మా గురించి

ప్రియ మితృలందరికీ
శుభాకాంక్షలు!


గత సంవత్సరంలో మానవాళి ఒక భయంకరమైన శిక్షను అనుభవించింది. దానికి తోడు తెలుగు సాహిత్యప్రియులు మరి కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కోవలసి వచ్చింది.
గత ఎన్నో ఏళ్ళుగా భాషాభిమానులను అలరించిన వార పత్రికలు, మాస పత్రికలు ఒక్కొక్కటిగా అంతర్థానమయ్యాయి. కరోనా కష్ట కాలం ముగిసిన తర్వాత, సప్త వర్ణాల సీతాకోకచిలుకలు వాలిన పూల చెట్టులా ఉండే మన వీధి మలుపు లోని పుస్తకాల కొట్టు, కొమ్మలు కొట్టేసిన చెట్టులా, ఆకులు రాలిన వనంలా, ఒక్క తెలుగు పత్రిక లేక బోసిపోయి దర్శనమిచ్చింది. సాహిత్యమే నా జీవితమైన నాకైతే గుండె తరుక్కుపోయింది. నాకా మూల మలుపు పుస్తకాల కొట్టు శిథిల చిత్రంలా కనిపించడంతో నిశ్చేష్టుణ్ణై నిలబడిపోయాను. వారపత్రికల స్థానంలో గుట్కా పొట్లాల దండలు కనిపించాయి.
అసలే మన తెలుగు భాష దౌర్భాగ్యమేమో కానీ తెలుగు చదివే పాఠకులు దినదినం తగ్గిపోతున్నారు. దానికి తోడు, ఈ పత్రికల అదృశ్యం తెలుగు భాషాభిమానుల గుండెల్లో గునపాలు గుచ్చింది. మన పక్క రాష్ట్రాలలో సాహిత్య పత్రికలు దినదిన ప్రవర్థమానంగా విలసిల్లుతున్నాయి. వాళ్ళ భాషను, కఠినమైన నిబంధనలను విధించి, ఆయా పత్రికలు కాపాడుకుంటున్నాయి. మన తెలుగు పత్రికలేమో కార్పొరేట్ శక్తుల చేతుల్లో చిక్కుకుని విలవిలలాడి, చివరకు అంతర్థానమయ్యాయి.
ఈ సందర్భంలో తెలుగు భాషాభిమానిగా నేనేమి చేయగలనని తీవ్రంగా ఆలోచించాను. ఇప్పటి వరకు మా “జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్” ద్వారా లక్ష రూపాయల బహుమతులు, పది వేల రూపాయల బహుమతులు వివిధ సాహితీ ప్రక్రియల్లో నిష్ణాతులైన రచయితలకు, రచయిత్రులకు ఇవ్వడం జరిగింది. కానీ, దాని వల్ల వ్యక్తులను గౌరవించుకున్నామన్న తృప్తి తప్ప భాషకు సేవ చేసిన భావన రాలేదు. ఇప్పుడు మరింతగా ఆ బాధ మనసులో సుళ్ళు తిరుగుతుంది.
నాలోని నిరాశానిస్పృహలను పోగొట్టుకోవాలంటే ఏదో ఒకటి చేయాలన్న తపన ప్రారంభమయింది. చాలా మంది పెద్దలు నన్నే పత్రికా ప్రచురణ రంగంలోకి దిగమని సలహా ఇచ్చారు. కొందరు శ్రేయోభిలాషులు వద్దని హెచ్చరించారు.
ఈ పరిస్థితుల్లో, మితృడు మాధవ్ ఒక గొప్ప ప్రతిపాదన తెచ్చారు. నేను వెంటనే అంగీకరించాను. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
అలా, ‘సినీవాలి’ తెలుగు సాహిత్య ఆన్ లైన్ వారపత్రిక, మీ ముందుకు వచ్చింది. మా శక్తి వంచన లేకుండా, ఒక మంచి పత్రికను తీసుకు వస్తున్నాము. కొత్త, పాతా రచయితల రచనలతో మీకు షడ్రసోపేతమైన సాహిత్య విందును అందించాలని మా ప్రయత్నం. ఇప్పటికైతే ఆన్ లైన్ అయినా, అనుభవాలను, ప్రోత్సాహలను బట్టి, ప్రింట్ మాధ్యమంలోకి కూడా రావాలని ఉంది.
మీరు మీ ప్రార్ధనల్లో మన పత్రిక విజయం సాధించాలని కోరుకుని, మీ ఆశీస్సులు మాకు అందించండి.


మీ


ప్రభాకర్ జైనీ

ప్రధాన సంపాదకుడు

Scroll to Top