సంపాదకీయం

అపురూప రూపశిల్పి మా ఉదయ్ భయ్యా!

గీతల్లో జీవితాన్ని…
రంగుల్లో అంతరంగాన్ని ఆవిష్కరించి…
అలౌకికమైన ఆనందాన్ని కలిగించే అపూర్వమైన చిత్రకారులు మార్లపూడి ఉదయ్ కుమార్ గారు. మా ఇద్దరికీ అంతకి ముందు పరిచయం లేదు. కేవలం ఫేస్బుక్కు పుణ్యమా అని లభించిన స్నేహ రత్నం. ఆయన నా నవలల పట్ల ఆకర్షితులయ్యారు. తరువాత నేనతని చిత్రకళా, శిల్పకళా నైపుణ్యానికి అచ్చెరువొందాను. ఆయన గొప్ప స్నేహ హృదయానికి నిదర్శనంగా జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. ఒకరోజు మధ్యాహ్నం, ‘లక్డీ కా పూల్ లోని ఒక హోటలుకు రాగలవా భయ్యా?’ అని ఫోన్ చేసారు. నేను సరేనని వెళ్ళాను. ఆయన హోటల్ గదిలో కూర్చుని, ఒక శిల్పానికి చివరి మెరుగులు దిద్దుతున్నారు. చూద్దును కదా, అది ‘కాళోజీ గారి’ శిల్పం.

నేను ‘ప్రజాకవి కాళోజీ’ సినిమా తీస్తున్నానని తెలిసి, నా మీద అభిమానంతో, పాలకొల్లులో తయారు చేసి, అంత పెద్ద భారీ విగ్రహాన్ని, హైదరాబాదుకు తీసుకు వచ్చి, నాకు బహుకరించారు. ఆ శిల్పం నా సినిమాలో చాలా చోట్ల కనిపిస్తుంది. అటువంటి ఆప్యాయతలకు నోచుకోని నా కళ్ళు చెమ్మగిల్లాయి. అదే, ఈ మాసపు కవరు పేజీ మీద ఉన్న చిత్రం. ఆ ముఖపత్త అతిథే – ప్రప్రథమ ‘చిత్రకళావధాని’ ఉదయ్ కుమార్ మర్లపూడి గారు.

పాలకొల్లును, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శిల్పకళా కేంద్రంగా మార్చిన ఘనుడు.

లలితకళలకు పుట్టినిల్లు అయిన పాలకొల్లులో జన్మించి – మూడో ఏటనే, అక్షరాలు దిద్దే వయసులోనే ‘అందమైన గుఱ్ఱపు బండి’ చిత్రం వేసి దీవెనలు అందుకొన్నారు ఉదయ్.

ఆరో సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో చిత్రలేఖన పోటీల్లో, తాజ్ మహాల్ ముందు జ్ఞాపకాన్ని నెమరువేసుకొంటూ గులాబీ ‘పుష్ప సువాసనను ఆఘ్రాణిస్తున్న షాజహాన్’ బొమ్మను “కళాప్రియ” పేరుతో ప్రదర్శించిన ఉదయ్ చిత్రానికి పండిత పామరుల ప్రశంసలతో పాటు ‘బంగారు పతకం’ లభించడం ముదావహం.

తొమ్మిదో ఏటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ ఆర్ట్స్ అకాడమీల నుంచి అనేకానేక బహుమతులు, పురస్కారాలు అందుకొని ‘ఉదయ్ గనుక చిత్రకళా పోటీల్లో పాల్గొంటే బహుమతి అతనికే రిజర్వ్ డ్’ అన్న నానుడి సంపాదించుకున్నాడంటే అది మామూలు విషయం కాదు.

పన్నెండో ఏట నిడదవోలు భారత స్కౌట్స్ గైడ్స్ క్యాంపులో శ్రీ వంగా నరసింహారావు గారి ప్రోత్సాహంతో ఉదయ్ మొట్టమొదటి ‘వన్ మేన్ షో’ ప్రదర్శనతో అప్పటి విద్యాశాఖామంత్రి – శ్రీమండల వెంకట కృష్ణారావుగారి స్పాట్ పెయింట్ వేయగా మంత్రి ఆశ్చర్యపోయి – ఉదయ్ ని కౌగిలించుకొనడం, ఉదయ్ చిత్రకళా మధురస్మృతి.

ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నప్పుడు ‘క్రియేటర్’, ‘ఊర్వశి’ ‘పురూరవ’, ‘విదురపత్ని’ ”కృష్ణభక్తి’, ‘కిడ్ ఆర్టిస్ట్’ ‘ఉదయ్: 2020 ఎ.డి.’, ‘నా తరమా భవసాగరమీదను’, ‘మనతల్లి అన్నపూర్ణ’. ‘ఇలబ్రహ్మ’… ఇత్యాది చిత్రాలు ఉదయ్ సృజనాత్మక శక్తికి, భావజాలానికి ఉదాహరణగా నిలుస్తాయి.

ఎనాటమిపై మరింత స్టడీ చేసి న్యూడ్ పెయింటింగ్స్ కోసం మోడల్సును ఉపయోగించడం అప్పట్లో విశాఖపట్నంలో సంచలనవార్త అయ్యింది.

1982 లో పాలస్తీనా విమోచన ఉద్యమం’ సందర్భంగా ఉదయ్ వేసిన రెండు పోస్టర్ డిజైన్స్ అంతర్జాతీయంగా సంచలనం సృష్టించాయి.

1985 ‘ఇన్కార్’ అనే జాతీయ సముద్రతీర ప్రాంత పరిశోధనా సంస్థ కోరిక మేరకు శ్రీ ఉదయ్ సముద్రతీర ప్రాంతంలో తుఫానుకు ముందు, తర్వాత ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై 3 గంటల నిడివి గల వీడియో చిత్రానికి అవసరమైన పెయింటింగ్స్ వేసి జాతీయ, అంతర్జాతీయ సముద్ర వైజ్ఞానిక సంస్థల ప్రశంసలు పొందారు.

విశాఖ స్త్రీ సంక్షేమ శాఖ దశమ వార్షికోత్సవం సందర్భంగా స్త్రీ సమస్యలైన ‘బాల్యవివాహాలు, విద్య, వరకట్న మరణాలు’ వంటి సృజనాత్మక చిత్రాలు అధికారులను, చూపరులను ఆలోచింప చేశాయి.

1991లో ప.గో. జిల్లా లోని పాలకొల్లు ‘హరివిల్లు ఆర్ట్స్ అకాడమి’ని స్థాపించి చిత్రకళారంగాన్ని ప్రోత్సహిస్తూ, పోటీలు నిర్వహిస్తూ, ఔత్సాహిక కళాకారులను తీర్చిదిద్ది వినూత్న సేవలు ఉదయ్ అందిస్తున్నారు.

1992 అకాడమీ వార్షికోత్సవంలో కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రస్థాయి ఎగ్జిబిషన్ అపూర్వంగా నిర్వహించి. అద్భుతమైన కళారూపాల్ని ప్రదర్శించి ప్రేక్షకులకు కనువిందు చేశారు. ఆ సందర్భంగా అద్భుత చిత్రాల్ని చిత్రించిన చిత్రకారుల్ని ఆయన ఘనంగా సత్కరించారు.

తండ్రి ఆశయాలను పుణికిపుచ్చుకొని ‘ఎమ్.ఐ.ఇమేజెస్’ అనే సేవాసంస్థను స్థాపించి సారా వ్యతిరేక ప్రచారానికి సపోర్టుగా పెద్దపెద్ద పెయింటింగ్స్ ని చిత్రించి – అనేక ప్రాంతాల్లో ‘ఉదయ్” సారా వ్యతిరేక చిత్రాలను ప్రదర్శించారు. సమాచార పౌర సంబంధాల శాఖవారి అధ్వర్యంలో – ఉదయ్ వేసిన ఈ సారా వ్యతిరేక చిత్రాలను సినీ స్లైడ్స్, పెద్దపోస్టర్లు, 40 అడుగుల కటౌట్లుగా, పోస్టర్లుగా రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించి ప్రజల్ని ప్రభావితం చేసారు.

సారా వ్యతిరేక ఉద్యమం చిత్రపటానికి నాటి గవర్నర్ (తదుపరి ఉపరాష్ట్రపతి) శ్రీ కృష్ణకాంత్ గారి చేతుల మీదుగా సత్కారం పొందుట ఆయన ప్రతిభకు నిదర్శనం. సంసారాన్ని నరకం చేసుకొని తాగుడుకి బానిసై భార్యా పిల్లలను అష్టకష్టాలపాలు చేసే వ్యసనంపై ఉదయ్ వేసిన వ్యంగ్య చిత్రాలు కోకొల్లలు.. ఒక రకంగా చెప్పాలంటే అప్పటి సమైక్య రాష్ట్రంలోనే ఇటువంటి సాంఘిక వ్యతిరేక సమస్యలపై, మూఢనమ్మకాలపై, సాంఘిక దురాచారాలపై వ్యంగ్య చిత్రాలు చిత్రించిన ఘనత ఉదయ్ కి దక్కిందనే చెప్పాలి.

1997లో హైద్రాబాదులో ప్రపంచ తెలుగు మహాసభలో ప్రదర్శించిన ‘శాంతి శాంతి శాంతిః’ టైటిల్ బుద్దుని ఆశయాలను ప్రతిబింబించే ఉదయ్ చిత్రం దేశ విదేశీ పర్యాటకుల మనసుల్ని దోచుకుంది.

1998లో ‘జాతీయ సమైక్యత శిబిరం’ పాలకొల్లులో (ప.గో.జిల్లా) ఏర్పాటుచేసిన ‘కాలుష్య నివారణ’ అనే అంశాన్ని తీసుకొని దాదాపు 60 చిత్రాలను నిరుపమానంగా గీసి శ్రీ ఉదయ్ ప్రదర్శించినపుడు,

క్ సత్తా కన్వీనర్ డా॥ జయప్రకాష్ నారాయణ ముగ్ధుడై పర్యావరణ సంరక్షణ పై ఉదయ్ లోని తపన, దీక్ష ప్రశంసనీయమైనదని, ఈ చిత్రాన్ని చూసిన ప్రతివారు తప్పకుండా మన భూగోళాన్ని మనము రక్షించుకోవాలన్న అవగాహన పొందుతారని అభినందించి గౌరవించటం విశేషం.

నీటి విలువపై ఉదయ్ ఊహాచిత్రం – ‘నీరు కలుషితమైతే జగతికి అధోగతే’ అంటూ జలవనరుల కాలుష్యాన్ని భగవంతుడు కూడా. క్షమించడు, మన నిర్లక్ష్యమే మనకు శాపం. కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నారు. ప్రకృతి కలుషితమైతే… మానవ జీవితం పై ఊహాచిత్రం కాలుష్య నివారణ అవసరాలను చాటుతున్నాయి.

1999 మార్చి 18 నుంచి 25 వరకు కువైట్ కమర్షియల్ బిజినెస్ కాలేజ్ ఫర్ విమెన్’ ఆధ్వర్యంలో జరిగిన ఎగ్జిబిషన్లో కొందరు విదేశీయులకు సూక్ష్మంగా చిత్రకళలోని కొన్ని మెళకువలు నేర్పి కువైట్ రాజవంశీయుల ప్రశంసలు అందుకొన్నారు. గల్ఫ్ పత్రికలు ఉదయ్ ప్రతిభను | కొనియాడుతూ వ్యాసాలు ప్రచురించడం విశేషం.

రెండు దశాబ్దాలుగా ఉదయ్ చిత్రాలు అమెరికా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సింగపూర్, డెన్మార్క్, పాలస్తీనా, కువైట్, ఇజ్రాయిల్ వంటి పలుదేశాల ప్రముఖులు నివాసాల్లో, చర్చిలలో చోటుచేసుకొని ఉదయ్ అంతర్జాతీయ ఖ్యాతిని గడింపజేసాయి. అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో “జీసస్ క్రైస్ట్ ‘పోర్ట్రెయిట్స్’ ని వేయాడానికి ఇప్పటికే పలు అహ్వానాలు వచ్చాయి.

ఎందరో ప్రముఖ కవుల పుస్తకాలకు అందమైన ముఖచిత్రాలు వేసిన ఉదయ్ ప్రతిభ పాఠకులను అలరిస్తున్నాయి. అందులో నా బృహత్ నవల ‘హీరో’ పై ముఖ చిత్రం కూడా వేసారు.

(హీరో కవర్ పేజి)

హైదరాబాద్ లలితకళాతోరణంలో ప్రపంచ తెలుగు మహసభల్లో ఉదయ్ ఏర్పాటుచేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్లో ‘పంచభూతాలు’ చిత్రాలకు ఎంతో ఆదరణ లభించి, ప్రవాసాంధ్రుల మన్ననలు సైతం పొందినది. మతసామరస్యం పై విద్యార్థుల్లో చక్కని అవగాహన కల్గించి జాతీయ సమైక్యత ఆవశ్యకతను విశదపరచడానికి ‘సేవ్’ సంస్థ ద్వారా అనేక సదస్సులు- పోటీలు నిర్వహించి ఉదయ్, మతఘర్షణల వల్ల కలిగే నష్టాలను చిత్రాల ద్వారా వివరించారు. గుడి గోపురాల్లో మందిర, మసీదు, చర్చిల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో, మంత్రుల నివాసాల్లో, సత్యం కంప్యూటర్ హౌసుల్లో ఉదయ్ గీసిన చిత్రాలు అలంకరింపబడి చూపరుల హృదయాల్ని ఆకట్టుకుంటున్నాయి కూడా.

మానవతా విలువల్ని కాపాడడంలో, సంఘంలో జీవితంపట్ల విశాల దృక్పధం కలిగించడంలో, జీవితాన్ని ఆనందమయంగా మలుచుకోవడంలోను ఈ ‘సేవ్’ సంస్థ అనేకమందికి స్పూర్తి దాయకం అవడంలో ఉదయ్ కృషి అనన్యం.

మానవాళిని పట్టి పీడిస్తున్న మహమ్మారి రోగం ఎయిడ్స్ అవగాహనపై అనేక సదస్సుల ద్వారా వ్యాస, ఉపన్యాస చిత్రలేఖన పోటీల ద్వారా బాల బాలికల్లో, ప్రజల్లో ఎయిడ్స్ పై చక్కని అవగాహన కలిగించి చైతన్యం కల్పించడం స్పూర్తి దాయకం. ప్రతి సంవత్సరం ఎయిడ్స్ దినోత్సవంలో వివిధ కార్యక్రమాలు చేపట్టి ఎయిడ్స్ పై సామాన్య మానవులకు అవగాహన కలిగించడం ఆయన లక్ష్యం…

ఉదయ్ చిత్రకళా నైపుణుడే కాదు ఉత్తమ కవికూడా. ఆయన వ్రాసిన “చిత్రప్రియ” “అనంత వేదన” కవితలే అందుకు ప్రబల సాక్ష్యం. తెలుగు సాహిత్యంలో అత్యాధునిక కవితా రూపమైన ‘నానీ’ ప్రక్రియలలో అనేక నానీలు రాసి ఆధునిక నానీల కవుల జాబితాలో చేరిన బహుముఖ ప్రఙ్ఞాశాలి.

కవితలనే కాదు, కమనీయ గీతాలను కూడా సంగీత స్వరాలకు అనుగుణంగా వ్రాయగల దిట్ట ఉదయ్. విశ్వవాణి రేడియో కార్యక్రమాలలో ‘జీవజలాలు’ శీర్షికలో ప్రచారం అయ్యే క్రైస్తవ భక్తిగీతాల్లో కొన్ని “నీ నిలువ కొమ్మపై ఓ కోయిల” అనే టైటిలుతో అద్భుతమైన క్రైస్తవ భక్తిగీతాల ఆడియో క్యాసెట్ మరియు సీ.డి. లుగా మలచడానికి ఉదయ్ కు ఆయన శ్రీమతి ఝాన్సీ, కుమారుడు ఉజ్వల్ తేజ్, కుమార్తె శ్రావ్యమేఘన సహకారం ఆయన విజయానికి ఆలంబనము.

అనేక క్రైస్తవ గ్రంథాలకు కవర్ డిజైన్స్ వేయడంతోపాటు ఏసుక్రీస్తు జీవితంలోని ప్రాముఖ్యమైన 40 సంఘటనలను చిత్రాలుగా వేసి తద్వారా ఏసుక్రీస్తు సువార్తను భక్తుల హృదయాల్లో ఉదయ్ నింపగలిగారు.

2003లో ఢిల్లీలో జరిగిన ప్రపంచ స్థాయి చిత్రకళా ప్రదర్శనలో ప్రసంగించిన రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిత్రాన్ని అప్పటికప్పుడే గీసి ఆయనకు అందించి, ఆయన అభినందనలు అందుకున్నారు. సమాజంలోని మూఢనమ్మకాలు, రుగ్మతలపై ఆయన ఎన్నో చిత్రాలను గీశారు.

చిత్రకారులకు ఆదర్శ ప్రాయుడు ఉదయ్. తన భవిష్యత్ ప్రణాళికలో భాగంగా లక్షలాది రూపాయలను ఖర్చుచేసి అద్భుతంగా నిర్మిస్తున్న “ఆర్ట్ గ్యాలరీ” బాల చిత్రకారులకు – భవిష్యత్తుకు బంగారుబాట అవుతుంది. యువ చిత్రకారులకు స్పూర్తిదాయకం అవుతుంది. ప్రముఖ సహ చిత్రకారులకు ఆదర్శమవుతుంది. ఈ ఆర్ట్ గ్యాలరీని మరిన్ని అంతస్థులకు విస్తరించే పనులలో ప్రస్తుతం ఉన్నారు, ఉదయ్.

లోక్ సభ స్పీకరు నుండి మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రముఖుల మన్ననలను, ప్రశంశలను పొందిన ఉదయ్
‘నేటికీ తానొక విద్యార్ధినని, ఇంకా ఎంతో నేర్చుకోవాలని’ ఆయన పడే తపన భావితరానికి ఆదర్శం.

మరెన్నో అద్భుతమైన చిత్రాలను అందించి మార్గదర్శకులు అవుతారని ఆశిద్దాం.

అతని కుంచె నుంచి జాలువారిన ప్రతి చిత్రంలోనూ సామాజిక భావన నిండి ఉంటుంది. ప్రజలను ఆలోచింప చేస్తుంది. పుట్టిన ప్రతివ్యక్తి సమాజానికి చేయగలిగినంత సేవచేయాలనే ఉదయ్ చిత్రకారుడుగానే కాక సంఘ సంస్కర్తగా ఎందరి ప్రశంసలనో అందుకుంటున్నారు.

పలురాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు.

ఉచిత శిక్షణ కోసం..

విద్యార్థులకు చిత్రకళలో ఉచిత శిక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతో పాలకొల్లులో రూ.30 లక్షలతో ఆర్ట్ గ్యాలరీని స్థాపిస్తున్నారు. ప్రస్తుతం ‘ది కేర్’ స్వచ్ఛంద సంస్థ సభ్యునిగా, ‘సేవ్’ సామాజిక సంస్థను స్థాపించి పేద విద్యార్థులకు చిత్రకళను నేర్పుతున్నారు. పాలకొల్లులో హరివిల్లు ఆర్ట్స్ ఆకాడమి స్థాపించి చిత్రకారుల్ని పోత్రహిస్తున్నారు.

నన్ను బాగా ఆకర్షించింది, రెండు సంవత్సరాల క్రితం, వాత్సల్య గోదావరీ నదీ తీరాన, లైవ్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు జాతి వైభవాన్ని విశాలమైన మహ చిత్రాన్ని రూపొందించడం ఆయన ఘనకీర్తిలో ఒక కలికి తురాయి.

ఉదయ్ భయ్యా కేవలం ఒక రూపశిల్పి, చిత్రకారుడు మాత్రమే కాదు. శిల్పకళను, చిత్రకళను విశ్వవిద్యాలయం స్థాయిలో, అభ్యసించాడు కాబట్టి, ఇంగ్లీషులో ‘A study on Jakkanacharya’s sculpture work’ అనే గొప్ప పుస్తకాన్ని రచించాడు.

ఇలా బహుముఖీనమైన ప్రతిభను ప్రదర్శిస్తున్న ఉదయ్ భయ్యా మహా సున్నిత హృదయుడు, మృదుభాషి. జంతు ప్రేమికుడు. ఆయనకు మోడల్స్ పాలకొల్లు వీధుల్లో నివసించే ఆవులు మరి కొన్ని జంతువులే. కుక్కలంటే మహా ప్రేమ.

ఉదయ్ భయ్యా కమర్షియల్ ఆర్టిస్ట్ కూడా. మితృలు ఎవరైనా తమ చిత్రాల కోసం, శిల్పాల కోసం వారిని సంప్రదించ వచ్చును. నేను నా వరంగల్ మితృడు మరియు ప్రముఖ హోమియో వైద్యుడు అయిన వీ.యస్.రెడ్డి గారి తల్లి శిల్పాన్ని రూపొందించి బహుకరించాను. (ఆయన నెంబర్ 7396601154). కానీ ఉదయ్ భయ్యా చాలా బిజీ ఆర్టిస్ట్ కాబట్టి నెలలు, సంవత్సరాలు వేచి ఉండవలసి ఉంటుంది.

ఉదయ్ భయ్యా! మీ మీద నాకు ఒక్కటే కోపం. పనిలో బడితే, నిద్రాహారాలు మాని, రాత్రీ పగలు అందులోనే నిమగ్నమై ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. భయ్యా! మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మీకు ప్రియమైన శిల్పకళ, చిత్రకళలో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనీ, ఐక్యరాజ్యసమితిలో లైవ్ ప్రదర్శన ఇవ్వాలనీ, త్వరలోనే ‘పద్మశ్రీ’ తో మిమ్మల్ని భారత ప్రభుత్వం, సత్కరించాలని ఆకాంక్షిస్తూ…

డాక్టర్ ప్రభాకర్ జైనీ,
ప్రధాన సంపాదకులు,

‘సినీవాలి’
ఆన్ లైన్ తెలుగు ఉచిత వారపత్రిక.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top