సంపాదకవర్గానికి హృదయ పూర్వక ధన్యవాదాలు.

    1. శీలం భద్రయ్య

      మీ అభిప్రాయానికి, అభినందనలకు కృతజ్ఞతలు.

  12. జె రాజబాబు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ,(బాలురు) డి. వి. కే. రోడ్, నల్గొండ

    అభినందనలు సార్ అద్భుతంగా చక్కగా తెలంగాణ యాస భాష అబ్బురంగా అద్భుతంగా పాఠకులకు చెవులకు ఇంపుగా చదువరులకు సంబరంగా మహదానందంగా ముఖ్యంగా మూఢ నమ్మకాన్నిదాని పర్యవసానాలను చక్కగా వివరించారు కథ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది సార్ మరొక్కసారి మీకు అభినందనలు

    1. శీలం భద్రయ్య

      మీ అభిప్రాయానికి అభినందనలకు కృతజ్ఞతలు

  13. Surya Prakash

    బగ్గ రాసిండ్రు పంతులు. సదువుతుంటె సిన్ననాటి ముచ్చట్లు మెదిల్నయి.

  14. డి.గోవర్థనా చారి నల్లగొండ

    కథ చాలా బాగుంది మూఢ నమ్మకాలను నమ్మ వద్దని తెలుపుతుంది

  15. శీలం భద్రయ్య

    మీ అభిప్రాయానికి, అభినందనలకు కృతజ్ఞతలు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top