మీమాంస (కవిత) – ఏటూరి నాగేంద్రరావు

ఎవరు దేనికోసం
చేతులు చాస్తున్నారో!
దేనిని ఎవరినుండి
గ్రహిస్తున్నారో!
అస్తిత్వ సంక్షోభాల్ని
అనుభవిస్తూ,
నిద్దురకి, మెలకువకి మధ్య
జ్ఞాపకాల డాక్యుమెంటరీని
కలగంటారు.
సమస్తం ఛిద్రమవుతున్నా
కాళ్ళ మీద కాళ్ళేసుకొని
రహస్యాల్ని మనసు జేబులో
కుక్కుకొంటూ
కొన్నిసార్లు
తమని తాము మరచి పోతుంటారు.
ఏనాటిదో ఒక మీమాంస
అనుభూతుల్ని
అనుమానంగా కెలుకుతుంది,
గాలికి వదిలేసిన అనుభవాలన్నీ
మనసు ఇరుకు గదుల్లోకి నడిచి వస్తూ
బలిష్టంగా కరచాలనం చేస్తుంటాయి.
ఏ సహాయం లేకుండా
గడిపిన జీవనం
నా చుట్టూ వెచ్చగా పరుచుకొంటుంది.
లోపలెక్కడో ఆధ్యాత్మిక వాస్తవాలు మూలుగుతూ
ఒక విశ్వాసాన్ని అంగీకరిస్తుంది.
నిజానికి ప్రతిరాత్రీ
నాలో ఏదో
మేలుకొంటూనే ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top