ధర్మపథం….శీర్షిక – పూర్ణిమాస్వాతి

ధర్మవ్యాధుని ధర్మనిరతి

ధర్మం అంటే మనతోటి ప్రాణుల పట్ల దయగా ఉండటమే. విద్య అంటే ఆచరణయోగ్యమైన జీవనవిధానానికి ప్రతిరూపమే. అందుకు ఉదాహరణమే కౌశిక, ధర్మవ్యాధుల ఉదంతం. మమకారానికి బదులు అహంకారం, ప్రేమకు బదులు ద్వేషం మానవునిలో పెచ్చరిల్లిపోతే.. అలాంటి వారు ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా జ్ఞానవంతులు కాలేరు. మరెన్ని గ్రంథాలు పఠించినా దైవానికి దగ్గర కారు. ఆచరణకు నోచని అధ్యయనం వల్ల ప్రయోజనం శూన్యం. ఈ విషయాలను సవివరంగా తెలుసుకునేందుకు కౌశిక, ధర్మవ్యాధుల వత్తాంతం ఎంతగానో ఉపయోగపడుతుంది. మహా పండితులమని విర్రవీగుతూ శుష్కమైన జీవితాలు గడిపే కంటే, ధర్మవర్తనతో బతుకు పండించుకోవడంలోనే పరమార్థం ఉంటుందన్న సంగతీ బోధపడుతుంది. అందుకు తార్కాణంగా నిలిచేదే ఈ కథ.

ఒకానొక వృక్షచ్ఛాయలో కౌశికుడు నిష్టాగరిష్ఠుడై ఉంటాడు. అదే సమయంలో ఆ చెట్టు కొమ్మల మీదనే కూర్చున్న కొంగ రెట్ట వేస్తుంది. అది కౌశికుని మీద పడి ధ్యాన భంగమవుతుంది. దీంతో ఆయనకు విపరీతమైన కోపం వస్తుంది. వెంటనే తల ఎత్తి ఆ కొంగను తీవ్రంగా చూస్తాడు. మరుక్షణంలోనే అది  చెట్టుమీది నుంచి కిందపడి బూడిద అయిపోతుంది. తన వల్ల ఒక మూగప్రాణి అన్యాయంగా చచ్చిపోయిందే అని అనుకోకుండా తన తపోబలాన్ని తలచుకుని పొంగిపోతాడు కౌశికుడు. ఆ వెంటనే చిద్విలాసంతో భిక్షకోసం ఊళ్లోకి వెళతాడు. ఒక ఇంటి ముందు నిలిచి ‘భవతీ భిక్షాందేహి…’ అంటూ కేక పెడతాడు.

ఆ ఇంటి ఇల్లాలు పరమసాధ్వీమణి. కౌశికుని అభ్యర్థన చెవినబడినప్పటికీ ఆ సమయంలో భిక్ష వేయలేని స్థితిలో ఉంటుంది. ఎందుకంటే అప్పుడే ఆమె భర్త బయటి నుంచి ఎండలో తిరిగి తిరిగి ఇంటికి వస్తాడు. దీంతో పతికి శీతలోపచారాలు చేసి అన్నం వడ్డిస్తుంది. ఆ పనులయ్యాక భిక్ష తీసుకుని ఇంటి ముంగిట నిలుచున్న కౌశికుని వద్దకు వస్తుంది.

మిగతా వచ్చేవారం…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top