ఎగురుతున్న జెండా మనది (17వ భాగం ) – డా.ప్రభాకర్ జైనీ

(గత సంచిక తరువాయి)…  ఫోన్లో మాట్లాడుతూ చారిగారి వైపు చూసాడు.

“ఒక్క నిముషం! ” అని చారిగారితో “డిఫెన్స్ మినిస్టర్ గారు” అని అన్నాడు.

చారిగారు మాట్లాడనన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు.

“సారీ సార్! వాళ్ళ నాన్న గారు చాలా బాధలో ఉన్నారు. సరే సార్! సరే సార్! నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్!” అని ఫోన్ పెట్టేసాడు.

చారిగారు పూజారిని చూసి “టైమెంతయింది?” అని ప్రశ్నించారు.

“పన్నెండున్నర కావొస్తుంది!”

“అయితే అందరినీ భోజనాలకు లేపు. నేను ఈ లోపల కొండ పైకి, గుడికెళ్ళి వస్తాను.”

“స్వామీ… గుడికి….? “

“గుళ్ళోకు వెళ్ళను. నాకు తెలుసు. అమ్మగారిని ఓదార్చండి!” అంటూ కొండ వైపుకు సాగారు. అడుగులు మెల్లిగా పడుతున్నాయి. ‘పై వరకు వెళ్ళగలడా?’ అని రామశాస్త్రికి సందేశం కలిగింది.

కానీ, చారిగారికన్నా శార్వరి గారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఆమె సొమ్మసిల్లి పడి పోయి ఉంది. లక్ష్మి ఆమెకు సపర్యలు చేస్తుంది. ఒక్క ఘడియలోనే భార్యాభర్తలిద్దరూ వయసుడిగి పోయిన వారిలా, వృద్ధాప్యం పైబడిన వారిలా డస్సి పోయారు.

ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. పూజారి ఫోను తీసుకున్నారు.

“బాంబు పేలుడులో నర్సింహ బాడీ పూర్తిగా ఛిద్రమైంది. గుర్తు పట్టలేకుండా ఉంది. ఢిల్లీకి ఏర్ లిఫ్ట్ చేస్తున్నాము. మీ కోరిక చెప్తే ఇక్కడ ఢిల్లీలో కానీ లేదా మీ ఊళ్ళో కానీ పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని” సీనియర్ అధికారి చెప్పారు.

“మేము ఆలోచించుకుని చెబ్తాము. సాయంత్రం ఫోన్ చేస్తారా సార్!”అని అడిగాడు పూజారి.

వాళ్ళు సరేననడంతో ఫోన్ పెట్టేసాడు.

కొండ వైపు చూసాడు.

చారిగారు మెల్లిగా కొండ ఎక్కుతున్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కడమే గగనంలా ఉన్నట్టుంది. వారికి పది అడుగుల వెనుక సాంబడు ఉన్నాడు. అతను కూడా ఏడుస్తున్నాడు. కానీ, వారి దగ్గరకు వెళ్ళడానికి సాహసించడం లేదు.

కొండ మీద రావి చెట్టు క్రింద చప్టా మీద కూర్చుని, మూసి ఉన్న దేవాలయం వైపే చూస్తున్నారు చారిగారు.

‘ఒక్కగానొక్క కొడుకు. దేశసేవ అంటూ పోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చాలా చిన్నప్పుడు నర్సింహ ప్రతీ రోజూ తనతో పాటు కొండ ఎక్కే వాడు. ఐదారేళ్ళుంటాయేమో అప్పుడు. చకచకా తనకన్నా ముందే కొండ ఎక్కి తనకు ఎదురొచ్చేవాడు. లేకపోతే ఏదో చెట్టెక్కి ఆటలాడుతుండే వాడు.

తనతో పాటు అడవిలోకి వచ్చి చెట్ల బెరళ్ళు, ఆకులు, కొమ్మలు సేకరించడంలో తోడ్పడే వాడు. ఔషధ మొక్కల గురించి ఒక్క సారి చెప్తే గుర్తుంచుకునే వాడు. చెట్ల గురించి ఎంతో పరిఙ్ఞానం ఉండేది. ఎప్పుడైతే వాళ్ళ మేనమామల ఇంటికి సెలవులకు వెళ్ళి వచ్చాడో అప్పటి నుంచి మారి పోయాడు. విమానం బొమ్మలు, పైలట్ డ్రెస్సులు, కంప్యూటర్ గేమ్స్ అంటే మోజు పెరిగింది. కొండకు వచ్చేవాడు కాదు. రోగులను చూసి విసుక్కునే వాడు. మెల్లిగా తమ మధ్య అంతరం పెరిగింది. వాడు పై చదువులకు మేనమామల ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఆ అంతరం అగాథంగా మారింది. తమకు చెప్పకుండా పెళ్ళి చేసుకోవడంతో బంధం కట్ అయింది. ఎక్కడో ఒక చోట, సుఖంగా ఉన్నాడులే అని అనుకుంటే ఈ ఘోరం జరగడం….’

చారిగారి కళ్ళల్లో నుంచి నీరు ధారగా స్రవిస్తుంది. ఆలోచనల గొలుసు తెగింది.

“బాధను తను ఓర్చుకోగలడు. కానీ, శార్వరి ఎలా తట్టుకుంటుందోనన్న భయం అతన్ని పీడిస్తుంది. బాల్యం నుంచి తల్లితో నర్సింహకు అటాచ్ మెంట్ ఎక్కువ. శార్వరి కోసమైనా తను ధైర్యం ప్రదర్శించాలి. నేను బేలగా ఉంటే శార్వరి ఇంకా కృంగి పోతుంది.” అని అనుకుంటూ ఆలోచనల్లో నుండి తేరుకుని

“శివా! నీ ఆఙ్ఞ లేనిది చీమైనా కుట్టదని రోజూ వందల సార్లు చెబుతుంటాను. మరి ఏమిటీ పరీక్ష? ఎందుకీ పుత్ర శోకం….” అని అనుకుంటూ క్రిందకు దిగడం ప్రారంభించాడు.

కొంచెం దూరం దిగగానే ఎదురుగా శార్వరి కొండ అంచున కట్టిన పిట్ట గోడ మీద కూర్చుని కన్పించింది. గబగబా నడిచి ఆమెను చేరుకుని తన కౌగిట చేర్చుకున్నాడు. ఆమె భర్త భుజం మీద తల ఆనించి పొగిలి పొగిలి ఏడ్చింది. కాసేపటికి ఆమె తేరుకుంది.

ఆ వృద్ధ దంపతుల శోకాన్ని చూసి ప్రకృతి కూడా నిర్విణ్ణమయింది. నీరవ నిశ్శబ్దమైపోయి సంతాపాన్ని ప్రకటించింది. ఆకులు రాలుస్తూ దుఃఖాన్ని పంచుకుంది.

“శారూ! నీ కొడుకు దేశమాత ఋణం తీర్చుకున్నాడు. వీరమాతగా గర్వించు. ఏడవకు. సరేనా!” అని ఓదార్చాడు.

ఇద్దరూ కలిసి కిందికి దిగొచ్చి,  నిరాహారంగానే, ఆ రోజు మిగిలిన రోగులకు మందులు వితరణ చేసి పంపించారు.

ఫోన్ వచ్చిన విషయం చెప్పాడు రామశాస్త్రి.

చారిగారు, 

“నా కొడుకు ఇక్కడి మట్టిలోనే కలవాలి” అని స్థిరంగా చెప్పాడు.

అదే విషయం పూజారి అధికారులకు చెప్పాడు. ఒకటి రెండు రోజుల్లో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి బాడీని తీసుకొస్తామని వారు చెప్పారు.

సశేషం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top