బంధాలు – అనుబంధాలు (11వ భాగం)- సుజల గంటి

(గత సంచిక తరువాయి) … “పోనీలే అక్కా ఆ మాత్రం దానికి గొడవెందుకు? నా పెట్టెలో డబ్బు తీసుకో మీ మరిదిగారు నాకు నెలనెలా డబ్బులు పంపుతున్నారు కదా ఇంటికి వచ్చాక చూసుకోవచ్చు” అంది అశ్విని. తనంటే ప్రాణంగా ఉండే చిన్నన్న మురళి ఎందుకు ఇలా మారిపోయాడు?

“అమ్మా అన్న పిలుపుతో వర్తమానం లోకి వచ్చింది అశ్విని.ఇప్పటిదాకా నిద్ర పోయిందా? ఆ నిద్రలో గతం.
తోడ బుట్టువుల మధ్య ఆప్యాయతలు అనుబంధాలూ ఉండవా? అన్నలు ఇంత స్వార్ధపరులేమిటి అన్న ప్రశ్న. అందరూ ఇలాగే ఉంటారా?అన్న అనుమానం.
ఆ తరువాత కొన్నాళ్ళకు అనుబంధాలు ఆప్యాయతలూ సిల్కు దారాలని తెలిసింది. దూరంగా ఉన్నప్పుడే. ఏ మాత్రం తన సుఖాలకు అడ్డు వస్తుందంటే తెగిపోతాయని.
తల్లి ఎంత సేపటికీ మాట్లాడక పోతే పక్కలో దూరి “ఆయి వచ్చిందా?” అంటూ తల్లి ఒంటి మీద చెయ్యి వేసింది.
దాని మాటలకు నవ్వు వచ్చి “లేదురా బంగారం.నిద్ర వచ్చింది. ఆటలు అయిపోయాయా? అన్నయ్యలు ఏరి” అంది.
“హోమ్ వర్క్ ” అంది నోట్లో వేలు తీసి.
“నోట్లో వేలు వేసుకోకూడదని చెప్పానా?” అంది నోట్లో వేలు తీస్తూ.
లేచి వంటింట్లోకి వెళ్ళి ముగ్గురికీ బోర్నవిటా కలిపి పిలిచింది. తల్లి పిలవగానే బుద్ధిగా వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. పెద్ద వాళ్ళిద్దరికీ కప్పుల్లో ఇచ్చింది. చిన్నారి ని కుర్చీలో కూర్చోబెట్టి తను కూడా దాని పక్కన కుర్చీలో కూర్చుని చిన్న గ్లాస్ లో పాలు కొద్దిగా పోసి తాగడానికి ఇచ్చింది.
“ఇంతకీ ఏం ఆటలు ఆడారు? చెల్లాయి కూడా మీతో ఆడిందా?”
“మలేమో నా ఫ్లెండ్ వచ్చింది గా మేం ఇద్దలం ఆడుకున్నాము.” అంది చిన్నారి.
“నీకు ‘ర’ పలకడం ఎప్పటికీ వస్తుందే బాబూ” అంది నవ్వుతూ అశ్విని.
“పండు అలా మాట్లాడుతే ముద్దుగా ఉంటుందమ్మా” అన్నాడు శ్యామ్.
“అవును చిన్నప్పుడు నువ్వు కూడా నేను ‘అన్నాన్నా’ అంటూ చివరి అక్షరం రెండుసార్లు పలికేవాడివి. సరే హోమ్ వర్క్ పూర్తి అయ్యిందా “అంది నవ్వుతూ.
“ఇంకా కొంచెం ఉందమ్మా” అన్నాడు చిన్నవాడు.
“సరే పూర్తి చేసి కాస్సేపు టి.వి.చూడండి వంటయ్యాక భోజనం చేద్దూరుగానీ”అంది.
కాలింగ్ బెల్ కొట్టిన శబ్దానికి శ్యామ్ వెళ్ళి తలుపు తీశాడు.జగదీష్ వచ్చాడు. సోఫాలో కూర్చుని బూట్లు విప్పుకుంటూ “ఇవ్వాళ జ్వరం రాలేదన్న మాట” అన్నాడు.
“అందుకే ఇలా ఉన్నాను.మీకు టీ పెట్టనా?” అంది.
పిల్లలతో నవ్వుతూ భార్య కనబడేసరికి అతనికి చాలా ఆనందంగా ఉంది.ఇంక జ్వరం రాకుండా తగ్గిపోతే బాగుండును అది వస్తే వచ్చిన రోజు మంచం దిగనివ్వదు. ఆ తరువాత దాని ప్రభావం వారం రోజులు పీడించుకు తింటుంది
అతని ఆనందం హరించడానికన్నట్లు మర్నాడు మళ్ళీ జ్వరం వచ్చింది.
ఆఫీస్ నించి వచ్చేసరికి రజాయి కప్పుకుని పడుక్కున్న భార్య ఆమె చుట్టూ మూగిన పిల్లలు. అతనికి కడుపులో దేవినట్లుగా అయ్యింది. ఏమిటీ పరీక్ష తమకు ?ఈ రోగమేమిటీ డాక్టర్లకు అంతుపట్టని రోగమా ఇది అని.
“నాన్నా అమ్మ ఇవ్వాళ లేవదా? మాకెవరు అన్నం పెడతారు?” అన్నాడు చిన్నవాడు.
అసలే చిరాకుగా ఉంది అతనికి “అన్నం లేదు సున్నం లేదు,నోరు మూసుకోండి”అంటూ కసిరాడు.
తండ్రి కోపం చూసి భయం తో ముగ్గురూ వేరే గదిలోకి వెళ్ళిపోయారు. చిన్నవాడికి బెంగ అమ్మలేవక పొతే అన్నం ఎవరు పెడతారని.
అంత జ్వర తీవ్రతలో కూడా అశ్విని కి భర్త మాటలు వినబడ్డాయి.పిల్లల్ని అలా కసురుకోవడం నచ్చలేదు.
నిజంగా రేప్పొద్దున్న తనకేమైనా ఐతే పిల్లల గతి ఏమిటి? జగదీష్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు. ఆ వచ్చినావిడ తన పిల్లల్ని సరిగా చూస్తుందా? అది తలుచుకోగానే అసహాయత తో కళ్ళ వెంబడి నీళ్ళు.
కోపం లో కేకలేసినా మళ్ళి పిల్లలేం చేస్తున్నారో అని వాళ్ళ దాగ్గరకు వెళ్ళి ” ఆకలేస్తోందా?” అన్నాడు.
అవునన్నట్లుగా తల ఊపారు ముగ్గురూ.ఫ్రిజ్ తెరిచి బ్రెడ్ ఉందేమో అని చూసాడు కనబడ లేదు.వంటింట్లోకి వెళ్ళి బిస్కెట్స్ కోసం వెతికాడు కనబడ లేదు.ఎప్పుడూ వంటింట్లోకి రాడు.ఇది వరకు మంచి నీళ్ళైనా ముంచుకునే వాడు.పిల్లలు కాస్త పెద్దయ్యాక వాళ్ళను అడగడం మొదలు
పెట్టాడు. శ్యామ్ ని పిలిచి అడిగాడు ” అమ్మ బిస్కెట్స్ ఎక్కడ పెడుతుందో తెలుసా?” అని.
శ్యామ్ వెనకాతల వచ్చింది ప్రగతి. శ్యామ్ డబ్బా చూపిస్తుంటే అది కాదు అంటూ వేరే డబ్బా చూపించింది.
బిస్కెట్స్, తను చేసిన తినుబండారాలూ పిల్లలకు అందేటట్లుగా పెడుతుంది .ఎప్పుడైనా కావాలంటే వాళ్ళు తీసుకుని తింటారని అందుకని ప్రగతికి కూడా తెలుసు అమ్మ ఏ డబ్బాలో పెడుతుందని.
ఆ డబ్బాలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి ఇవి తినండి.అమ్మ లేచాక అన్నం వండుతుంది అని క్లబ్ కు వెళ్ళిపోయాడు.
చిన్న వాడికి చిరుతిళ్ళు ఇష్టం ఉండవు.వాడికి అన్నం కావాలి. అమ్మ లేచి ఎప్పుడు వండుతుందన్న అనుమానం. ఐనా ఆకలి వేసిందని నాలుగు బిస్కెట్స్ తిన్నాడు.
రాత్రి ఎనిమిదన్నర కు జ్వరం తగ్గి లేచింది.నీరసంగా ఉంది. మెల్లిగా మంచం మీద నించి లేచి వచ్చింది.పిల్లలు టి.వి.చూస్తున్నారు.ఏవో సినిమా పాటలు వస్తున్నాయి.
“నాన్నగారేరి?” అంది.
“క్లబ్ కి వెళ్ళారమ్మా”అన్నాడు శ్యాం
.
మనసు చివుక్కుమంది.పెళ్ళానికి వంట్లో బాగులేదు.పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళకి ఆకలేస్తే ఎలాగన్న ధ్యాస కూడా లేకుండా క్లబ్ కి వెళ్ళిపోయాడు.వండడం చేతకాకపోతే బైట నించి బ్రెడ్ తేవచ్చు.ఫ్లాస్క్ లో తనకి కాఫీ తేవచ్చు.ఈ మాత్రం జ్ఞానం, బాధ్యత, లేని మనిషిని ఏమనుకోవాలి?
అలా అనుకుంటే కళ్ళ వెంబడి నీళ్ళు.పిల్లలు చూడకూడదని మొహం పక్కకు తిప్పుకుని కళ్ళు తుడుచుకుంది.
అప్పటికీ శ్యామ్ చూసాడు.వాడికి అమ్మ ఎందుకు ఏడుస్తోందో తెలియక పోయినా ఏడుస్తోందని తెలుసు.
“అమ్మా ఏడుస్తున్నావా?” అన్నాడు.
“లేదు నాన్నా కళ్ళు మండుతున్నాయి అందుకే నీళ్ళు వస్తున్నాయి.ఆకలేస్తోంది కదూ ఇవ్వాళ్టికి చపాతీ చేస్తాను జామ్ తో తినండి” అంది.
గబగబా ఫ్రిజ్ లోంచి కలిపిన పిండి తీసి నెయ్యి బాగా వేసి పరాఠా లు చేసింది.పక్కన గాస్ మీద తన కోసం కాస్త టీ పెట్టుకుని కప్పులో పోసుకుంది. వేడి వేడి పరాఠాలు జామ్ వేసి ముగ్గురికీ ఇచ్చింది. చిన్నారి అప్పటికే నోట్లో వేలు వేసుకుని నిద్ర పోతోంది.దాన్ని లేపి కూర్చోబెట్టి చిన్న చిన్న ముక్కలు దాని నోట్లో పెడుతూ తను టీ తాగింది.వేడి టీ కాస్త ఒంట్లోకి వెళ్ళాక శక్తి వచ్చినట్లనిపించింది. పరాఠాలు తిన్నా ఇంకా ఆకలేస్తోందని వాళ్ళ మొహాలు చూసి అర్ధమయ్యింది.పొద్దున్న వండిన అన్నంలో కాస్త పెరుగు కలిపి ఇద్దరి కంచాల్లో వేసింది. చిన్నారి అప్పటికే నిద్ర కళ్లతో తూలుతోంది.
“మీరు తిని చెయ్యి కడుక్కోండి చెల్లాయిని పడుకోబెట్టి వస్తాను”అని ప్రగతిని ఎత్తుకుని మూతి తుడిచి మంచం మీద పడుకోబెట్టింది. మంచం మీద పడుకోగానే నోట్లోకి వేలు వెళ్ళిపోయింది.

సశేషం… 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top