మనోజ్ఞ సీరియల్ (63వ భాగం) – సలీం

(గత సంచిక తరువాయి) ….  ‘నువ్వు యం.టెక్ చదివావు. యం.ఎన్.సి లో ఉద్యోగం చేస్తున్నావు. అతను బికాం గ్రాడ్యుయేట్ అని కదా చెప్పావు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. ఎందుకిలా నిన్ను నీవు బలి చేసుకుంటున్నావు?’
‘ఇందులో బాధపడాల్సింది ఏముంది? ఉద్యోగమూ చదువులు నాకు ముఖ్యం కాదు పెదనాన్నా. నేను పెట్టిన కండిషన్స్కి ఒప్పుకోవడమే ముఖ్యం. అతను ఒప్పుకున్నాడు.’
‘ఏమిటా కండిషన్స్?’
‘మొదటిది హైద్రాబాద్లోనే స్థిరంగా ఉండాలి. హైద్రాబాద్ వదిలి ఎక్కడికీ వెళ్ళకూడదు. రెండోది నేను మీ దగ్గరకు ఎప్పుడు రావాలన్నా అభ్యంతరపెట్టకూడదు. శనాదివారాలు మీతో ఉండిపోతానని చెప్పాను. దానిక్కూడా ఒప్పుకున్నాడు. అవసరమైతే మిమ్మల్ని నా యింటికి పిల్చుకొచ్చుకుంటానన్నాను. తను కూడా మిమ్మల్ని తండ్రిలా ప్రేమగా చూసుకుంటానన్నా డు. అంతకంటే నాకింకేం కావాలి పెదనాన్నా. నేనిన్నాళ్ళూ వెదికింది ఇటువంటి వ్యక్తి కోసమే. నాకు మీరు ముఖ్యం. మిమ్మలి చూసుకోవడం ముఖ్యం’ అంది.
ఆ మాటలు వినగానే తనకు అనాయాసంగానే ఏడుపు తన్నుకుని వచ్చింది. ‘నాకోసం ఇన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఏముంది తల్లీ’ అన్నాడు.
‘కొన్ని కావాలంటే కొన్నిటిని వదులుకోడానికి సిద్ధపడాలి పెదనాన్నా. నాకు ఈ పెళ్లీ, మొగుడూ పిల్లలు.. ఇవేవీ ముఖ్యం కాదు. నేను దేవుడ్ని నమ్మను. మీరే నాకు దేవుడు. నేనీ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మీరే. మీ కోసం దేన్ని వదులుకోమన్నా సంతోషం గా వదిలేస్తాను పెదనాన్నా’ అంది.
ఆ క్షణం తనకు యయాతి చిన్న కుమారుడు పూరుడు గుర్తొచ్చాడు. తన యవ్వనా న్ని తండ్రి సుఖం కోసం ధారపోసిన తనయుడు. మానస ఎంత అందంగా ఉంటుందో.. అప్సర సల్ని తలదన్నే అందం. తను కోరుకుంటే రాజకుమారుడిలాంటి అందమైన, పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి ఆమెకు భర్తగా వస్తాడు. కానీ అవన్నీ కాదనుకుని అందం, హోదాతో పాటు ఆర్థికంగా బలం లేని జేమ్స్ని చేసుకోడానికి సిద్ధపడ్తోంది.
తన తమ్ముడు, మరదలితో పాటు ఆమె స్నేహితులు, బంధువులు ఎంత మంది వారిం చినా మానస వినలేదు. జేమ్స్తో ఆమె పెళ్ళి జరిపించక తప్పలేదు. తక్కువ అద్దెలున్నాయ న్న కారణంతో వూరి శివార్లలో ఉన్న బాలాపూర్లో రెండు గదుల యిల్లు అద్దెకు తీసుకుని కాపు రం పెట్టారు. పెళ్ళికి గాయత్రి రాలేదు. హైద్రాబాద్లోనే ఉన్న తన పెద్ద కూతురు హరిచందన కూడా రాలేదు. తనకెంత బాధేసిందో.. ఎవరెవరో ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకు, రిసెప్షన్లకు హాజరయ్యే గాయత్రి, తన ఇద్దరు కూతుర్లు మానస పెళ్ళికి రాకపోవడం గుండెలోని గాయంలా సలుపు తూనే ఉంది.
తమ్ముడి రెండో కూతురి పెళ్ళి కూడా తను ప్రేమించిన అబ్బాయితో మరో మూడు నెలల్లో జరిగిపోయింది.
వడ్డీకని యిచ్చిన ముప్పయ్ లక్షలు వెనక్కి తీసుకుని ఈ రెండు పెళ్ళిళ్ళు జరిపించ డంతో యింట్లో అగ్గి రాజుకుంది. గాయత్రి తనతో మాట్లాడటం మానేసింది. తనతోపాటు గదిలో పడుకోవడం మానేసింది. ఆమె కింది బెడ్రూంలో పడుకుంటే తను సెకండ్ ఫ్లోర్లోని బెడ్రూంలో పడుకోసాగాడు. భోజన సమయానికి కిందికి దిగడం, వంట గదిలోకి వెళ్ళి ప్లేట్లో అన్నం కూర లు పెట్టుకుని తిని, కంచాన్ని సింక్లో పడేసి పైకి రావడం.. ఇదే దినచర్య.
తనకు వూపిరాడని గదిలో వేసి బంధించినట్టుంది. తన స్వంత యింట్లో భార్యతో కలిసి ఉంటున్న భావన కలగడం లేదు. ఎవరి యింట్లోనో పేయింగ్ గెష్ట్గా ఉన్నట్టు.. లేకపోతే ఆకలే సినపుడు హోటల్కెళ్ళి భోంచేసి, తిరిగి తన గదికి చేరుకున్నటు… భయంకరమైన ఒంటరి తనం.. కూతుర్లు కనీసం ఫోన్ చేసయినా పల్కరించరు. అమెరికాలో ఉన్న చిన్నమ్మాయి రోజుకు రెండు సార్లు వాళ్ళమ్మతో మాట్లాడుతుంది. మరి తనేం పాపం చేశాడని.. నెలకొక్క సారైనా ‘నాన్నా .. ఎలా ఉన్నారు?’ అని అడగొచ్చుగా.
మణికొండలో ఉన్న పెద్ద కూతురంటే తనకెంత ప్రాణమో.. ఎంత అల్లారుముద్దుగా పెంచాడో. అదీ మాట్లాడదు. ఓ రోజు ఉండబట్టలేక ఫోన్ చేసి ‘ఎందుకు నాతో మాట్లాడవు? నేనేం చేశానని?’ అని అడిగాడు. ‘మేము మాట్లాడకున్నా మీతో మాట్లాడేవాళ్ళు ఉన్నారుగా’ అంది. ఆ మాట మానస గురించి అందని తనకర్థమైంది.
మానస రోజూ తనని చూడటానికి వచ్చేది. బాలాపూర్ నుంచి హిమాయత్ నగర్ వచ్చి తనతో ఓ అరగంట మాట్లాడి, అక్కణ్ణుంచి హైటెక్ సిటీలో ఉన్న కాగ్నిజెంట్ ఆఫీస్కి వెళ్ళేది. రెండు గంటల ప్రయాణం. బాలాపూర్ నుంచి నేరుగా హైటెక్ సిటీకెళ్తే గంటలో ఆఫీస్ చేరుకో వచ్చు.
‘ఎందుకంత శ్రమపడ్తావు?’ అని ఎంత చెప్పినా వినేది కాదు. ‘హైద్రాబాద్ సంబంధమే చేసుకోవాలని పట్టుబట్టింది దీనికోసమేగా పెదనాన్నా. మిమ్మల్ని రోజుకొక్కసారైనా చూసుకోక పోతే ఎలా’ అనేది.
తనలా అన్నాడే గానీ మానస రాక కోసం చకోరపక్షిలా ఎదురుచూసేవాడు. ఆమె తప్ప తనతో మాట్లాడేవాళ్ళెవరూ లేరు. రెండో అంతస్తులోని తన గదిలో కూచుని ఎంత సేపని టీవీ చూస్తాడు? ఎంత సేపని పుస్తకాలు చదువుతూ గడుపుతాడు?
మానస రావడం కొద్దిగా ఆలస్యమైనా ప్రాణం గిలగిల్లాడేది. ఏదైనా అత్యవసరమైన పని బడిందేమో.. ఈ రోజు రాదేమో అనుకోగానే గుండెల్లో రాయి పడేది. మానస తనతో గడిపే ఆ అరగంటే తను జీవంతో తొణికిస లాడేది. తను బతికేది ఆ అరగంట కోసమేనేమో అన్పించేది. ఉన్న ఆ కొద్ది నిమిషాల్లో అమృతాన్ని నింపి వెళ్ళిపోయేది. మళ్ళా రేపటి ఉదయం ఆమె రాక కోసం ఎదురుచూస్తూ గడిపేవాడు.
శనాదివారాలు వస్తే చాలు తనకు పండగలా ఉండేది. ఉదయాన్నే మానస వచ్చేసేది. వచ్చే దారిలో రెస్టారెంట్నుంచి బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసుకుని వచ్చేది. రాత్రి ఎనిమిది వరకూ ఉండి బాలాపూర్ తిరిగెళ్ళేది. ‘మరి మీ ఆయనకు భోజనమో?’ అంటే ‘నాకన్నా వంట బాగా చేస్తాడు పెదనాన్నా. ఒక్కోసారి నాక్కూడా వండి పెడ్తాడు. చికెన్ బిర్యాని చేయడంలో ఎక్స్పర్ట్. నేను వంట చేస్తున్నా కూరలు తరిగిస్తాడు. వంట తెలిసిన మొగుడు దొరకడం అదృష్టం కదూ’ అంటూ నవ్వేది.
‘ఎప్పుడూ ఈ గదిలో కూచుని ఉంటే బోర్ కొడ్తుంది పెదనాన్నా.. రండి సరదాగా బైటికెళ్ళి ఏ హోటల్లోనో భోంచేసి వద్దాం’ అంటూ వారానికో కొత్త చోటికి పిల్చుకెళ్ళేది.
ఆదివారం రోజు మాత్రం సినిమా ప్రోగ్రాం వేసేది. ‘టీవీలో సినిమాలు చూస్తే థ్రిల్ ఉండదు పెద నాన్నా. పెద్ద స్క్రీన్ మీద డోల్బీ సౌండ్తో చూస్తేనే మజా’ అనేది. సినిమా వద్దనుకుంటే ఏ పార్కుకో పిల్చుకెళ్ళి కబుర్ల వరదలా మారిపోయేది.
‘ఆ పిల్ల మనింటికి రావడానికి వీల్లేదు’ అందో రోజు గాయత్రి.
‘నువ్వు రావొద్దు తల్లీ. రోజూ ఎందుకంత శ్రమ పడి వస్తావు? వీకెండ్స్లో నేనే మీ ఇంటికి వస్తాలే’ పెద్దమ్మ రావద్దన్న విషయం చెప్పకుండా చెప్పాడు మానసతో.
మానస నవ్వి ‘పెద్దమ్మ నేను రాకూడదని చెప్పింది కదా. మీరు చెప్పకుండా దాచినా నాకు తెలిసిపోతుంది పెదనాన్నా. మీ కళ్ళనిండా ఉన్న దిగులే చెప్తోంది’ అంది.
అతన్ని చూడటానికి దొంగ చాటుగా వచ్చేది. స్కూటర్ని యింటి ముందు కాకుండా దూరంగా పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చేది. యింటి ముఖద్వారానికి ఎదురుగా ఉన్న గేట్ నుంచి కాకుండా పక్కనున్న గేట్ తీసుకుని, గోడ చాటుగా వచ్చి , యింటి వెనకున్న మెట్లెక్కి పైకొచ్చి గుండె నిండా గాలి పీల్చుకుంటూ ‘హమ్మయ్య. అదృష్టం కొద్దీ వీధి తలుపు వేసే ఉంది. పెద్దమ్మ కంట పడకుండా వచ్చేశాను’ అనేది నవ్వుతూ.
గాయత్రి ఓ రోజు చూడనే చూసింది. ఆ రోజు చాలా పెద్ద గొడవైంది. ‘ నా యింటికి రావొ ద్దన్న వాళ్ళని ఎందుకు రానిస్తున్నారు?’ అంది.
‘నీ యిల్లా… నా యిల్లు కాదా?’ అన్నాడు తను.
‘ఈ యిల్లు నా పేరుతో ఉంది. నాది. ఈ యింటికి ఎవరు రావొచ్చు ఎవరు రాకూడదు అనేది నా ఇష్టప్రకారమే జరగాలి’ అంది.
శనాదివారాలు మానస వాళ్ళింటికి వెళ్తుంటే ‘ఎక్కడికెళ్తున్నారు? దాని యింటికేనా? బతకలేరా దాన్ని చూడకుండా?’ అంటూ గొడవ పెట్టుకునేది. కొన్ని సార్లు ఏవో అబద్ధాలు చెప్పి మానస వాళ్ళింటికి వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళడానికి వీల్లేకుండా గాయత్రి పూర్తిగా నిషే ధం విధించింది. రెండు గేట్లకి తాళాలు వేయడం మొదలెట్టింది.
తనను జైల్లో పెట్టి బంధించిన భావన.. తనకు స్వేచ్ఛ లేదా? తను ఎవర్ని కలవాలో ఎవర్ని కలవకూడదో నిర్ణయించే అధికారం ఆమెకెవరిచ్చారు? తనేమీ పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని వెళ్ళడంలేదే .. తమ్ముడి కూతురింటికేగా వెళ్తున్నాడు? లీగల్గా దత్తత తీసుకోలేదుగానీ తమ్ముడి ఇద్దరు కూతుర్లని తన కూతుర్లతో సమానంగానేగా చూశాడు?
ఆ మాటంటే ‘సమానంగా చూశారా? మానసని నెత్తిమీద పెట్టుకుని చూశారు కదండీ. మన పిల్లల మనసులు ఎందుకు విరిగిపోయాయనుకున్నారు? అందుకేగా. ఇప్పుడు నా మనసూ విరిగిపోయింది’ అంది గాయత్రి.

సశేషం… 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top