సంపాదకీయం

కళింగ దేశ సాహితీ సమరాంగణాన..

ఈ వారం ‘సినీవాలి’ ముఖ చిత్రం అట్టాడ అప్పల్నాయుడి గారిది. తెలంగాణా, ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసుల బాధలన్నీ దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. అందుకే ఆ ప్రాంత రచనల్లో మట్టి పరిమళం గోచరిస్తుంది. ఒక రకమైన ఆర్తి గోచరిస్తుంది. నాన్నను తెలంగాణలో ‘బాపూ’ అని పిలుస్తారు. ఉత్తరాంధ్రలో ‘బావూ’ అంటారని నాకిప్పుడే తెలిసింది.

అట్టాడ గారి గురించి చెప్పాలంటే, ఆయన మాటల్లోనే,

‘అగ్నిలోంచి ద్రౌపది పుట్టడాన్ని వ్యాసమహర్షి చూసేడో లేదో గానీ శ్రీకాకుళ విప్లవాగ్నులలోంచి విప్లవ రచయితల సంఘం ఏర్పడడాన్ని చూసేననేవాడు శ్రీశ్రీ! విరసం ఏర్పడకపోతే, మహాకవి శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, కాళీపట్నం రామారావు, రావిశాస్త్రి, భూషణం వంటి రచయితల రచనలు లేకపోయుంటే, నేను చదవకపోయి ఉంటే, నాకు నా జీవితం గురించి తెలిసేది కాదు, నా జీవితం గురించే కాదు, నా ప్రాంత జనజీవితం తెలిసేది కాదు. ఆ తెలిసిన జీవితాన్ని నేను కూడా రాయొచ్చని అసలే తెలిసేది కాదు. రచయితగా నా పుట్టుకకు శ్రీకాకుళోద్యమం ప్రధాన కారణం!’
అన్నారంటే రచయితలు సమాజం మీద, సమాజం లోని పసి మనసుల మీద ఎంత ప్రభావాన్ని చూపి, భవిష్యత్తులో వారిని గొప్ప రచయితలుగా తీర్చి దిద్దుతాయో ఊహించవచ్చును. అందుకే, రచయితలు, ఏదో తమకు తోచిందేదో రాసి పారేస్తే కుదరదు. బాధ్యతగా ఉండాలి. తన రచన ప్రభావం, భవిష్యత్తరాల రచయితల పసి మనసులపై ప్రభావం చూపుతుందనే ఎఱుకతో మెదలాలి. అక్షరాలు వచ్చు కదా అనీ; మనకో భజన బృందం ఉంది కదా అనీ బాధ్యతారాహిత్యంగా రచనలు చేయకూడదని అట్టాడ గారి మాటలకు అర్థంగా నేను భావిస్తున్నాను.

అట్టాడ గారు రైతు కుటుంబం నుంచే వచ్చినా, పగబట్టిన ప్రకృతి, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేయడంతో, తండ్రి కట్టుబాటు, టీచర్ల భయం వారిని చిన్నప్పటి నుండే భయస్తుడ్ని చేసాయి. దానికి తోడు నాగావళి నది ఒడ్డున ఉన్న పొలంలో పంట పండక వారింట ఇనుప గజ్జెల తల్లి నిత్యం నాట్యం చేసేది. ‘ఆ చెరువులు ఎండిపోయేవీ, మా చేలూ ఎండి పోయేవీ. మా ఇంట పొయ్యిల్లో పిల్లులు తొంగొండేవి. మా ఇంటే కాదు మా లాంటి ఇళ్ళళ్ళలోన!’ అని తమ గతాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇంట్లో ఆర్థిక పరిస్థితులు, చుట్టూ ఉన్న వ్యవస్థల మీద తిరుగుబాటు ఉద్యమ వాతావరణంలో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో, దొరికిన సాహిత్యమంతా చదివారు. డిటెక్టివ్ నవలల డిటెక్టివులతో కలిసి దేశవిదేశాల గూఢచారులను పట్టుకుని దేశాన్ని రక్షించారు; ఎమెస్కో పుస్తకాలు చదివి పడవ లాంటి కార్లలో రాజశేఖరాలతో కలిసి తిరిగినా తర్వాత శ్రీశ్రీని, రావిశాస్త్రిని, కాళీపట్నం, భూషణం వంటి వారి సాహిత్యం చదివి నేల మీదకు దిగి అసలు సిసలైన సాహిత్యమేమిటో తెలుసుకున్నారు.

1970 ప్రాంతం ఉత్తరాంధ్రలో, శ్రీకాకుళ పోరాట వీరుల గాథలు యువకులను ఉర్రూతలూగించేవి. వాటికి ప్రత్యక్ష సాక్షి అట్టాడ గారే. పార్వతీపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు జూలై 10 న పార్వతీపురం పోలీస్ స్టేషనుకు శ్రీకాకుళ పోరాట వీరుల మృతదేహాలను తీసుకు రావడం, ఆయన స్వయంగా చూసారు. మనసు వికలమైపోయింది. వారి ఊరికి ఎగువనే ఉద్యమం సాగుతుండడం వలన, చుట్టూ గల ప్రజల జీవన స్థితిగతులు యెరుకయినందున అటువైపు రాజకీయాలను అభిమానించారు. కానీ, ఒక్కగానొక్క కొడుకు ఏమై పోతాడోనని తండ్రి భయపడి, ఊర్లో ఉండొద్దని, విశాఖపట్నం పంపిస్తే అక్కడ దిన కూలీగా, నైట్ వాచ్మెన్ గా, ఎలక్ట్రీషియన్ కి హెల్పర్ గా రకరకాల పనులు చేసారు. కానీ, విశాఖపట్నం జీవితం మీద మనసు లగ్నం కాక తిరిగి ఊరికి చేరుకుని, కొన్ని రోజుల తర్వాత ‘నాగావలి’ పత్రికలో పని చేసారు. అప్పటికే, ఉద్యమ నేపథ్యం, ఉద్యమ భావజాలం ఉన్న అప్పల సూరి గారి అమ్మాయి అరుణను ప్రేమించి పెళ్ళి చేసుకుని, జీవన భుక్తికై నానా కష్టాలు పడ్డారు.

తరువాత, గ్రామీణ బ్యాంకులో టెంపరరీ, పర్మనెంటు ఉద్యోగాలతో వారి జీవితం ఒక గాడిన పడింది.

ఆయన సాహిత్య ప్రస్థానం గురించి ‘అన్నప్రాసన నాడే నువ్వు ఆవకాయ తిన్నావు’ అని కారా మాస్టారు అనడానికి కారణం ఆయన వామపక్ష రాజకీయ భావజాలంతో సాహిత్యంలోకి ప్రవేశించడమే!

శ్రీకాకుళ పోరాటంలోని ఘటనలనేకం కథనం కావలసి ఉన్న సందర్భంలో, మరెవరూ రాయలేక పోవడం వల్ల, తనే పూనుకొని ‘పోడు-పోరు’ కథలతో సాహిత్య సేద్యం మొదలు పెట్టారు అట్టాడ గారు.

శ్రీకాకుళ పోరాట ఉత్తేజంతో ఆ పోరాట ఘటనలు కొన్ని అక్షర బద్ధం చేయాలనుకుని సాహిత్యంలోకి ప్రవేశించినా క్రమక్రమంగా రచయితగా ఎదుగుతూ సామాజిక రంగంలోని అనేక అంశాలను విప్లవ రాజకీయ దృష్టితో విశ్లేషించుకుంటూ రచనలు చేయడం సాగించడం వల్లనే వారికి తెలుగు సాహిత్యరంగంలో ఒక విశిష్ఠ స్థానం లభించింది.

గమ్మత్తుగా, చాన్నాళ్ళు ఆయనను సాహిత్యలోకం రాజకీయ జీవిగా, రాజకీయలోకం అతన్ని సాహిత్యజీవిగా చూసింది. ఇది ఒక విధంగా మనకు గుర్తింపు దక్కలేదని బాధ కలగ చేసినా, మనకు రెండు రంగాలలో విస్తృతమైన, లోతైన అవగాహన ఉన్నదనడానికి నిదర్శనం.

నిజం నిలకడ మీద తేలుతుందన్నట్టుగా, ఆయనను సాహిత్యలోకం మంచి సాహిత్యకారుడిగా గుర్తించనారంభించింది. అందుకు బాగానే కృషి చేయవలసి వచ్చింది నాయుడి గారికి.

జీవన పరిణామ క్రమంలో మనం చూస్తున్న కొత్త జీవితం మన ఆలోచనాసరళిని, జీవితం పట్ల మనకున్న దృక్పథాన్ని మార్చేస్తుంది. ఆ మార్పు మన రచనల్లో తప్పక ప్రతిఫలిస్తుంది. అందుకే అంతకు ముందర చూడనీ, చూపనీ కోణాలను అతని రచనలు చూపడం ఆరంభించాయి. సాహిత్యం మీద కలిగిన పట్టు వలన శిల్ప ప్రయోగాలను చేయడం ఆరంభించారు.

సాహిత్యంలో నాయుడుగారి మారిన దృక్పథం కొందరికి నచ్చలేదు. అందుకాయన, ‘నిజానికి నేను రాజకీయంగా వామపక్షం నుంచి మరలి పోలేదు. వామపక్ష పార్టీల పట్ల విమర్శనాత్మకంగా ఉన్నానంతే!’ అంటారు.

“… గత ఉద్యమాలు, ఆకాంక్షలు, ఆశయాలు, త్యాగాలు.. నిత్య ఆందోళనలు.. మండిన, మండుతోన్న అగ్నిగుండం నా కళింగం! ఈ అగ్నిజ్వాలలు నా నిండా… నా సాహిత్యం నిండా…! ఒక ప్రశాంతత, ఒక ప్రకాశిత ఉదయం, ఒక కార్తీక పున్నమీ.. కళింగం స్వప్నిస్తోంది. కళింగమే కాదు దేశం, దేశమే కాదు.. ప్రపంచం… ఈ స్వప్నాన్ని కంటోంది. ఆ స్వప్నమే నా రచనల.. వెనుక” అని గర్వంగా తన వసుధైక కుటుంబ ఆశయాన్ని వెలువరించగలిగిన ఆదర్శ మూర్తి అట్టాడ గారి రచనలు అవే గుణగణాలను ప్రతిఫలిస్తాయి.

అట్టాడ అప్పల్నాయుడు గారి పరిణితి చెందిన సాహిత్య ప్రస్థానానికి చెందిన ఈ మాటలు బంగారానికి తావి అబ్బినట్టుగా ఉన్నాయి.

అట్టాడ అప్పల్నాయుడు గారిని మీ జీవితాన్ని మలుపు తిప్పి సంఘటన గురించి చెప్పమంటే తన భార్యతో జరిపిన ప్రేమాయణం, వివాహమే తన జీవితంలో అత్యంత ప్రభావవంతమైన సంఘటనగా భావించారు. తన వామపక్ష, తీవ్రవాద భావజాలానికి అనుగుణమైన భావాలు ఉన్న, యాక్టివ్ నక్సలైట్ అప్పల సూరి గారి కూతురైన అరుణను చేసుకోవడం తనలో చాలా మార్పులు తెచ్చిందని భావించారు. తన జీవన సహచరి 2014 లో తనను వీడిపోవడంతో తీవ్ర విషాదానికి గురయి, ఇప్పటికీ ఒక లుప్త భావనతో జీవిస్తున్నారు.

వారికి తన బృహన్నవల {మాగ్నం ఓపస్: Magnum opus} ‘బహుళ’ ను గత సంవత్సరంలో పబ్లిష్ చేయడం, డెబ్భై కళా సంఘాల సమక్షంలో అంగరంగ వైభోగంగా, శ్రీకాకుళంలో ఆవిష్కరించబడడం తన జీవితంలో మరుపురాని సంఘటనగా భావించారు. ఉత్తరాంధ్ర వందేళ్ళ సామాజిక ప్రయాణాన్ని ప్రతిబింబించే తన నవలలో ఐదు తరాల జీవన విధానాన్ని సాంస్కృతిక, సామాజిక విప్లవాలను చూపించే ప్రయత్నం చేయడం; 160 పాత్రలు, 467 క్రౌన్ డెమ్మీ సైజు పేజీలున్న ‘బహుళ’ నవలలో బహుశా తనకు ముందున్న జమీందారీ, తన కాలపు విప్లవోద్యమాలు, ప్రస్తుత పరిస్థితులను ఆవిష్కరిస్తూనే, తన జీవితాన్ని కూడా దర్శించుకున్నారని నేననుకుంటాను.

సమాజంలో జరుగుతున్న అన్ని పరిణామాలనూ, సాహిత్యం రికార్డు చేయాలి, అది మంచైనా చెడైనా. చేసి, మంచి విషయాల వల్ల సమాజం ఏ విధంగా పురోగమిస్తుందో తేలియచేయాల్సిన బాధ్యత రచయితల మీదే ఉంది.

కానీ, ఇప్పుడు సాహిత్యం కూడా కార్పోరేట్, రాజకీయ శక్తుల గుప్పిట్లో ఉంది. ప్రజలను పెను నిద్దుర నుండి మేల్కొలిపి, అన్యాయాన్ని ఎదురించమని ప్రబోధించే సాహిత్యాన్ని చీకటి గదుల్లో బంధించి ఉంచుతారే తప్ప వెలుగులోకి తెచ్చి, తమ గొయ్యిని తామే తవ్వుకుంటాయా ఇప్పుడున్న వ్యవస్థలు?

అందుకే ప్రతీ తరంలోనూ ప్రశ్నలు పుడుతూనే ఉన్నాయి. యువత ఈ అసంబద్ధతలనూ, అన్యాయాలను ప్రశ్నిస్తూనే ఉంది.

కానీ, దురదృష్టవశాత్తూ, ఆ ప్రశ్నలు కూడా నేడు కులం, మతం, ప్రాంతం, జాతి రంగులను పూసుకుంటున్నాయి.
సమాజం గురించి ప్రశ్నించడం మాని తమ కులం, తమ మతం, తమ పార్టీ, తమ వాదం గురించే ప్రశ్నిస్తున్నాయి. దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన వారిని కూడా కులాల తరాజులో కొలుస్తున్నారు. మా కులం వాడు ఐఏఎస్ అయ్యాడని, మా కులం అమ్మాయికి మెడిసినులో సీటొచ్చిందనీ, మా కులం పిల్లలకు బంగారు పతకాలు వచ్చాయని గర్వంగా, సిగ్గు లేకుండా ప్రకటనలు ఇచ్చుకుంటున్నాం కానీ వారంతా మా దేశ పౌరులమని చెప్పుకోలేక పోతున్నాము. ఒకవేళ ఆ పిల్లలే బంగారు పతకాలు, ఐఏయస్ లు తెచ్చుకోకపోతే మీ కులం వాళ్ళు కారా? అప్పుడు దేశం మీదకు వదిలేస్తారా? కులం బలం వల్ల వాళ్ళు విజయాలు సాధించలేదన్న ఇంగితఙ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. అప్పటి వరకు వాళ్ళకు ఏ మాత్రం ప్రోత్సాహం, సహాయం అందించని వాళ్ళు, వాళ్ళు తమ స్వశక్తితో, నిర్విరామ కృషితో, సమస్త సమాజం యొక్క వనరులను వినియోగించుకుని, గెలుపు సాధిస్తే, మీ కులంలో కలిపేసుకుంటారా?

అందుకే, సమాజం ప్రస్తుతం, ఒక నీరవ నిశ్శబ్ద సమాధి స్థితిలోకి జారుకుంటుంది. చైతన్యరహితంగా మారబోతుంది. ఆర్థికంగా మనం అద్భుతాలు సృష్టించవచ్చు గాక. బుల్లెట్ ట్రైనులు వేసుకోవచ్చు గాక. బిలియనీర్ల జాబితాలోకి ఎక్కవచ్చు గాక. కానీ, పేదవాడి పళ్ళెంలో బుక్కెడు బువ్వ మూడు పూటలా దొరుకుతుందా లేదా అని కూడా చూడాలి కదా?

అట్టాడ అప్పల్నాయుడు గారు, ‘ఉరకవే’ అనే సంస్థకు అధ్యక్షుడుగా ఉన్నారు. కళాకారులను పరుగులు పెట్టించే
‘ఉత్తరాంధ్ర రచయితల కళాకారుల వేదిక’ కు మెరుగులు దిద్దుతున్నారు. ఇటువంటిదే వరంగల్ సాహిత్యాభిమానులు నెలకొల్పిన ‘ఉపాసం’ (ఉత్తమ పాఠకుల సంఘం) అనే సంస్థ ఉంది.

అట్టాడ అప్పల్నాయుడు గారి సాహిత్య ప్రస్థానం మరిన్ని వెలుగు జిలుగులతో వైభవంగా వెలిగిపోవాలని ఆశిస్తూ….

డాక్టర్ ప్రభాకర్ జైనీ
ప్రధాన సంపాదకులు,
‘సినీవాలి’ ఆన్లైన్ తెలుగు సాహిత్య వారపత్రిక

5 thoughts on “సంపాదకీయం”

  1. కె.వి.దుర్గా మోహన రావు.

    ప్రముఖ రచయిత అట్టాడ అప్పల్నాయుడు గారి పరిచయం చాలా బాగుంది. ఉత్తరాంధ్ర లో ప్రముఖ రచయిత గా ఎదిగిన వారి సాహిత్య ప్రస్థానం వైభవంగా వెలిగిపోవాలని ఆశిస్తూ వారిని పరిచయం చేసిన సంపాదకులకు ధన్యవాదములు.

  2. అట్టాడ అప్పలనాయుడు గారి పరిచయ కార్యక్రమం చాలా బాగుంది.గతంలో ఇంత వివరంగా ఒక రచయిత గురించి ఏ పత్రికలోనూ వచ్చినట్టుగా నేనైతే చూడలేదు.మూస పత్రికలకు భిన్నంగా సినీ వాలీ ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తోందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.ఈ పత్రిక కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు

  3. నరహరి రంగరాజు

    అభినందనలు సార్ చాలా అద్భుతంగా చెప్పారు రచయిత గారి గురించి అలాగే నాటి నుండి నేటి వరకు ఉన్న రచయితలు, ప్రాంతాల గురించి 💐👌🎉👍🙏

  4. మీ సంపాదకీయ వ్యాసం అద్భుతం. పత్రిక గొప్ప సాహిత్య విలువలను కలిగి ఉంటుంది. మీ శ్రమకు జయహోలు.
    నిజమే…. “రచయితలు, ఏదో తమకు తోచిందేదో రాసి పారేస్తే కుదరదు. బాధ్యతగా ఉండాలి. తన రచన ప్రభావం, భవిష్యత్తరాల రచయితల పసి మనసులపై ప్రభావం చూపుతుందనే ఎఱుకతో మెదలాలి. అక్షరాలు వచ్చు కదా అనీ; మనకో భజన బృందం ఉంది కదా అనీ బాధ్యతారాహిత్యంగా రచనలు చేయకూడదని” అట్టాడ గారి మాటలను నేను కూడా ఏకీభవిస్తున్నాను.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top