అభిసారిక – శాంతి నిర్మల పెదపోలు

ఘడియకో ప్రేమలేఖ రాస్తునే ఉంటా..!
నీ గుండె తలుపులు
తెరిచే వరకు..!!
ప్రతి ఉదయం నీ కోసం విరినై వికసిస్తూనే ఉంటా ..!
నా ఉషోదయం నీవయ్యేవరకు..!!
చిరు గాలినై నిను మరల మరల తాకుతూనే ఉంటా..!
నా ఉనికిని నీవు
గుర్తించే వరకు..!!
పండు వెన్నెలను పిండి
వెలుగవుతూ ఉంటా..!
నా కనుల దీపమై
నువు వెలిగే వరకు..!!
నిదుర మబ్బు నీడలను
వెంటబెట్టుకొస్తా..!
నీకలల రాణినయ్యేవరకు..!!
వేణు గానమై నిను వెంటాడుతుంటా..!
నీ జీవన రాగం నేనేనని
నీకు తెలిసే వరకు..!!
వర్ష ఋతువై నిను తడుపుతూనే ఉంటా..!
నా వలపు జల్లుల్లో
నీవు తడిసే వరకు..!!
తటిల్లతనై నీ హృదిలో
మెరుస్తూనే ఉంటా..
నీ తలపులలో సజీవమై
ఉండే వరకు..!!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top