మనోజ్ఞ సీరియల్ (59వ భాగం) – సలీం

(గత సంచిక తరువాయి)   ‘‘అప్పుడు మీ పెదనాన్న యింట్లో లేరా?’’

‘‘లేరు. చేవెళ్ళలో ఉన్న పదెకరాల పొలం చూసి రావడానికి వెళ్ళారు. ఆయన తిరిగొచ్చాక నేనేమీ చెప్పలేదు. ఇప్పటివరకూ పెదనాన్నకు ఈ విషయం తెలియదు. అసలు సమస్యంతా నా పెళ్ళి దగ్గర మొదలైంది. పెళ్ళికి ఒక్క రూపాయి ఖర్చు చేసినా వూర్కునేది లేదని పెద్దమ్మ పట్టుపట్టి కూచుంది. కట్నకానుకలిచ్చి నా  పెళ్ళి చేసే స్థోమత మా నాన్నకు ఎక్కడుంది? పెదనాన్నకూ పెద్దమ్మకూ ఈ విషయంలో పెద్ద గొడవైంది. ‘మన మనవళ్ళకూ మనవరాళ్ళకూ చెందాల్సిన డబ్బుల్ని వేరేవాళ్ళకోసం ఖర్చు చేస్తానంటే ఎలా ఒప్పుకుంటాను?’ అంది పెద్దమ్మ. అక్కలిద్దరూ పెద్దమ్మ అభిప్రాయాన్నే బలపర్చారు. అప్పటికి అక్కలిద్దరికీ పెళ్ళిళ్ళయి పిల్లలున్నారు. ‘నా తమ్ముడి పిల్లలు కూడా నాపిల్లలే. వాళ్ళ బాధ్యత నాదే’ అన్నాడు పెదనాన్న.’’

‘‘మీ పెదనాన్న రిటైరైనప్పుడు పి.ఎఫ్‌, గ్రాట్యూటీలన్నీ కలిపి లక్షల్లో బెనిఫిట్స్‌ అంది   ఉంటాయిగా.  మీ పెద్దమ్మను అడగాల్సిన అవసరం ఏముంది?’’

‘‘పెదనాన్నకు మొదట్నుంచీ ఓ అలవాటుంది. స్థలాలు కొన్నా, పొలాలు కొన్నా పెద్దమ్మ పేరుతోనో అక్కల పేరుతోనో కొనేవారు. యిల్లు పెద్దమ్మ పేరునే ఉంది. రిటైరైనాక వచ్చిన డబ్బుల్ని పెద్దమ్మ పేరుతో  ఫిక్సెడ్‌ డిపాజిట్లలో పెట్టారు. అందుకే నా పెళ్ళికి డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరికో వడ్డీకి  యిచ్చిన డబ్బులు రావల్సి ఉంటే  వాళ్ళనడిగి డబ్బులు వెనక్కి తీసుకుని నా పెళ్ళి, చెల్లి పెళ్ళి చేశారు. నా  పెళ్ళి తర్వాత పెద్దమ్మ ఆయనమీదా నామీదా ఆంక్షలు విధించింది. ఆయన మా యింటికి రాకూడదు. నేను ఆయన్ని కలవడానికి వాళ్ళింటికి వెళ్ళకూడదు. నేనాయన్ని చూడకుండా ఉండలేను. ఆయనకూడా అంతే. ఇద్దరం ఎంత నరకం అనుభవించామో.. పెదనాన్న ఏవో అబద్ధాలు చెప్పి శనాదివారాలు మాయింటికొచ్చేవారు. ఓరోజు పెద్దమ్మకీ విషయం తెలిసి బాగా గొడవైంది. పెద్దమ్మ చాలా పరుష పదజాలంతో దూషించిందట. అది పెదనాన్న తట్టుకోలేకపోయాడు. ‘నేనూ నా పిల్లలు కావాలో మానస కావాలో తేల్చుకోండి’ అందట పెద్దమ్మ. ‘నాకు మానసే కావాలి’ అని పెదనాన్న కట్టుబట్టల్తో ఇక్కడికి వచ్చేశారు’’ మానస వెక్కిళ్ళు పెట్టి ఏడ్వసాగింది.

‘‘ఎందుకేడుస్తావు? అంత గొప్పగా ప్రేమించే పెదనాన్న నీకున్నందుకు సంతోషపడాలి కదా’’ అంది  మనోజ్ఞ.

‘‘నా కోసం పెద్దమ్మని, అక్కల్ని వదిలొచ్చారు. ఇంద్రభవనం లాంటి మూడంతస్థుల యిల్లు, పొలాలు, స్థలాలు, ఫ్లాట్లు… కోట్ల ఆస్థిని వదిలేసి, ఇక్కడ ఈ హోంలో, వాళ్ళింట్లో బాత్రూం ఎంతుంటుందో అంత గదిలో ఉంటున్నందుకు బాధ వేస్తుంది కదా మేడం’’ అంది మానస.

‘‘యిల్లు మూడంతస్థులున్నా, ముూడు వేల చదరపు అడుగుల వైశాల్యంతో ఉన్నా యింట్లో ప్రేమించే మనుషులు లేకపోతే ప్రయోజనం ఏముంది చెప్పు. యిక్కడ ఆయన సంతోషంగా   ఉన్నారు. ఆయనకు నువ్వున్నావు. అంతకన్నా ఏమనిషికైనా ఏం కావాలి?’’ అంది మనోజ్ఞ. అలా అంటున్నప్పుడు ఆమెకు తన జీవితమే గుర్తొచ్చింది. రెండంతస్థుల స్వంత యింటిని వదులుకుని వచ్చింది అక్కడ ప్రేమలేకనేగా. జాకబ్‌ గారికి మల్లే తన పేరుతో కూడా ఆస్థులేమీ లేవు. కానీ జాకబ్‌ గారి కోసం ప్రాణమైనా యిచ్చే మానస ఆయనకుంది. మరి తనకెవరున్నారు? ప్రేమ రాహిత్యంలో బతకడం  దుర్భరం. అందుకేనేమో తను జాకబ్‌ గారిలో తన తండ్రిని చూసుకుని సంతృప్తి పడుతోంది.

మానస కొద్దిసేపు నిశ్శబ్దంగా కూచుని, లేచి వెళ్ళబోతూ ‘‘మా పెదనాన్నని జాగ్రత్తగా చూసుకోండి మేడం. ఆయనది పసిపిల్లాడిలాంటి మనస్తత్వం. ఎవరైనా ఆత్మీయంగా చూస్తే చాలు వెన్నలా కరిగిపోతారు’’ అంది.

‘నేనూ అంతే.. కానీ నన్ను ఆత్మీయంగా చూసేవాళ్ళెవ్వరూ లేరు’ అని మనసులో అనుకుని, పైకి మాత్రం నవ్వుతూ ‘‘నువ్వేమీ వర్రీ కాకు. నేను చూసుకుంటాలే’’ అంది.

జాకబ్‌కి ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. ఆలోచనలు.. ఊప్పెనలా ముంచే స్తూ ఆలోచనలు.. ఏంటీ జీవితం.. ప్రాకులాడేంత ఏముందని ఇందులో.. ఏదీ శాశ్వతం కాదు. యవ్వనంలో ఉన్నప్పుడు ప్రేమ శాశ్వతం అనుకున్నాడు. ప్రేమ ఎప్పుడూ ఒకేలా, అందంగా మలిచిన పాలరాతి శిల్పంలా ఉండదు. కాలం కరిగేకొద్దీ పాలరాయి కాస్తా బండరాయిలా మారి పోవచ్చు. అందమైన ఆకృతి వికారంగా రూపాంతరం చెందొచ్చు. మనుషులే శాశ్వతం కానపు డు ప్రేమలూ అనుబంధాలు ఆత్మీయతలు శాశ్వతం అనుకోవడం ఎంతటి భ్రమో.. మనుషులు తమని తాము మోసం చేసుకుంటూ ఎలా బతికేస్తారో.. తను కూడా అటువంటి భ్రమల్లోనేగా మొన్నటివరకూ బతికాడు..

గాయత్రి ప్రేమ మంచు పర్వతంలా ఉన్నతమే కాదు శాశ్వతం కూడా అనుకున్నాడు. ఆమె ప్రేమ సముద్రమంత లోతైనదనుకున్నాడు. ఎప్పటికీ ఇంకిపోని అజరామరమైన  ప్రేమ తన స్వంతమైనందుకు పొంగిపోయాడు. కానీ చివరికి ఏమైంది? పూర్తిగా ఎండిపోయి ఎడారిలా మారిపోయింది.

గాయత్రిని పెళ్ళి చేసుకోడానికి వాళ్ళ నాన్న పెట్టిన షరతులన్నిటికీ ఒప్పుకున్నాడు. అమ్మ హెచ్చరిస్తూనే ఉంది. తనకే ప్రేమ మైకంలో ఏమీ తెలియలేదు.

‘మా అమ్మాయిని మతం మార్చుకోమని బలవంతపెట్టకూడదు’ అనేది అతని మొదటి షరతు. అసలు తనకలాంటి ఉద్దేశమే లేనందువల్ల వెంటనే దానికి ఒప్పుకున్నాడు.

‘సరదాకి కూడా గాయత్రిని చర్చికి పిల్చుకెళ్ళకూడదు. బైబిల్‌ చదవమని చెప్పకూ డదు’ అనేది అతని రెండో షరతు. దానిక్కూడా మనస్పూర్తిగా ఒప్పుకున్నాడు.

‘నువ్వు మతం మారాలి.. మా హిందూ మతంలోకి రావాలి’ అన్నప్పుడే చాలా ఆలోచిం చాడు. తనకు ఈ కులాల మీద మతాల మీద ప్రత్యేకమైన ఇష్టమంటూ ఏమీలేదు. కానీ మతం మారాల్సిన అవసరమేమిటో అర్థం కాలేదు. గాయత్రి హిందూ మతాన్ని అనుసరి స్తుంది. తను క్రిష్టియన్‌ మతాన్ని .. గాయత్రి గుళ్ళకూ గోపురాలకు వెళ్తుంది. తను చర్చికి వెళ్తాడు. గాయత్రి హిందూ దేవుళ్ళను పూజిస్తుంది. తను జీసస్‌ని ప్రార్థిస్తాడు. తామిద్దరూ వేరే వాళ్ళ మత నమ్మకాల్లో జోక్యం చేసుకోనపుడు తను మతం మారాల్సిన అగత్యమేమిటని గాయత్రి వాళ్ళ నాన్ననే అడిగాడు.

సశేషం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top