ఎగురుతున్న జెండా మనది (31వ భాగం ) – డా.ప్రభాకర్ జైనీ

(గత సంచిక తరువాయి)   “తప్పదు మామయ్యా! మీరు నా మాట నమ్మండి. ముందు వైజాగ్ వెళదాం. అక్కడ రీజనల్ నేవల్ హెడ్ క్వార్టర్స్ లో మీకు పూర్తి రక్షణ ఉంటుంది. మిమ్మల్ని మళ్ళీ ‘నర్సాపురం’ కు, మీ ‘చరక’కు సగౌరవంగా తీసుకొచ్చే బాధ్యత నాది. మన కోసం హెలికాప్టర్ సిద్ధంగా ఉంది. మీకు నిత్యావసరమైన, ముఖ్యమైన వస్తువులు తీసుకోండి. తొందరగా బయల్దేరుదాం.” అంది. 

చారిగారు అప్పటికే బాగా అలసి పోయారు. అంత పెద్ద మారణ కాండ తన కళ్ళ ముందే జరిగే సరికి ఆయన చాలా డస్సి పోయారు. శార్వరి గారైతే దాదాపు స్పృహ కోల్పోయే స్థితికొచ్చారు. 

“సరేనమ్మా!” అంటూ వాళ్ళిద్దరూ యింట్లోకి వెళ్ళారు. 

“మీరు చాలా బాగా డీల్ చేసారండీ! చారిగారిని యిక్కడి నుండి కదిలించడమంటే మాటలు కాదు. మీరు మంచి మాటకారి కూడా!” అన్నాడు మనోజ్. 

పావని ఆ పొగడ్తకు కొంచెం యిబ్బందిగా నవ్వింది. 

ఈ లోపల పావని తన టీం మెంబర్సుకు అక్కడ ఏమేం పనులు చేయాలో, తమ ఆబ్సెన్స్ లో అందరూ అక్కడే ఉండి పరిస్థితిని గమనించాలనీ, ఒకళ్ళు లక్ష్మిని,  పుట్టణ్ణను, సాంబడిని తీసుకుని వైజాగ్ రావాలనీ సూచనలు చేసింది. అక్కడే ఉన్న పోలీస్ అధికారితో,  ఊరి ముందు, చెరువు కట్ట దగ్గర ఔట్ పోస్టులు పెట్టించమని, పెట్రోలింగ్ విరివిగా చేయాలని, ఆ ఏరియా పోలీస్ స్టేషన్లన్నింటిని రెడ్ అలర్ట్ లో ఉంచమని రిక్వెస్ట్ చేసింది. 

చారిగారూ, శార్వరి గారూ తమ సామానంతా రెండు సూటుకేసుల్లో సర్దుకుని బయటకొచ్చారు. వాళ్ళిద్దరి చేతుల్లో దేవుడి పటాలు, సాలిగ్రామాలు ఉన్నాయి. వాళ్ళిద్దరి కళ్ళ నుండి నీరు ధారగా కారుతుంది. చారిగారు నెమ్మదిగా కొండ మీదకెక్కి గుడి ముందు రెండు చేతులు జోడించి నిలబడ్డారు. 

“స్వామీ! బుద్ధి తెలిసిన నాటి నుంచీ ఒక్క రోజు కూడా నీ దర్శనం చేసుకోకుండా గడిపిన గుర్తు లేదు. ఇన్నాళ్ళకు, ఈ వయసులో నిన్ను వొదలవలసి వస్తుంది. ఇంత కన్నా నీ సేవలో తరిస్తూ, యిక్కడే ప్రాణాలు వొదలడమే నాకిష్టం. కానీ, యిదేదో దేశ భద్రతకు సంబంధించిన విషయమంటున్నారు. దేశ సేవలోనే ఉన్న కొడుకు తండ్రినైన నేను ఈ పని కూడా చేయకపోతే దేశ ద్రోహమే అవుతుంది. మళ్ళీ నీ దగ్గరకు తొందరగా పిలిపించుకో. ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా కలిగించు!” అంటూ దేవుడి పటాలు, సాలిగ్రామాలున్న పళ్ళేలు అక్కడ పెట్టారు. 

శార్వరి గారైతే పూర్తిగా నీరసించి పోయారు. 

“మాకేదో దుష్ట కాలం దాపురించింది. చెట్టెత్తు ఎదిగిన కొడుకును పోగొట్టుకున్నాము. ఇప్పుడు ఈ ఊరినీ వొదిలి పెట్టి వెళ్తున్నాము. మళ్ళీ ప్రాణాలతో వొస్తామో లేదో.. ” నంటూ ఏడ్చింది. 

లక్ష్మిని దగ్గరకు తీసుకుని “జాగ్రత్త తల్లీ! నిన్ను ఈ పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళాల్సి వొస్తుంది. ఇక్కడి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాక నీకు యిష్టమైతే ‘చరక’ లో ఉండు.  లేదంటే, మీ మేనమామగారింటికి వెళ్ళు” అన్నది. 

“అత్తయ్యా! శాస్త్రి గారి అంత్యక్రియలు అయ్యాక మా వాళ్ళు ఆమెను సేఫ్ గా ఉంచుతారు. లక్ష్మి గురించి మీరు వర్రీ కాకండి. ఈ కేసులో తను కూడా ముఖ్యమైన సాక్షి కాబట్టి ప్రభుత్వమే ఆమె బాధ్యత తీసుకుంటుంది. మనం వెళ్దాం పదండి. కొండల ప్రాంతం కదా! వెలుతురు తగ్గితే హెలికాప్టర్ వెళ్ళడం కష్టమౌతుంది. ప్లీజ్!” అని వాళ్ళను తీసుకుని హెలికాప్టరు ఎక్కింది. 

మనోజ్ అతని కొలీగ్, ఒక స్నైపర్ కూడా ఎక్కగానే, హెలికాప్టర్ బయల్దేరింది. 

సశేషం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top