బంధాలు – అనుబంధాలు (6వ భాగం)- సుజల గంటి

(గత సంచిక తరువాయి) టీ తాగి క్లబ్ కు వెళ్ళిపోయాడు జగదీష్.ఏ పదకొండు కో ఇల్లు చేరతాడు అతను.అతనికి పేకాట ఒక వ్యసనం.

 పిల్లలు ఆట నించి తిరిగి వచ్చేదాకా టి.వి చూస్తూ కూర్చుంది.( అప్పట్లో ఇంకా కేబుల్ టి.వి.రాలేదు) దూరదర్శన్ ఒక్కటే.పాడిపంటలు ప్రోగ్రామ్ వస్తోంది.ఐనా టి.వి మోగుతోంది. అది అలా మోగుతుంటే ఒక మనిషి ఉన్న భావన కలుగుతుంది.ఒంటరితనం అనిపించదు.

పేపర్ చదువుదామనుకునే లోపల కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసింది ఎదురుగా పక్కింటి అమ్మాయి, ఆవిడ చెయ్యి పట్టుకుని చిన్నారి. తల్లిని చూడగానే నోట్లో వేలు తీసి ‘ అమ్మా’ అంటూ  లోపలికి వచ్చింది.”ఆయియే” అంటూ పిలిచింది .

“లేదు మరోసారి. ఈయన కూడా ఆఫీస్ నించి వచ్చేశారు.కాస్సేపట్లో సినిమాకి వెడతాము”అంది.

“అలాగా” అని మనసులో సినిమా చూసి ఎన్నాళ్ళయ్యిందో” అనుకుంది.

పెళ్ళయిన కొత్తల్లో ఏం చూశారో అంతే పిల్లలు పుట్టాక ఒకసారి పిల్లవాడు సినిమాలో ఏడ్చాడని కోపం వచ్చి, “ఇంకెప్పుడైనా సినిమా అని అడుగు చెప్తాను” అంటూ హుంకరించాడు.

అప్పట్నించీ సినిమా సంగతి మర్చిపోయింది.ఎప్పుడైనా టి.వి.లో వచ్చిన సినిమా చూడ్డం కూడా ఇష్టం ఉండదు. పొమ్మనలేక పొగ పెట్టినట్లు,సినిమా చూస్తున్నంత సేపూ ఏదో కావాలని వంద సార్లు పిలుస్తాడు. అలా కొన్ని సార్లు జరిగాక సినిమా అంటేనే విరక్తి కలిగింది.

చిన్నారిని ఎత్తుకుని “పాలు తాగుతావా?” అంది.

“వద్దు ఆంటీ ఇచ్చింది” అంది.

“మలేమో అక్కడ ఆంటీ కేక్ చేచింది. ఎంత బాగుందో.నువ్వెప్పులు చేస్తావు?” అంది.

నిజమే ఇదివరకు పిల్లలకు కావాల్సినవన్నీ తెగ చేసేది.రకరకాల కేక్ లూ దాని మీద చక్కగా ఐసింగ్ అన్నీ చేసేది.ఈ మధ్య వంట వండడమే అపురూపమై పోయింది.ఇంక కేక్ లు చేసే ప్రసక్తి లేదు.

దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని “ నాకు ఆయి తగ్గిపోయాక అప్పుడు చేస్తాను” అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది.

“నీకు మల్లీ ఆయి వచ్చిందా?” అంటూ తన చిన్న చెయ్యి తల్లి ఒంటి మీద వేసింది.

“లేదు ఇవ్వాళ రాలేదు.పూర్తిగా తగ్గిపోయాక అప్పుడు చేస్తాను.” అంది.

ఇంతలో బైటికి  ఆడుకుందుకు వెళ్ళిన మొగపిల్లలు వచ్చారు.

“అన్నయ్యా ఇవ్వాల అమ్మకు ఆయి రాలేదు”అంది చిన్నారి.

“తల్లి వైపు సంతోషం గా అవునా అన్నట్లు చూశారు పిల్లలిద్దరూ.

వాళ్ళను దగ్గరికి తీసుకుని “అవును ఇవ్వాళ జ్వరం రాలేదు.మీకేం కావాలో చెప్పండి ఇవ్వాళ అదే చేస్తాను “అంది అశ్విని.

“ ఒరేయ్ రవీ అమ్మ ఇవ్వాళ మన కిష్టమైనది చేస్తుందిట ఏం చెయ్య మందాము?” అన్నాడు పెద్దవాడు శ్యామ్.

రవి నోటి వెంట వెంటనే పూరీ ఛోలే అని వచ్చింది.అది వాడికిష్టమైనది.వాడి మాటలకు నవ్వు వచ్చింది అశ్వినికి.

“రేపు చేస్తాలే.ఛోలే  నాన బెట్టాలి కదా!ఇవాళ పులావ్ చేస్తాను.”అంది.

దానికే వాళ్ళు సంతోషించారు.ఈ మధ్య తరుచూ పప్పన్నం లేకపోతే బ్రెడ్ తింటున్నారు.పులావ్ చేద్దామని వంటింట్లోకి వెళ్ళింది.

ఆరు గంటలకు అలారం మోగగానే లేచింది. మగ పిల్లలిద్దరూ వేరే గదిలో పడుకుంటారు. చిన్నారి ఇంకా అమ్మా నాన్నల మధ్య పడుకుంటుంది.

పెద్ద పిల్లలిద్దర్నీ స్కూల్ కి పంపాలి.వాళ్ళకు టిఫిన్ బాక్స్ లు సర్దడం తినడానికేమైనా టిఫిన్ చేశాక వాళ్ళ బట్టలు ఇస్త్రీ చేస్తుంది.బూట్లు మాత్రం రాత్రే పాలిష్ చేసి పెడుతుంది.జగదీష్ మూడ్ ఉన్నప్పుడు పిల్లల్ని తయారుచేయడం లో సహాయం చేస్తాడు.

పావు తక్కువ ఏడు గంటలకు పిల్లలిద్దర్నీ లేపుతుంది. ఏడుంపావు కల్లా ఇద్దరూ తయారవుతారు, పిల్లల్ని తీసుకెళ్ళడానికి  స్కూల్ బస్ కాలనీలోకే వస్తుంది.ఏడుంపావుకి లేచి టీ తాగి పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కిస్తాడు జగదీష్.

బస్ ఎక్కించి వచ్చి పేపర్ చదువుతూ మరొక కప్పు టీ తాగి అప్పుడు ఆఫీస్ కి తయారవుతాడు.కాలనీకి ఆఫీస్ దగ్గరే. స్కూటర్ మీద వెడతాడు.పొద్దున్న టిఫిన్ తిని, లంచ్ కి ఇంటికి వస్తాడు.కాలనీలో దాదాపు అందరు మగవాళ్ళు మధ్యాహ్నం భోజనానికి వస్తారు.తొందరగా వంట ముగించుకున్న ఆడవాళ్ళు ఫ్లాట్స్ ముందు ఉన్న ఖాళీ స్థలంలో కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటారు.

అశ్విని కి అనారోగ్యం తో కొంత, చిన్నారి ఇంకా చిన్నపిల్ల అవడం మూలాన్ని మిగిలిన వాళ్ళల్లా కబుర్లు చెప్పడం కుదరదు.అందరి తో కలవదని కొంత మంది ఆమెకు గర్వం అనుకోవడం కూడా తెలుసు.అప్పటికీ కూరల కోసం వెళ్ళినప్పుడు నవ్వుతూ అందర్నీ పలకరిస్తుంది.

చిన్నారి లేవడం చూసి దానికి బ్రష్ చేయించి పాలు ఇచ్చి, బొమ్మలు ముందు వేసి ఆడుకోమంది.

మధ్యాహ్నం జగదీష్ లంచ్ కి వచ్చి వెళ్ళాక చిన్నారి తో బాటు పడుకుంటే నిద్ర పట్టేసింది.

కాలింగ్ బెల్ కొట్టిన శబ్దానికి అయ్యో పిల్లలు వచ్చి వుంటారని తలుపు తీసింది.గుమ్మంలో మిసెస్ కపూర్ నిలుచుని ఉంది.

ఆవిడ మొహం చూస్తే కోపంగా ఉంది. ఐనా నవ్వుతూ “రండి భాభీజీ” అంది.

“చూడండి మీ అబ్బాయి మా అమ్మాయిని కొట్టాడు.బస్ లో రోజూ ఏడ్పిస్తాడు”అంటూ వాళ్ళ పిల్లను చూపించింది.వాళ్ళ అమ్మాయి వీడికన్నా పెద్దదే ఐనా ఏడుపు మొహం తో నించుంది.

వీళ్ళ వెనకగా వస్తున్న పిల్లలు కనిపించారు శ్యామ్ మొహం కూడా దిగాలుగా ఉంది.తప్పు చేశాడు కొడతానని మొహం దిగాలుగా పెట్టాడనుకుంది అశ్విని.

“సరే వాడిని అడిగి దండిస్తాను “అంది.ఆవిడ కోపంగా “ఇలా ఇంక జరగ కూడదు” అంటూ వెళ్ళిపోయింది.

పిల్లలు లోపలికి రాగానే బాగ్ లుతీసుకుని లోపల పెట్టి శ్యామ్ ను చితక బాదింది.అసలే నీరసంగా ఉంది. ఆవిడ అలా వచ్చి చెప్పగానే కోపం పట్టలేక వాడి మీద చెయ్యి చేసుకుంది.ఎప్పుడూ కొట్టని తల్లి కొట్టేసరికి వాడు వెక్కివెక్కి ఏడుస్తూ వెళ్ళి మంచం మీద పడుకున్నాడు.రవి,చిన్నారి భయ పడి గదిలోకి వెళ్ళి పోయి మంచం మీద కూర్చున్నారు.

కొద్ది సేపట్లో కోపం తగ్గాక పిల్లవాడ్ని కొట్టినందుకు ఏడ్చింది.లోపలికి వెళ్ళి వాడ్ని లేపి బట్టలు మార్చుకుని రమ్మంది.వాడితో బాటు చిన్నవాడు కూడా బట్టలు మార్చుకుని వచ్చాడు.ఇద్దరికీ పప్పన్నం కలిపి నోట్లో పెట్టింది.పెరుగు అన్నం తిన్నాక “అమ్మా అన్నయ్య తప్పు చేయలేదు” అన్నాడు రవి.

“మరి ఆంటీ అబద్ధం చెప్పిందా?” అంది.

“ప్రాచీ వే ఏడ్పిస్తుంది బస్ లో అందర్నీ .అలా ఎందుకు చేస్తావు?నిన్ను ఎవరైనా ఏడిపిస్తే ఉరుకుంటావా అని అన్నాడు అన్నయ్య. దానితో కోపం వచ్చి వాళ్ళ అమ్మ తో అబద్ధాలు చెప్పినట్లుంది” అన్నాడు.

అవునా అన్నట్లుగా శ్యామ్ వైపు చూసింది. అవునన్నట్లుగా తల ఉపాడు.

“అమ్మా ఒక మాట అడగనా?” అన్నాడు శ్యామ్

“”అడుగు నాన్నా”

“ కపూర్ ఆంటీ నా మీద నీకు చెప్పినట్లుగా ప్రాచీ మీద నువ్వు చెప్పు ఆంటీ నమ్ముతుందేమో చూడు.నువ్వు ఎవరు చెప్పినా మాదే తప్పని నమ్ముతావు.”అన్నాడు.

ఆ మాట తో ఒక్కసారి బుర్ర తిరిగింది.అంత చిన్నవాడికి ఉన్న విచక్షణ తనకు ఎందుకు లేక

పోయింది? ఆవిడ చెప్పగానే నిజానిజాలు ఆలోచించకుండా పిల్లవాడ్ని కొట్టింది.ఛ ఈ రోగం తనని ఎందుకూ పనికిరానిదాన్ని చేసింది అని అనుకోగానే వాడ్ని దగ్గరకు తీసుకుని వెక్కివెక్కి ఏడ్చింది.

తల్లి ఏడవడం చూసి ముగ్గురూ ఏడుపు మొదలు పెట్టారు.వెంటనే తనను తాను నిలదొక్కుకుని, కళ్ళు తుడుచుకుని, “వద్దు ఏడవకండి అన్నీ మర్చిపోయి ఆడుకోండి సారీ నాన్నా ఇంకెప్పుడూ అలా చెయ్యను” అంది.

చిన్నది తన చేతులతో కళ్ళు తుడిచి “నువ్వు ఏలవకు ఆంటీ బాడ్” అంది.

సశేషం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top