అడవి (10వ భాగం) – వసంత్ రావ్ దేశ్ పాండే

(గత సంచిక తరువాయి) … అస్తమించే సూర్యుణ్ణి చూసి, రోజూ ఎరుపెక్కే పడమర సంధ్యారాగం ఈ జనచైతన్యం కళ్లలోకి చూసి, ఎరుపెక్కడం మరచిపోయి తెల్లబోయింది. పడమటి సంధ్యారాగంతో చేయి కలిపి, రాగరంజితం కావల్సిన నేల నేడు ఇంకా

తెల్లగానే వుంది.

పోలీసులను ఛేదించుకుని జనం సభావేదికవైపు కెరటాల్లా కదిలి వస్తున్నారు.

నేల కనిపించనంత జనం.

స్త్రీలు పురుషులు

ముసలివారు పడుచువారు

అందరూ ఈ వ్యవస్థ కాలి మడమల కింద పడి నలిగినవాళ్లే. అందరూ తమ బతుకులతో విసిగి వేసారిన వాళ్ళే. అందుకే, అందరిలో ఇంత తెగువ. గోండు గుండెల్లో, గూడాల్లో పెల్లుబికిన ఈ ఆవేశాలకు… తెగింపుకు కారణం ఈనాటిది

కాదు, రెండుమూడు తరాలుగా వారిపై సాగుతున్న దోపిడి, దౌర్జన్యాలకు విసిగి వేసారి
తిరగబడిన ఉత్తుంగ తరంగాలు వాళ్ళు. వారి హృదయాలు భగభగమండిపోతున్నాయి. అది ఈనాడు హఠాత్తుగా అంటుకున్న మంటకాదు. వందల సంవత్సరాల బానిసత్వంలో నిస్సహాయంగా మగ్గిపోతూ ఆక్రందించిన వారి హృదయాల్లో ఎప్పటినుండో ఆ నిప్పు రాజుకొంటూనే ఉంది…
అప్పుడు….

ఈ దేశాన్ని బ్రిటీషు వాళ్ళు, తెలంగాణాను నైజాం రాజు పాలిస్తున్నారు.

ఆ రోజుల్లో హైదరాబాదు నుండి ఆదిలాబాదుకు ఇప్పటిలా తారురోడ్డు లేదు మామూలు కంకరరోడ్డే. పైన మట్టిపోసి చదునుచేసి వుంది. ఆ రోజుల్లో అదే గొప్ప రోడ్డు.

ఆ రోడ్డుపైన ఒక లారీ నిజామాబాదు నుండి ఆదిలాబాదు వైపు పోతోంది. అందులో

ముగ్గురు మనుషులున్నారు. డ్రైవరు, క్లీనరూ కాక మరో మనిషి.

అతడి పేరు రాఘవులు.

లారీ గోదావరి నది దాటి నిర్మల్ చేరుకుంది.

“ఇంజన్ గరమయ్యింది. ఓ గంట ఆగిపోదాం” అన్నాడు డ్రైవరు బండి ఆపి దిగుతూ, క్లీనరు రోడ్డు పక్కన ఉన్న చెరువులో నుండి నీళ్ళు తెచ్చి ఇంజనులో పోశాడు. రాఘవులు మెల్లగా లారీ దిగాడు. చుట్టూ పరికించి చూశాడు. అదేం ఊరో అర్థంకాలేదు రాఘవులుకు. ఎటు చూసినా నల్లటి పెద్ద పెద్ద రాళ్ళ గుట్టలు. ఆ గుట్టల నడుమ అక్కడక్కడ
ఇళ్ళు. ఇందాక నిజామాబాద్ నుండి బయలుదేరాక ఆర్మూర్లో కూడా ఇలాంటి రాళ్ళగుట్టలే చూశాడు. అప్పుడే అనుకున్నాడు మనసులో ఇదేదో దేశంకాని దే పోతున్నానని.
లారీ మళ్లీ మెల్లగా బయలుదేరింది. నిర్మల్ దాటి అయిదారు మైళ్ళు వెళ్ళగానే ఒక పెద్ద గుట్ట రాక్షసిలా అగుపించింది. రాఘవులు ఆ గుట్టను, గుట్టపైన కనిపించే దట్టమైన అడవిని నోరెళ్లబెట్టి చూస్తున్నాడు. అంతలోనే లారీ ఆగిపోయింది. లారీ ఆగడంతోనే క్లీనరు కుర్రాడు చెంగున కిందకు దుమికాడు కాబిన్ నుండి.

లారీ ఎందుకు ఆగిందో, క్లీనరు కుర్రాడు ఎందుకు కిందికి దిగాడో అర్థంకాలేదు. రాఘవులుకు.

సుమారు యాభయి గజాల దూరంలో రోడ్డుకు కుడివైపున ఒక అరుగుంది. అరుగుపైన గోరీలు ఉన్నాయి. గోరీల మీద మెరుగు అద్దిన ఆకుపచ్చని గుడ్డలు పరిచి ఉన్నాయి. రెండు ఆకుపచ్చని జెండాలు వెదురుకర్రలతో నిలబెట్టి ఉన్నాయి. అక్కడో తెల్లటి గడ్డం ముసలాడు చిన్న చీపురుతో నడుంవంచి ఊడుస్తున్నాడు. డ్రైవరు లారీలోంచి దిగకుండానే మనసులోనే ఏమో చదువుకొని చేతులతో ముఖం

తుడుచుకున్నాడు.

రాఘవులు కూడా దండం పెట్టుకున్నాడు ఎందుకయినా మంచిదని.
క్లీనరు కుర్రాడు సమాధుల ముందు అగరువత్తులు వెలిగించి, దండం పెట్టి పరుగెత్తుకొచ్చాడు. లారీ మళ్ళీ బయలుదేరింది. ఘాట్ రోడ్డు మెలికలు తిరిగి ఉంది. ఒక్కో మలుపు తిరుగుతూ ఘాట్ ఎక్కుతూ ఉంటే రాఘవులుకు గుబులు గుబులుగా

ఉంది. లారీ ఘాట్సై మలుపు తిరుగుతుంటే మరీ బెంబేలు పడిపోతున్నాడు. ప్రాణాలను

అరచేతిలో పట్టుకొని కూర్చున్నాడు. “మంచిగ్గూసో అన్నా ఈ స్టీరింగ్ ఖాన్ద్వారా సేతులు ఉన్నదాక మన పానానికి ఏందోకాలేదనుకో! ఒకసారి గిట్లనే ఏమయిందంటే…” అని ఏమో చెప్పబోయాడు క్లీనరు. కుర్రాడు.

అంతలోనే “చుప్ బే సాలే” అంటూ కసురుకున్నాడు డ్రైవరు. క్లీనరు నోరుమూసుకొని

కూర్చున్నాడు. రోడ్డు ఇరుకుగా ఉంది. పైగా గతుకులు, రెండువైపులా దట్టమైన అడవి. లారీ పైకి పోతూవుంటే ముందు రోడ్డు తప్ప కిందామీదా నేల కనిపించడంలేదు అంతా అడవే. ఆ అడవిలో మెలికలు తిరిగి మొద్దు నిదరపోతున్న రాకాసి కొండ చిలువలా రోడ్డు.
మలుపు వచ్చినప్పుడల్లా డ్రైవరు స్టీరింగ్ను బలంకొద్ది తిప్పుతున్నాడు. రోడ్డుకు ఒకవైపు లోతయిన లోయలు, మరోవైపు ఎత్తుగా ఉన్న గుట్టలు.

ఘాట్ రోడ్డు మీద అక్కడక్కడ రోడ్డుకడ్డంగా రాళ్లున్నాయి. వాటిని దారి నుండి తప్పించ మన్నట్టు ఒకచూపు చూసాడు డ్రైవరు క్లీనరువైపు. క్లీనరు బండి దిగి, చకచకా అడ్డమొచ్చిన రాళ్లను ఏరివడేస్తూ, “రైట్ రైట్” అంటూ, ముందు కురుకుతూ రాళ్లను పక్కకు
పడేస్తున్నాడు. అంతలోనే ఏమయిందో ఏమో “ఖర్ష్… ఖర్ష్” అంటూ పొదల వెంట పరిగెత్తాడు.

రాఘవులుకు ఏమీ అర్థం కాలేదు. పిచ్చిగా కళ్లు పెద్దవి చేసుకొని క్లీనరు ఎటు పరిగెత్తితే అటు చూస్తున్నాడు.

వాడు ఒకసారి పడిలేచి ఒక పొదలోంచి రెండు చిన్నచిన్న కుందేలు పిల్లలను చెవులు

పట్టి పట్టుకొచ్చాడు.

ఘాట్ రోడ్ అయిపోయింది. ఇప్పుడొక పెద్ద గుట్టమీద ఉంది లారీ. అక్కణ్ణించి చూస్తే నిర్మల్ చుట్టూ ఉన్న చెరువులు నల్లగ నిగనిగలాడుతూ కనబడుతున్నాయి. లారీ జోరుగాపోతుంది.

సశేషం… 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top