అన్నపూర్ణ (59వ భాగం) – పెబ్బిలి హైమావతి

(గత సంచిక తరువాయి) శరత్‌ను చదివించాలని అన్నపూర్ణ గత వారం రోజులుగా శెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉంది. రేపటి నుండి కాలేజీకి వెళ్దామని అనుకుంటోంది. ఈరోజు కొడుకు ఇలా పరీక్ష రాయకుండా రావడం చూసి ఆ తల్లి మనసు తల్లడిల్లి పోయింది. సంవత్సరం రోజులుగా వాడు పడిన కష్టమంతా వృధా అయిందే అని బాధపడిరది.

తన కోసం ఏడుస్తున్న కొడుకుని ఎలా ఓదార్చాలో బోధపడలేదు ఆమెకు. రాష్ట్ర స్థాయిలో మంచి రేంకు రావలసిన కొడుకు చదువు, కుటుంబ కలహాల వలన ఇలా అయిపోయిందే అని బాధపడిరది. ఇంకా అక్కడే ఉంటే పరీక్ష రాయలేక పోయాననే బాధ వాడిని ఎక్కడ తినేస్తుందోనని భయపడిరది. అందుకే అన్నగారి ఇంటికి వెళ్లిపోదామని నిర్ణయించుకొంది.

                ‘‘లే నాన్నా, ముఖం కడుక్కొని బట్టలు మార్చుకొని రా!’’ అంటూ శరత్‌ని లేవదీసి తానూ తయారయి ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది అన్నపూర్ణ. అంతకు రెండు రోజుల క్రితమే అన్నగారు విశాఖపట్నం వచ్చామని ఫోన్‌ చేసి చెప్పడం వలన సరాసరి అక్కడికే వెళ్లిపోయింది.

అన్నపూర్ణతో పాటు వచ్చిన శరత్‌ని చూసి వసుంధర ఎంతో ఆశ్చర్యపోయింది. ‘‘ఏమిట్రా ఇలా  వచ్చావు? ఇవ్వాల్టి నుండీ నీకు పరీక్షలు కదా!’’ అంది.

‘‘లేదు వదినా, వాడు పరీక్ష రాయలేదు …’’ అంటూ జరిగిందంతా చెప్పింది. అది విన్న వసుంధరకి ఏమనడానికీ ఏమీ పాలు పోలేదు. రాజారావు ఇంటికి వచ్చాక వాళ్లని చూడడంతోనే, ఏం జరిగిందో తేలిగ్గానే గ్రహించాడు.

‘‘పోన్లేరా దిగులు పడకు … ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం పరీక్ష రాసి ఇంకా మంచి మార్కులు తెచ్చుకుందుగానీ!’’ అన్నాడు ఓదార్పుగా.

కొడుకుని అక్కడ ఉంచి తిరిగి వెనక్కు వెళ్లి పోవాలనుకుంది అన్నపూర్ణ. కానీ ఎంత ప్రయత్నించినా ఒంటరిగా తల్లి అక్కడకు వెళ్లేందుకు శరత్‌ ఇష్ట పడలేదు. మరో రెండు రోజులు అన్నగారి ఇంట్లో ఉండి స్తిమిత పడ్డాక శరత్‌ని తీసుకొని విజయనగరం వచ్చేసింది.

అన్నపూర్ణ విశాఖపట్నం వెళ్లిన రోజున సాయంత్రం నాలుగ్గంటలకు ఇంటికి వచ్చాడు విజయకుమార్‌. ఇంట్లో ఎవరూ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు.  వండిన వంట వండినట్లే ఉంది. తినకుండా ఎక్కడికి పోయారు అనుకున్నాడే గానీ, కొడుకు పరీక్ష ఎలా రాశాడని గానీ,  వాళ్లు ఎక్కడికి వెళ్లారని గానీ కొంచెం కూడా ఆలోచించలేదు.

తిరిగి రెండు రోజుల తర్వాత వచ్చిన భార్యాబిడ్డలను చూసి ‘‘మళ్లీ ఎందుకు వచ్చారు? నేను చెప్పిన మాట వినలేని వాళ్లకు  నా ఇంట్లో ఉండే అర్హత లేదు’’ అన్నాడు తగువుకు దిగుతూ.

‘‘నీ ఇల్లెక్కడ ఉంది ఇక్కడ? ఇది నా ఇల్లు … పోవాలనుకుంటే నువ్వే వెళ్లిపో!’’ అంది అన్నపూర్ణ కరుగ్గా.

‘‘అంతదాకా వచ్చిందా వ్యవహారం … అదీ చూస్తాను అయితే!’’ అంటూ విచక్షణా రహితంగా భార్యాబిడ్డలను ఇద్దరినీ కొట్టి వీధిలోకి నెట్టేసి తలుపు వేసుకున్నాడు. దారిన పోయే వాళ్లందరూ వారిని వింతగా చూస్తూంటే … ఆ తల్లీకొడుకులు ఇద్దరూ సిగ్గుతో చితికిపోయారు.

అమ్మా, మనం ఈ ఇంట్లో ఉండడం ఇంకా అవసరం అంటావా? వెళ్లిపోదాం పదమ్మా!’’ అన్నాడు శరత్‌.

‘ఎక్కడికి వెళ్తాం రా … ఇదే మన ఇల్లు!’’ అంది ధృఢంగా.

‘‘అయినా సరే వద్దమ్మా … వెళ్లి పోదాం ఇక్కడి నుండి!’’ అన్నాడు శరత్‌ బ్రతిమాలుతున్నట్లుగా.

‘‘ఏమిటి నాన్నా నువ్వు కూడా అలా అంటావు? ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తాము?’’ అంది.

‘‘ఎక్కడికైనా ఫర్వాలేదు. ఈ ఇంట్లో మాత్రం నేను ఉండను’’ అన్నాడు శరత్‌ స్థిరంగా.

అంత పట్టుదలగా మాట్లాడుతున్న కొడుకు ఆలోచనను తానింక మార్చలేను అనుకొంది. మోహనరావు ఇంటికి శరత్‌ని తీసుకొని వెళ్లింది. జరిగిందంతా విని మోహనరావు నిట్టూర్చాడు.

‘‘కుక్క తోక వంకర … అన్నట్లు కొందరు ఇంతేనమ్మా! వారు సుఖపడరు … మిగతా వారిని సుఖపడనివ్వరు. నీ కొడుక్కి నీ ఆత్మాభిమానమే వచ్చినట్లుంది. అందుకే డబ్బు కంటే మనుషులకూ, మనసులకూ ఎక్కువ విలువ ఇస్తున్నాడు’’ అన్నాడు.

శరత్‌ ఆ ఇంట్లోకి రానన్నాడు కనుక మోహనరావు సాయంతో తనకి అవసరమైన సామాన్లు అన్నిటినీ తీసుకొని కాలేజీకీ దగ్గరగా ఇల్లు తీసుకొని వెళ్లిపోయింది అన్నపూర్ణ.

తన ధాటికి ఆగలేక వెళ్లిపోయిన భార్యను చూసి వికటంగా నవ్వుకున్నాడు విజయకుమార్‌.

ఐతే ఆ ఇంటిని వదిలి వెళ్లినా … ఇంటి మీద హక్కులను వదులుకునేందుకు అన్నపూర్ణ సిద్ధంగా లేదు.

నెల నెలా జీతం నుండి కటింగ్‌ అవుతున్న హౌసింగ్‌లోన్‌ డిటైల్స్‌ని పట్టుకొని మోహనరావు దగ్గరకు వెళ్లింది కేసు ఫైల్‌ చేసేందుకు.

‘‘నువ్వేం బాధపడకమ్మా … ఈ కేసు నేను టేకప్‌ చేస్తాను. ఆధారాలతో సహా అన్నీ మన పక్షాన ఉన్నాయి … వాడు నీకు ఇల్లు ఎలా స్వాధీనం చేయడో చూస్తాను’’ అన్నాడు మోహనరావు. మాలతి కూడా అన్నపూర్ణని ఎంతో ఓదార్చింది.

అయితే దురదృష్టవశాత్తూ ఆ రాత్రే మోహనరావుకి గుండెపోటు వచ్చింది. హాస్పటల్‌కి చేరే లోగానే ప్రాణం పోయింది. జరిగిందానికి ఎంతో బాధపడిరది అన్నపూర్ణ. ఇదంతా నా దురదృష్టం అనుకుంది. తరచూ అక్కడికి వెళ్లి మాలతిని ఓదారుస్తూ ఉండేది. కష్ట సమయంలో తనని ఆదుకున్న ఆ భార్యాభర్తలంటే ఎంతో గౌరవం ఆమెకి.

ఆ తరువాత ఎవరి దగ్గరకు వెళ్లినా … తన పరపతిని ఉపయోగించి అన్నపూర్ణ కేసుని తీసుకోకుండా చేశాడు విజయకుమార్‌. జరిగిందంతా తెలుసుకున్న రామనాధం కొడుకుని సరిచేయాలనుకొని చాలా ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. చేసేదేంలేక అన్నపూర్ణని కలిసి తన సానుభూతిని తెలియజేశాడు.

ఇల్లు స్వాధీనం చేయకపోవడమే గాక, అన్నపూర్ణ ఇంటికి వచ్చి ఏదో ఒక గొడవ పెట్టుకొని చుట్టుపట్ల వారి దగ్గర ఆమె మర్యాద పోయేలా చేసి మనశ్శాంతి లేకుండా చేయసాగాడు. ఆ బాధ పడలేక విడాకులకు అప్లై చేసింది అన్నపూర్ణ.

                అది తెలిసి ‘‘సంఘంలో నా ఇమేజిని దెబ్బ తీయాలనే కదా … విడాకులంటున్నావు. నేను చచ్చినా విడాకులు ఇవ్వను. నీకు దిక్కున్న చోట చెప్పుకో!’’ అన్నాడు ఏమాత్రం సంకోచం లేకుండా.

                ఆయాచితంగా వచ్చే డబ్బు మీద కాంక్ష భార్యాభర్తల సంబంధాలను నిర్దేశించే స్థాయికి చేరుకుంది. ఒకనాటి ప్రేమికులు ఈనాడు బద్ధ శత్రువుల్లా మారిపోయారు. అన్నపూర్ణ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ సాయంతో విజయకుమార్‌ నుండి విడాకులు తీసుకోగలిగింది. వాళ్ల సాయంతోనే తన ఇంటిని కబ్జా చేశాడని విజయకుమార్‌ మీద కేసు ఫైల్‌ చేసింది.

                ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయకుమార్‌ నుండి ఎదురైన చేదు అనుభవాల వలన మొదట్లో బాగా కృంగిపోయింది అన్నపూర్ణ. క్రమంగా తనని తాను కూడదీసుకుని మొక్కవోని ధైర్యంతో ఒంటరి పోరాటాన్ని కొనసాగించింది.

                పిల్లలిద్దరూ తల్లి పడిన కష్టాలను కళ్లారా చూశారు కనుక ఆమెకు బాసటగా నిలిచారు. చిన్న వయసులోనే అన్నీ అర్ధం చేసుకొని పరిస్థితులకు అనుగుణంగా మసలుకొనే నేర్పు సంపాదించారు. ఆ పైన  రాజారావు చెల్లెలి కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచాడు. పిల్లల చదువులు విజయనగరంలో ఉంటే సక్రమంగా సాగవని విశాఖపట్నానికి ట్రాన్స్‌ఫర్‌ పెట్టుకొని వచ్చేసింది.

                తల్లి పడిన కష్టాలకు ప్రతిఫలంగా పిల్లలిద్దరూ బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చారు. శరత్‌ యం.టెక్‌ పాసయ్యి పేరున్న పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. అమృత బి.టెక్‌ అయ్యాక కేంపస్‌ సెలక్షన్‌ ద్వారా ఉద్యోగం సంపాదించుకొని తన కొలీగ్‌ అభిరామ్‌ని పెద్దల అనుమతితో వివాహం చేసుకొంది.

                కేసు తేలిపోవడంతో విజయనగరం లోని ఇంటిని కోర్టు ద్వారా స్వాధీనం చేసుకొంది అన్నపూర్ణ. ఆ ఊరితో సంబంధాలు ఉండడం ఇష్టం లేక ఆ ఇంటిని అమ్మేసి … అన్నగారి ఇంటికి దగ్గరలో ఉన్న అపార్టుమెంటులో రెండు ఫ్లాట్స్‌ తీసుకొని పిల్లలిద్దరి పేరునా పెట్టింది. ఒకదానిలో తాను ఉంటూ రెండోదానిని అద్దెకు ఇచ్చింది. 

                పిల్లలిద్దరూ సెటిల్‌ అయ్యారు కనుక అన్నపూర్ణని వి.ఆర్‌.ఎస్‌ తీసుకోమని రాజారావు, శరత్‌లు వత్తిడి చేయసాగారు. ప్రస్తుతానికి లాంగ్‌లీవ్‌ పెడతాను … తర్వాత సంగతి తర్వాత చూద్దాం! అంటూ లీవ్‌ పెట్టి కొచ్చిన్‌ లో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్లిపోయింది.

                పెళ్లిచూపుల పేరుతో హైదరాబాదు వెళ్లి అవమాన పడడంతో … జరిగిందంతా గుర్తుకు రాగా అన్నపూర్ణ కళ్లు చెమ్మగిల్లాయి. పైటచెంగుతో కళ్లు ఒత్తుకుంటూ శరత్‌, అమృతల వంక చూసుకుంది.

000

                అనుకున్నట్లే అందరూ నిడదవోలులో దిగి జీడిగుంట వెళ్లారు. శాంతమ్మా, రంగయ్యలు వయసు మీద పడినా … ఉత్సాహం మాత్రం ఏమీ తగ్గలేదు వాళ్లలో. వాళ్లు వెళ్లే సరికి వంటంతా చేసి సిద్ధంగా ఉంచింది శాంతమ్మ.

పిల్లల్ని, మనవల్ని కళ్ల నిండుగా చూసుకొని మురిసిపోయారు. రోజులు ఎలా గడిచాయో తెలియకుండా వారం రోజులు గడిచిపోయాయి.

                శరత్‌ శెలవులు అయిపోయాయని కొచ్చిన్‌ బయలుదేరాడు … అన్నపూర్ణను తనతో పాటు రమ్మన్నాడు.

                ‘‘ఇంకిప్పుడు రానులేరా … నేను పెట్టిన శెలవు కూడా అయిపోయింది. కాలేజీకి వెళదామనుకుంటున్నాను. నాగూర్చి నువ్వేమీ దిగులు పడకు. అమృత వచ్చి కొన్నాళ్లు నాకు తోడుగా ఉంటుంది … దగ్గర్లో మావయ్యా, అత్తయ్యా ఎలాగూ ఉండనే ఉన్నారు’’ అంది అన్నపూర్ణ కొడుక్కి ధైర్యం చెబుతూ.

                అందరూ ఆవిడ మాటనే సమర్ధించడంతో శరత్‌ ఒక్కడూ కొచ్చిన్‌ వెళ్లిపోయాడు.

                విశాఖపట్నం వచ్చేశాక అమృత తన సామాన్లు తీసుకొని కొన్నాళ్లు ఉండేందుకు తల్లి దగ్గరకు వచ్చింది. తాము ఉండేది ఊర్లోనే కనుక అభిరామ్‌ రెండురోజులకో సారి అత్తవారింటికి వచ్చి భార్యాబిడ్డలతో గడిపి వెళ్లసాగాడు.

                అన్నపూర్ణ పెట్టిన శెలవు ముగియడంతో కాలేజీకి వెళ్లి రాసాగింది.

                తల్లి కొంచెం కుదుటపడినట్లు అనిపించాక అమృత తమ ఇంటికి వెళ్లిపోయింది.

                ఆ రోజు ఆదివారమే కావడంతో తీరిగ్గా లేచి కాఫీ కలుపుకొని తాగుతూ పేపరు చూడసాగింది అన్నపూర్ణ. కాలింగ్‌ బెల్‌ మోగడంతో అన్నయ్య వచ్చినట్లున్నాడు అనుకుంటూ తలుపు తెరిచింది. ఎదురుగా అపరిచిత యువతి నవ్వుతూ కనిపించడంతో ఆశ్చర్యపోయింది. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు అనిపించినా … ఎక్కడ చూసిందీ అన్నపూర్ణకి గుర్తు రాలేదు.

                రాంగ్‌ అడ్రసుకు గానీ వచ్చిందేమోననే అనుమానంతో ‘‘ఎవరు కావాలమ్మా?’’ అని అడిగింది అన్నపూర్ణ.

                ‘‘నాకు మీరే కావాలి ఆంటీ … మీ కోసమే వచ్చాను. లోపలికి రావచ్చా?’’ అంది ఆమె అనుమతి కోరుతున్నట్లుగా అదే చిరునవ్వుతో చూస్తూ.

                ఆ మాటలు విని ఆశ్చర్యపోతూనే ‘‘రా అమ్మా!’’ అంటూ లోపలికి ఆహ్వానించింది అన్నపూర్ణ.

                లోపలికి వస్తూనే చుట్టూ చూస్తూ ‘‘మీ ఇల్లు చాలా బాగుంది ఆంటీ!’’ అని మెచ్చుకుంది.

                ‘‘థేంక్యూ … అలా కూర్చో!’’ అంటూ కుర్చీ చూపించి ‘‘కాఫీ కావాలా?’’ అని అడిగింది.

                ‘‘వద్దాంటీ … నాకు కాఫీ ఇష్టమే కానీ ఎక్కువ సార్లు తాగడం అలవాటు లేదు … మంచినీళ్లు ఇవ్వండి చాలు’’ అంది.

                చాలా టిపికల్‌ కేరెక్టర్‌లా ఉందే ఈ అమ్మాయి అని నవ్వుకుంటూ మంచినీళ్లతో పాటు నాలుగు బిస్కెట్లు పెట్టుకొని వచ్చి ‘‘తీసుకోమ్మా!’’ అంది అన్నపూర్ణ.

                కొంచెం మంచినీళ్లు తాగి బిస్కెట్‌ తీసుకొని కొరుకుతూ ‘‘థేంక్స్‌ ఆంటీ!’’ అందా అమ్మాయి.

                ‘‘ఎందుకు?’’ అనడిగింది అన్నపూర్ణ.

                ‘‘నన్ను లోపలికి రానివ్వడమే కాక ఇలా కూర్చోబెట్టి అతిథి సత్కారం చేస్తున్నందుకు. ఈ కాలంలో ఇలా అపరిచితులు తలుపుకొట్టి నవ్వుతూనే లోపలికి చొరబడి ఇల్లంతా దోచుకు పోతున్నారు కదా … ఆ కేటగిరీలో నన్ను కట్టి తలుపు మూయనందుకు’’ అందా అమ్మాయి నవ్వుతూ.

                ‘‘ఓ అదా … సరే చెప్పు, ఎందుకు వచ్చావు? నాతో ఏం పని?’’ అని అడిగింది అన్నపూర్ణ సూటిగా విషయానికి వస్తూ.

                ‘‘నన్ను మీరు గుర్తు పట్టలేదని నాకు ఇక్కడకు వచ్చిన వెంటనే అర్ధమైంది ఆంటీ … అఫ్‌కోర్స్‌, మీరు ఫొటోల్లో తప్ప బయట నన్ను స్వయంగా చూడలేదు కదా … గుర్తు పట్టడం కొంచెం కష్టమే లెండి! నా పేరు ప్రత్యూష. నేను హైదరాబాదు నుండి వచ్చాను’’ అంది కళ్లు దించుకొని. అంతవరకూ ధైర్యంగా తలెత్తుకొని మాట్లాడిన ఆ అమ్మాయి గొంతు సంకోచంతో చిన్నగా వణికింది.

                అప్పుడు గుర్తుకు వచ్చింది అన్నపూర్ణకు ఆ అమ్మాయి ఫొటో వదినగారి దగ్గర చూసిన సంగతి.

                అదే ప్రత్యూష తాము హైదరాబాదు వెళ్లి వచ్చిన కొత్తలో ఇక్కడికి వచ్చి ఉంటే ఇలా కూర్చో బెట్టి మాట్లాడేది కాదు అన్నపూర్ణ. కానీ ఇప్పుడు కొంచెం స్థిమిత పడిరది కనుక, అప్పటి బాధా, అవమానం లేకపోవడం వలన ఏమాత్రం ఉద్రేకపడలేదు.

                ‘‘అవును గుర్తుకు వచ్చింది … అయితే ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చినట్లు?’’ అంది సూటిగా చూస్తూ.

                ‘‘ఆంటీ, ఇలా మీ ఇంటికి రావచ్చో కూడదో నాకు తెలియదు. కానీ నా ఫీలింగ్స్‌ మీతో పంచుకుంటే తప్ప దానికో పరిష్కారం దొరకదనిపించి ఇలా వచ్చాను’’ అంటూ కొంచెం మంచినీళ్లు తాగి చెప్పడం మొదలు పెట్టింది.

సశేషం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top